మోసం చేశారు

మోసం చేశారు

ఇళ్ళ కోసం చాలా రోజులుగా వెతుకుతున్నారు ప్రేమ,రమేష్ దంపతులు. వాళ్లది రాజమండ్రి దగ్గర పల్లెటూరు. పెళ్లయ్యాక బ్రతకడం కోసం హైదరాబాద్ కి వచ్చారు.నాలుగు రోజులు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇంకెన్ని రోజులు ఉంటే వాళ్ళు ఏమనుకుంటారో అని ఇల్లు వెతకడం మొదలెట్టారు.

వాళ్లు అలా తిరగడం చూసిన ఒకతను దగ్గరికి వచ్చి, ఏంటండీ మీరు దేని కోసం వెతుకుతున్నారు అంటూ అడిగాడు. దానికి ప్రేమ అన్నయ్యగారు ఇక్కడ అద్దెకు ఏమైనా ఇల్లు దొరుకుతాయా అంటూ అడిగింది.

అయితే మీరు ఇల్లు కోసం వెతుకుతున్నారా అదృష్టం అమ్మ మీరు నాకు కనిపించారు. నేను ఇల్లుల్లు వెతికే బ్రోకర్ పని చేస్తుంటాను. మీకు ఎంతలో కావాలి ఇల్లు చెప్పండి అంటూ అడిగాడు.

అయ్యో అవునా అన్నయ్య గారు మాకొక అయిదు వేల లో ఇల్లు కావాలి. మేమిద్దరమే అయినా వచ్చే పోయే చుట్టాలు ఎక్కువ,కాబట్టి ఇల్లు కాస్త మంచిగా ఉంటే బాగుంటుంది అలాగే నీళ్లు కూడా బాగుండే ఇల్లు అయితే మంచిది అన్నారు ఇద్దరు.

ఓహ్ అలాగే అమ్మా ఇదిగో ఇప్పుడే ఇక్కడే ఈ పక్క వీధి లోనే మంచి ఇల్లోకటి ఉంది.చూపిస్తాను రండి అన్నాడు అతను. అతను ఎత్తు పొడుగుతో , మెడలో బంగారు గొలుసుతో, వేళ్ళకి ఉంగరాలతో బానే ఉన్నాడు.

సరే అన్నయ్య వెళ్దాం పదండి అంటూ ఇద్దరూ అతనితో వెళ్ళారు. అతను వారిని తీసుకుని వెళ్లి ఒక ఇల్లు చూపించాడు. అది మేడ పైన ఉన్న ఇల్లు . కింద ఎవరూ లేరు. కింద కూడా ఖాళీగా ఉందమ్మా, మీకు ఏది నచ్చితే దాంట్లో ఉండొచ్చు అంటూ ముందు పైన చూశాక కింద చూద్దాం అంటూ మెట్లు ఎక్కింది ప్రేమ..

సరే దానికేం భాగ్యం అంటూ అతను కూడా వారి వెనకాలే వెళ్ళాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు అతను కూడా వెళ్ళాడు. ఇంతలో …

ప్రేమ తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి స్కార్ఫ్ తీసింది. అతను దుమ్ము ఉందని ఆవిడ కట్టుకుంటుంది కాబోలు అనుకున్నాడు అతను . ఇంతలో ఇల్లు చూపిస్తూ ఉండగా రమేష్ వెళ్లి గది తలుపులు మూసాడు మెల్లిగా, వెంటనే వచ్చి అతని చేతులు పట్టుకున్నారు స్కార్ఫ్ తీసి అతని నోట్లో కుక్కింది. ఇంకో తువ్వల తీసి చేతులు కట్టేశారు.

అతను గింజుకుంటున్నా కూడా రెండు దెబ్బలు వేసి ,అతని మెడలో ఉన్న బంగారం , చేతి వేళ్ళకు ఉన్న ఉంగరాలు అన్ని తీసుకున్నారు. జేబులో వెతికితే కొంత డబ్బు కూడా దొరికింది. అవన్నీ తీసుకుని అతన్ని అలాగే ఉంచేసి భార్యా భర్త లు ఎప్పటిలా కిందకి వచ్చేసి,ఏమి తెలియకుండా గబగబా నడిచి ఇంకో వీధికి వెళ్ళారు.

అక్కడ పాపం ఇల్లు చూపిస్తే బ్రోకర్ గా డబ్బు వస్తుందని ఆశ పడిన అతను ఎవర్ని పిలవలో తెలియక గిలగిల లాడుతూ, అతను వారిని నమ్మినందుకు మోసం చేశారు అని ఉన్నది పోయింది అని మనసులో ఏడవ సాగాడు.

ఆ ఇద్దరు అసలు దంపతులు కారు. ఇలా భార్యాభర్తలు అని చెప్పి మోసం చేసేవారు.అదే వారి వృత్తి మోసం చేయడం. అందుకే అగంతకులను ఎప్పుడూ నమ్మకూడదు.

 

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *