అంతర్వాణి
ఆకాశాన్నడుగుతుంటాను
అడుగంటిన ఆశపై భరోసా నీడవు కమ్మని
ఎగిసే నిప్పు రవ్వనడుగుతాను
నిరాశల ముళ్ళకంపను కాల్చేయమని
నేలతల్లి నడుగుతాను
తప్పటడుగుల జీవితాన్ని సరిదిద్దమని
పీల్చేగాలిని అడుగుతాను
చెడుఆలోచనల కాలుష్యాన్ని పీల్చేయమని
దాహం తీర్చే నీటిని అడుగుతాను
తనువు మనసుల శుద్ధి చేయమని
పంచభూతాలన్నీ పాటుపడాలంటావు
జీవితం పాటగా మార్చుకునేందుకు
నీ పాట్లు నీవేపడాలంటూ అంతర్వాహినై అంతర్వాణి గొణిగింది
-సి.యస్.రాంబాబు