నాన్న!
నేను అమ్మ కడుపులో
తొమ్మిది నెల్లు
నీ గుండెలో పద్దెనిమిదేళ్లు
పువ్వులా పెరిగాను…
నీ తలా ఇల్లూ తాకట్టు పెట్టి
నన్నొక అయ్యా చేతిలో పెట్టావ్…
భర్తే దేవుడన్నావ్!
అత్తే దేవతన్నావ్!
మెట్టినిల్లే స్వర్గమన్నావ్
నిజమే…..
భర్త దేవుడే…. రాయి!
అత్త దేవతే…. కాళికా!!
కన్నీళ్ల కళ్ళాపి చల్లడంతో
మొదలవుతుంది నా కాపురం
పగలల్లా పనిజేయడం..
రాత్రి పందిరి మంచం మీద
అలంకరించిన శవంలా
పడుకోవడం నా సంసారం!
అరచేతుల్ని అంట్లు తోమడానికి
అంకితం చేశా!
కాళ్ళని వంటింట్లో
గుంజాల పాతేశా
వీపుని అత్తగారికెప్పుడో
అప్పగించేసా!!
చెవుల్ని బూతుల్ని వినడానికి
కాళ్ళని కన్నీళ్లు నింపుకోడానికి
అలవాటు చేశా!!
గొంతుని మొగుడి రెండు
చేతుల్లోనూ పెట్టేసా!!
సరే నోరు మీరేగా
కుట్టి మరీ పంపించారు
అత్తారింటికి!!
అత్త నన్నెంత దుమ్మెత్తి పోస్తున్నా
ధ్వజస్తంభంలా అలకడు, పలకడు
నా మొగుడు…..
ఆ ధ్వజస్థంబమే నయం
గాలికన్నా గంటలు అల్లాడతాయి!
గడపమీద జుట్టు విరబోసు
క్కూర్చున్న ఆడపడుచు
పేలు నొక్కుకుంటూ….
అత్తగారికి ఉప్పందిస్తుంది!!
పడక్కుర్చీలో పాతెయ్యబడ్డ
మావగారు…
జీర్ణం కానీ భగవద్గీత శ్లోకం
డోకుతాడు….
ఆ పెరట్లో నావంక దీనంగా
చూసేవి ఆవులు-గేదెలే
రాత్రవుతుందంటే బెంగగా
ఉంటోంది నాన్న,
తెల్లారుతుందంటే దడగా
ఉంటోంది నాన్న,
ఒక్కసారి అమ్మని నిన్నూ
చూడాలని ఉంది
మళ్ళీ పల్లకి ఎక్కేలోపు
ఒక్కసారి రావా!
ఈ ఉత్తరం మీకు అందేసరికి
నేను మీరు కోరుకున్నట్లు
నిజంగానే స్వర్గంలోనే
ఉంటానేమో…
గురువర్ధన్ రెడ్డి