ఎండ
కవిత రాద్దామని ఎ.సి. ఆన్ చేసి కూర్చున్నాను.
ఎండాకాలం రాగానే ముందుగా ఎ.సి. కనిపెట్టినాయనకి నివాళులర్పిస్తాను.
మా ఆవిడ లోపలికి వచ్చింది. “చేస్తున్నంత కాలం ఆ ఉద్యోగమూ, ఇప్పుడీ కంప్యూటరే నాకన్నా మీకెక్కువయ్యాయి అని దెప్పి పొడుస్తోందని మాట కలపడానికి “అబ్బ ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉన్నాయి” అన్నా.
“ప్రతీ సంవత్సరం ఇదే మాట అంటారు. పోయినేడాదీ ఎండలు ఎక్కువగా లేవూ”
“ఉన్నాయి, ఉన్నాయి. గుర్తుందా ఎండాకాలం అని ఎవరో సినిమా కూడా తీసినట్టున్నారు”
కవితకి ‘మండే ఎండలు’ అని శీర్షిక పెట్టానని ఒక మిత్రుడికి చెప్పా. మండే ఎండలు, ట్యూస్డే ఎండలు ఏంటి నీ పిండాఫుడ్డు అని కోప్పడ్డాడు. ఆ రోజు సోమవారం. అయినా కవిత్వం అర్థం చేసుకోలేని స్నేహితులుండడం కవికి పూర్వజన్మ శాప ఫలితం. ఆ స్నేహితుల సుకృతం.
కవితలో రెండు పాదాలు బానే కుదరగానే ‘ఎపుడూ లేని ఈ సంతోషాలే దాచాలంటే మది చాలో ఏమో’ అంటూ సిద్ శ్రీరామ్ పాటని హమ్ చేసాను.
“పాటలు మామూలుగా బాగానే పాడాతారుగా. ఈ పాట పాడడానికి ముక్కు అరువు తెచ్చుకోడమెందుకు” అని శ్రీమతి విసుక్కుంది.
మూడో పాదం కుదరడం లేదు. పరీక్ష రాస్తున్నపుడు సమాధానం తట్టకపోతే కిటికీలోనుండి బయటకు చూసినట్టు ఓ చూపు విసిరాను.
చెప్పులు కుట్టే అతను ఆ ఎర్రటి ఎండలో డివైడర్‌పైనే నెత్తిన ఓ తాటాకు ఛత్రంతో బిచాణా పెట్టేసాడు. జాలేసింది. రెడ్ సిగ్నల్ దగ్గర స్కూటర్వాలాలు అసహనంతో చిటపటలాడిపోతున్నారు. పాపం ఓ బాటసారి చెట్టు నీడ కోసం వెతుక్కుంటున్నాడల్లే ఉంది. ఇంకెక్కడి చెట్లు? కరెంట్ తీగలు, కేబుల్ వైర్ల గజిబిజి జీవితానికి అడ్డంగా ఉన్నాయని కొమ్మలన్నీ కొట్టేసారు. ప్రధాన రహదారి పక్కనే అవడంతో ఎదురు ఫ్లాట్స్‌లో ఉండే స్పూర్తిబాబు మంచి పేరు కొట్టెయ్యడానికి దుకాణం పెట్టేసాడు. అదే, చలివేంద్రం! వీడి క్రియేటివిటీ పాడుగాను. ఈసారి మజ్జిగతో పాటు టోపీలు కూడా సరఫరా చేసేస్తున్నాడు. నాకో మంచి ఆలోచన తట్టింది. అబ్బే కవిత గురించి కాదు, సామాజిక సేవా కాదు.
“ఓ స్పూను జీలకర్ర పొడి, రెండు కరివేపాకు రెబ్బలు, నాలుగు అల్లం ముక్కలు వేసి మజ్జిగ తీసుకురా” అని ఆర్డరేసాను. సాదా దోసెలా మజ్జిగకి చిటికెడు ఉప్పు మాత్రం తగిలించి బల్ల మీద ఏమాత్రం చిందకుండా ఠక్కున పెట్టి వెళ్ళిపోయింది.
