తల్లి- ఇల్లాలు

తల్లి- ఇల్లాలు

అమ్మ జానూ…. గదిలోంచి పిలుపు వినగానే “వస్తున్నా అత్తయ్య “అంటూ సావిత్రమ్మ గారి గదిలోకి వెళ్ళింది జాహ్నవి.“ఏమైనా కావాలా అత్తయ్యా…బెడ్ పాన్ తీసుకు రమ్మంటారా?”

“వద్దమ్మా…సుదీర్ పొద్దుననగా వెళ్ళాడు..కనీసం టిఫిన్ కూడా సరిగ్గా  చేయలేదు…భోజనానికి ఎప్పుడు వస్తున్నాడో కనుక్కున్నావా?”
“వస్తూనే ఉంటారు అత్తయ్య…ఈలోపు మీరు తినే సేయండి. టాబ్లెట్స్ వేసుకోవాలి కదా మీరు.”

“వద్దమ్మ…వాడు రానీ… అయినా కొత్తగా పెళ్లయిందన్న మాటే గానీ రోజంతా నీకు నా తోటే సరిపోతుంది. ఎప్పుడు చూసినా ఇద్దరూ నా చుట్టే తిరుగుతూ ఉంటారు. ఇలా అయితే నా చేతుల్లో పండంటి పాపనో, బాబునో ఎప్పుడు పెడతారు.?”

“మాకేం అత్తయ్య…మేము ఇప్పుడు బాగానే ఉన్నాముగా…” అత్తగారిని ఊరడించడానికి అలా అంటూ ఉండగానే  ఒక్కసారిగా కళ్ళు తడి అయ్యాయి జాహ్నవికి.

తను కూడా అందరి ఆడపిల్లల లాగే ఎన్నో ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టింది. భర్తతో కూడిన జీవితాన్ని ఎంతో రసరమ్యంగా ఊహించుకుంది. తన జీవిత సర్వస్వం అతడే అనుకుంది.తమ మధ్యకు మరో ప్రాణిని ఆహ్వానిస్తే ఇద్దరి మధ్య ప్రేమ తరిగిపోతుందేమో అన్న భయంతో ఇప్పట్లో ఆ ఆలోచన కూడా వద్దనుకుంది. భర్త ప్రతి చిన్న అవసరాన్ని దగ్గరుండి తీరుస్తుంది. అతని అభిరుచులకు తగ్గట్లుగా నడుచుకుంటుంది.

అతని రాక కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న తనని కాదని, ఆఫీసు నుండి రాగానే సరాసరి తల్లి గదిలోకి వెళ్ళిపోతాడు. ఆమె బాగోగులు కనుక్కున్నాకే తనన్నది ఒకతి ఉన్నదని గుర్తుకొస్తుంది.అలా అని తనను నిర్లక్ష్యం చేస్తాడని కాదు. తన అవసరాలు తీరుస్తాడు..కావలసినవి సమకూరుస్తాడు. కానీ తాను కలలుగన్న అందమైన ప్రపంచంలోకి మాత్రం రాడు. తను కోరుకున్నదేమిటి? తన భర్త ప్రపంచంలో తనకే చోటు ఉండాలి. అతని ప్రేమలో మొదటిస్థానం తనకే దక్కాలి.

తమ ఇద్దరికి మాత్రమే పరిమితమైన చిన్న చిన్న ఆనందాలను, ముచ్చట్లను తీర్చుకోవాలి. కానీ సుధీర్ ప్రపంచం మొత్తం అమ్మ చుట్టూనే. అమ్మ భోజనం చేసిందా, వేళకు మందులు వేసుకుంటుందా ఎక్సర్సైజులు క్రమం తప్పకుండా చేస్తున్నదా…ఆలోచనల్లో పడి భర్త వచ్చిన విషయాన్నే గమనించలేదు జాహ్నవి. ‘జాను… అమ్మ భోజనం చేసిందా? ఏంటి అలా ఉన్నావ్. ఆరోగ్యం బాగానే ఉంది కదా?”

నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగాడు. నేను బాగానే ఉన్నానండి. పదండి మీకు అత్తయ్య గారికి భోజనం వడ్డిస్తాను.భోజనం అయ్యాక సింకులో చేతులు కడుక్కుంటూ…సారీ జాను…నీకు ఇంటి పనులు, అమ్మను చూసుకోవడం తోటే రోజంతా సరిపోతుంది. కనీసం వీకెండ్ లో కూడా నిన్ను ఎటు తీసుకువెళ్ళలేక పోతున్నాను .

