పాపం బాబూరావు
ఆదివారం శెలవ కాబట్టి
నిదానంగా లేచి ఆ తర్వాత
టిఫిన్ చేసి అలా- అలా నగరం
అంతా తిరిగేసి, టాంక్ బండ్ పై ప్రభుత్వం వారు అమ్ముతున్న నీరా తాగేసి, మధ్యాహ్నం ఏదో రెస్టారెంట్లో నచ్చినవన్నీ తినేసి
ఆ తర్వాత హాయిగా ఇంటికి
వచ్చి కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని, సాయంత్రం మళ్ళీ
అలా- అలా ట్యాంక్ బండ్ పై
లేజర్ లైట్ చూసేసి, రెస్టారెంట్లో
చికెన్లూ,మటన్లూ తినేసి ఆ తర్వాత సెకండ్ సినిమా చూసేసి…. ఇలా కలలు కంటున్న బాబూరావుకి
అతని బాస్ ఉదయమే
ఫోన్ చేసాడు. విసుక్కుంటూనే
ఫోన్ ఎత్తాడు బాబూరావు.
“రేపు ఆడిటింగ్ ఉందయ్యా,నువ్వు ఒక గంటలో రావాలి.మనం కూర్చుని ఆ పనంతా ఈ రాత్రి
లోపు పూర్తి చేద్దాం అన్నాడు.”
అన్నాడు బాస్.” రాత్రి వరకు అన్నాడంటే దానర్థం మధ్యాహ్నం భోజనం తన ఇంటి నుండి తెప్పించి పెడతాడు బాస్. వాళ్ళావిడ వండిన వంటలు కుక్కలు కూడా తినవని అటెండర్ రాంలాల్ అంటుంటాడు. మరి అలాంటి భోజనం బాసు లొట్టలేసుకుంటూ తింటాడు.పైగా తమతో తినిపిస్తాడు బాస్. అది ఆవిడ మీద ఆయనకు ఉన్న భయంతో కూడిన వినయ గౌరవం. “అది కాదు
సార్. ఈ రోజు ఆదివారం కదా.” అని నసిగాడు బాబూరావ్. “బ్యాచిలర్ గాడివి,నీకు ఆదివారం అయితే ఏంటి సోమవారం అయితే ఏంటి. త్వరగా వచ్చెయ్యి.
పని చాలా ఉంది. అవకాశం
ఉంటే ఆడిటింగ్ అయ్యాక
శెలవ ఇస్తాలే”అన్నాడు బాసు.
ఆయన అవకాశం ఉంటే అన్నాడు అంటే తర్వాత శెలవు ఇవ్వడన్నమాటే. ఉసూరుమంటూ ఆఫీసుకు
బయల్దేరాడు బాబూరావు.
అదే ట్యాంకు బండుపై బండి
పోనిస్తూ అక్కడకు దగ్గరే
ఉన్న తన ఆఫీసుకు బయల్దేరి వెళ్ళాడు బాబూరావు. పాపం
బాబూరావు. శెలవు పోయే
పని వచ్చే ఢాం ఢాం ఢాం..
-వెంకట భానుప్రసాదు చలసాని