“అలా ఇరవైనాలుగ్గంటలూ ఎ.సి.లో మగ్గకపోతే కాస్త ఎండలోకి వెళ్ళొచ్చుగా”
“ఎండాకాలం మిట్టమధ్యాహ్నం నడిస్తే వచ్చేది డి-విటమిన్ కాదమ్మా డీ-హైడ్రేషన్!”
అయినా బయటకి వెళితే తోపుడు బళ్ళవాళ్ళు, సిటీ బస్ కోసం ఆశ్రయం లేని చోట ఎండలో పడిగాపులు కాసే జనం… నేను వాళ్ళ కోసం ఏమీ చెయ్యలేను, వాళ్ళ బాధలు చూడలేను.
పిల్లలకి ఒంటిపూట బడులూ ముగిసి ఎంచక్కా వేసవి సెలవులు. వాళ్ళు ఎండలోకి వెళ్ళకుండా కాపాడుకోవడానికి తల్లులు అవస్థలు పడుతున్నారు. దేశంలో ఎవ్వరికీ లేనట్టుగా న్యాయమూర్తుల బుర్రలే వేడెక్కుతాయేమో? న్యాయస్థానాలకీ సెలవులే. మా ఎదురింటి లాయరుగారికి ఉక్కపోసే నల్లకోటు వేసుకునే బాధ తప్పింది. బనీను తొడుక్కుని హాయిగా పడక్కుర్చీలో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
ట్యాంకర్లు అపార్ట్మెంట్ వాసుల దాహాగ్నిపై నీటిజల్లు కురిపించడానికి యుద్ధ ప్రాతిపదికన తిరుగుతున్నాయి. నీడ విలువ లాగే నీళ్ళ విలువ కూడా ఎండాకాలమే తెలిసేది. మా చిన్నతనంతో పోలిస్తే వీధిపంపుల దగ్గర బిందెల ఆరాటాలు, పోరాటాలు తగ్గుముఖం పట్టాయి.
మాల్లో సేల్స్పిల్లకి నిలువుజీతం కష్టంగానే ఉన్నా ఎండాకాలం సుఖంగానే ఉంటోంది. బేరాలాడ్డానికి వచ్చినవాళ్ళకి ఒక పట్టాన బయటకి వెళ్ళబుద్ధి కావడం లేదు. మా బాల్యంలో ఎండాకాలం ఏ.సి.థియేటర్‌కి నూన్ షోకి వెళ్ళినపుడు మాకూ అలానే అనిపించేది. ఇంట్లో వట్టివేళ్ళ తడికలు తడపడంలో పోటీలు పడేవాళ్ళం. ఆ మట్టివాసన ఎంత బాగుండేదో. పచ్చడి మావిడికాయల హడావిడి అయితే చెప్పనే అక్కర్లేదు. ఎండాకాలంలో మూతికీ, ముక్కుకీ అంటుకుంటూ, చేతివేళ్ళ సందుల్లోంచి పళ్ళెంలోకి జారిపోతూ రసాస్వాదన కలిగించేవి మామిడిపళ్ళే. వాటికి బడ్జెట్ కేటాయింపులు తప్పనిసరి.
అప్పుడీ పవర్ బేకప్పులూ, ఇన్వర్టర్లూ ఎక్కడివి? విసనకర్రలూ, దినపత్రికలే వింజామరలు.
వాట్సప్పులో, దినపత్రికల్లో, యూట్యూబ్‌లో వచ్చే ఎండాకాలం జాగ్రత్తలన్నీ పాటిస్తూ వడదెబ్బ నుండి కాపాడుకుంటున్నామని సంబరాలు చేసుకుంటున్నారా? మరిన్ని జాగ్రత్తలు తీసుకోండి. రోహిణీ కార్తెలా నా కవిత వచ్చేస్తోంది.
-అనిసెట్టి శ్రీధర్