స్త్రీ జీవితం
అబల కాదు సబల అంటారు
వంటింటి కుందేలును చేస్తారు
సామాజిక చట్రాలలో బంధిస్తారు
ఆమె జీవితాన్నికట్టుబాట్ల నిశీధిలోకి
త్రోసి అమావాస్య చీకట్లు చేస్తారు
ఆమెకు స్వతంత్రం లేదా
బ్రతుకంతా ఊడిగం చేయడానికే
పరిమితమా..
వయసు తారతమ్యం మరచి
అతను చేసే దాష్టీకాలను
ఎన్నాళ్ళు భరించాలి
తన కోరికలను అదుపులో
పెట్టుకుని ముసుగులోనే బ్రతకాలా
పున్నమి వెన్నెల స్పర్శకి
నోచుకునే అదృష్టం లేదా
అతను లేకపోయినా బ్రతకగల
మానసిక స్థైర్యం ఆమెది
ఆమె లేకుండా జీవించగల
నైపుణ్యం అతనికి కలదా ?
ఎంతటి కష్టమైన గుండె లోతుల్లో
దాచుకుని చిరునవ్వుతో తన
కుటుంబం కోసం కొవ్వొత్తిలా
కరిగే త్యాగం ఆమెది
ఆమెలేని జీవితం అతనికి కల్ల
అది ఏ బంధములో అయినా సరే
ఆధునిక యుగములోనూ
ఈ వివక్షలేమిటి?
ఇంకా ఎన్నాళ్ళు ఈ కృంగుబాటు
ఎన్నేళ్లు ఈ వెనకబాటు
ఆమె సహనాన్ని పరీక్షించకు
నిరీక్షించే ఆమె ఆగ్రహిస్తే
వినాశనమే అని తెలుసుకో
అనునయించే ఆమె గుండె పగిలితే
శస్త్రమై సృష్టించే విధ్వంసాన్ని
తట్టుకోవడం అతనికి సాధ్యమా?