నిజం బతకాలని

నిజం బతకాలని

 

సూర్యోదయపు సత్య వెలుగుల
పొద్దుతో నిజం బతకాలని వేడి శ్వాసల
వ్యథలతో గాధలను వ్యక్త పరచక…
నిర్ణయం సత్కరించిన నాదనే అహంకారపు
ఆవిర్భావాన్ని రూపుమాపుకో…

విలువల సందడితో పూసగుచ్చని
పూల మాలికలు విషయం పంచనిదని
పరిస్థితులను పనిగట్టుకొని వేదించకు…
సృజనతో వ్యక్తం రూపమవుతు…దేహంగా
మారని అవ్యక్తాలను మబ్బులకు విసరేయి

వడబోయని రహస్యాలతో
ఘణిభవించినది ధరణి గర్భము
గర్పితమై… తన్మయత్వపు లావాలతో
ఒదుగుతు ఒడి నిండిన భూమి ఎదిగిన
చోట పర్వతమై…పరిపక్వపు ప్రయాణంతో
కడలి నిక్షిప్తమై కనబడుతుంది…

అందం బంధం కాదు అహర్నిశలతో
అనుసరించే అనుసందానం అసలే కాదు…
ప్రలోభపు పంక్తిలో ఆథిత్యానికి ఆకర్షితుడవై
ఆశలను పెంచుకోకు…మనస్సు చాటున
మౌనమై ఆదరించే ఏకాంతానికి దొరుకుతు
స్వభావం సొంతమై పదిమంది మధిలను
పూయించేదే అందం…

 

 

-దేరంగుల భైరవ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *