మనుషులుంటేనే కదా
మనషులుంటేనే కదా నవ్వు విరిసేది
మాటలు ముత్యాలై కురిసేది
ఆనందాల కోటలు కట్టేది
మనుషులంటేనే కదా వాదాలు, వివాదాలు
పోటెత్తేది
శాంతించాక సారీలు చెప్పుకునేది
మనుషులుంటేనే కదా
కొత్త ఆలోచనల తోటలకు పాదులు తీసేది
ఆవేదనల కలుపును తొలగించేది
మనుషులుంటేనే కదా
నీరసించిన మనసు రీఛార్జ్ అయ్యేది
రేపటి వెలుగు లోన ప్రవేశించేది
మనుషులుంటేనే కదా బెంగలు తీరి
బతుకు తేలికయేది
నిస్తేజమంతా జలజలా రాలిపోయేది
మనుషులుంటేనే కదా
మాట మౌనాన్ని కడిగి
నవ్వు ముగ్గులేసేది
మనుషులుంటేనే కదా
ధైర్యం వెంటే ఉండి వేడుక చేసేది
ఓటమి అంచును తుడిచేసేది
రేపుందో లేదో కానీ
నేడయితే నిను వీడదని
మనుషులంటేనే కదా తెలిసేది
-సి.యస్.రాంబాబు