బంగారం
ఆడది చిన్న తల్లిగా తల్లిదండ్రులకు బంగారు తల్లిపెద్దయ్యాక ఆ ఇంటి మహాలక్ష్మి ,యువరాణి ,తనుచెప్పిందే ఆ ఇంట్లో జరగాలి.జరిగి తీరాలి ఎందుకంటే నాన్నగారాల పట్టి కాబట్టి , ఇంకొన్ని రోజులు అయ్యాక ఆ బంగారాన్ని అతి భారమైన హృదయంతో మరో అయ్య చేతిలో పెడుతూ నా బంగారాన్ని బాగా చూసుకోమని చెప్తాడు ఆ తండ్రి, తల్లి చెప్పక పోయినా చెప్పినంత పని చేస్తుంది.
పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన ఆ బంగారం మరో మెట్టినింటికి బంగారు వన్నెలు తెచ్చే ఇల్లాలు అవుతుంది. ఇల్లాలు గా తన బాధ్యతలు చేపట్టి అన్ని సక్రమంగా అయ్యేలా చేస్తుంది. అత్తమామలకు కూతురు గా అన్ని తానై చూస్తుంది.భర్తకు భార్యగా అన్ని సేవలు చేస్తుంది.
ఆ తర్వాత కొన్నాళ్లకు తానూ ఒక బంగారానికి జన్మనిచ్చి పరిపూర్ణ మహిళ అవుతుంది. ఆ బంగారాన్ని బాగా పెంచుతూ, భద్రంగా చూసుకుంటుంది. మంచి చదువు చెప్పించి , తన కాళ్ళ పై తాను నిలబడేలా చేసి, తన బంగారాన్ని లోకం కొనియాడెలా చేస్తుంది.
ఎంతైనా మళ్లీ ఆ బంగారాన్ని మరో అయ్య చేతిలో పెడుతూ తన తల్లిదండ్రులను తల్చుకుంటూ ఉంటుంది. అమ్మమ్మగా, నాన్నమ్మ గా హోదాలు సంపాదించిన గర్వం తో నలుగురికి చెప్పుకుంటుంది.
ఆ బంగారం పేదరాలు అయితే గుట్టుగా సంసారం చేస్తుంది. భర్త బలాదూర్ గా తిరిగితే ఆ ఇంటికి దీపం గా మారి మాట రాకుండా చూసుకుంటుంది. అదే భర్త అరళ్లు పెడుతుంటే మౌనంగా భరిస్తుంది, తప్ప మాట బయటకు పొక్కకుoడా దాచుకుంటూ ఉంటుంది. భర్త పనికి రాని వాడు అయితే తానే పనిలోకి వెళ్లి ఇంటిని ,బాధ్యతను చేపట్టి తన బంగరాలకి ఏ లోటూ రాకుండా చూసుకుంటుంది.
ఉలి తో కొడితే బంగారం వంగుతుంది కానీ ఈ బంగారం మాత్రం కొట్టకుండానే ,అన్నిటికీ తానే తలవంచుతుంది. వంగిపోయిన నడుముతో కూడా ఇంటి నీ చూసుకుంటుంది.
ఇలాంటి బంగారాన్ని ఇంటింటా ఉంటుంటే ఆ ఇంటి అందం ఆనందంగా సాగుతుంది. అలాంటి బంగరాలన్నిటికి ఈ బంగారం వందనం చేస్తుంది.
– భవ్య చారు