సినారె వర్ధంతి సందర్భంగా సాహిత్యంగా బతుకాలని!!!
పేదింటి రైతుగా పరిగ పుల్లలతో ఆగిపోక…
కర్షక సూర్యోదయంతో మట్టలో మెరిసిన
జాతిరత్నమై… తేలిన సినిలాకాశంలో
సింగపు రాచమర్యాదలతో స్థానమై నిలిచి…
చేసిన తరుణం అన్వేషణై మొలిపించిన
ధృవనక్షత్రమై కనబడుతు….నిలిచిన కథలను
కవితలుగా మెలిదిప్పుతు ఉత్తమ హస్తా
ప్రావిణ్యుడు ధీటైన పాటలను పాలించిన కవిరాజు…సినారె…
జ్ఞాపకాల గుదిబండలో దిగబడిపోక…
చైతన్యం పరిచిన దారులను తనకు
జ్ఞానంగా స్వీకరిస్తు…అల్లిన సిగలో
గుచ్చిన మొగలిపూల పరిమలమై కరిగిన
సిరిమాను చెక్కలాగ గంధాన్ని పంచుతు…
నేల పరిణయంగా తన నోటి పదాలను
పలికిస్తు వేదికలు చేసిన పరిచయాలను
దిశ నాలుగు విధాలుగా వ్యాపకమై
సాగింది ఒక యజ్ఞం…తెలుగు భాషా
పద పలుకులను పండించుటకు…
కాలం యథేచ్ఛను కవ్వింపుగా భావిస్తు…
నాదొక ఫలితాన్ని ఆశించని ప్రయాణమని
నేనొక వ్యక్తమైన కళారూపకంగా కాలానికి
సరి భాజకంగా నడుస్తునే…పురిటి నొప్పులు
తెలిసిన పేదవాని బతుకు చెక్కలను పూరిస్తు
సందర్భపు విషతుల్యాలను మౌనపు
సాహిత్యపు వర్ణనలో ఏకాంతాన్ని తనువుకు
పూసుకొని తడిసిన ఆవిష్కరణలను
ఆరబెట్టిన అభ్యుదయవాది…సినారె…
నాదన్నది లోకం కాదని నేనన్నది
తెలుగు సాహిత్యంగా బతకాలని పూటకు
దొరకని అజ్ఞానంతో వగచే బతుకులను
ఓదార్చుతు… వెలుగుల తేజం తెలుగు నేలపై
నేను సైతంగా నడవాలని…నడిచిన పదాల
పలుకుబడి తెలుగు తల్లికి వర్ణమాలతో
పూలమాలికలు కావాలని నిరంతరం తానొక
నైవేద్యంగా భాషనల్లుతు ఎన్నో బతుకులను
మార్చిన నేతగాడు…సినారె…
-దేరంగుల భైరవ