  “రేపు నిన్ను మీ అమ్మ వాళ్ళింట్లో డ్రాప్ చేస్తాను.  సాయంత్రం వరకు ఉందువు గాని.. రేపు నాకు వర్క్ ఫ్రం హోం. అమ్మను నేను చూసుకుంటాలే….ఏమంటావు?”
భార్య మొహంలోకి చూస్తూ అన్నాడు సుధీర్.మౌనంగా తల ఆడించిన జాహ్నవిని చూసి మెడిసిన్స్ బాక్స్ తీసుకొని తల్లి గదివైపు నడిచాడు.

    *-            *        *

“ఏంటి తల్లి….వచ్చినప్పటినుండి చూస్తున్నాను.. అదోలా కనిపిస్తున్నావు. నీ మొహంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయిలో ఉండే సంతోషమన్నదే కనిపించడం లేదు . అల్లుడుగారు నిన్ను సరిగా చూసుకోవడం లేదా.?

అత్తగారితో ఏమైనా ఇబ్బందా? ఏమైనా సమస్య ఉంటే చెప్పమ్మా..నాన్న గారితో మాట్లాడిస్తాను. అమ్మను నాకు కూడా చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా.. “

తన ఒళ్ళో తలపెట్టి పడుకున్న కూతురి తల నిమురుతూ ప్రేమగా అడిగారు  సుశీలమ్మ గారు.

“అదేం లేదమ్మా…నేను బాగానే ఉన్నాను. “

మొహం లోని భావాలు తల్లికి కనిపించకుండా జాగ్రత్త పడుతూ అంది జాహ్నవి.

“నా దగ్గర దాపరికం ఎందుకు తల్లీ .. అమ్మను నాకు తెలియదా నా కూతురు గురించి … నువ్వు దేనిగురించో మధన పడుతున్నావని  నిన్ను చూడగానే  గ్రహించాను.

ఎప్పుడూ గలగలా మాట్లాడుతూ నవ్వుతూ,నవ్విస్తూ తిరిగే నువ్వు వచ్చినప్పటి నుండి మౌనంగా ఎదో ఆలోచిస్తూ  నీదైన లోకంలో ఉంటున్నావు..మునుపటి జానూ లాగా ఏ మాత్రం లేవు. ఏం జరిగింది రా..అమ్మకు కూడా చెప్పుకోలేనంత కష్టం ఏమొచ్చింది  నీకు..” కూతురి ముఖాన్ని  పైకెత్తుతూ లాలనగా అడిగింది.

అప్పటివరకు ఘనీభవించిన మేఘంలా గుండెల్లో దాగి ఉన్న దుఃఖం అమ్మ ఆప్యాయతకు కరిగి కన్నీళ్ల రూపంలో బహిర్గతమై ఆమె చెక్కిళ్ళను తడిపి వేశాయి.

జాహ్నవి చెప్పినదంతా విన్న సుశీలమ్మ గారు ఒక్కసారిగా తేలికగా నిట్టూర్చారు …  కూతుర్ని దగ్గరగా తీసుకుంటూ“జానూ.. నువ్వు ఇంకా  ఎంత పెద్ద ఇబ్బంది గురించి చెబుతావో అని భయపడ్డానమ్మా….నా దృష్టిలో ఇది చాలా చిన్న సమస్య. ఒక విధంగా చెప్పాలంటే అసలు సమస్యే కాదు.

అల్లుడుగారు నువ్వు కోరుకున్నంత ప్రేమని అందించడం లేదనే కదా నీ ఫిర్యాదు? నేను చెప్పేది జాగ్రత్తగా విను తల్లీ.. మీ అత్తగారికి అల్లుడుగారు ఒక్కగానొక్క కొడుకు.చిన్న వయసులోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి కొడుకును పెంచి ప్రయోజకుణ్ణి చేసింది. తన సంతోషాలు అన్నీ వదులుకొని కొడుకు పైనే పంచప్రాణాలు పెట్టుకొని బ్రతికింది.

ఒక విధంగా కొడుకు కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. అలాంటి తల్లి అనారోగ్యంతో మంచం పడితే తల్లే లోకంగా భావించే ప్రతి కొడుకు లాగానే అతనూ స్పందించాడు.తన కోసం అంత చేసిన తల్లిని  అతడు నిర్లక్ష్యం చేస్తే బాధపడాలి కానీ అపురూపంగా చూసుకుంటున్నందుకు కాదు. తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నంత మాత్రాన నీ మీద ప్రేమ లేదని కాదు.

తల్లి ఆలనా పాలనలో పడి నిన్ను కాస్త నిర్లక్ష్యం చేస్తున్నాడు అంతే. కొత్తగా పెళ్లయిన అతడు తల్లికి భార్యకి మధ్య ప్రేమను పంచడంలో కాస్త తడబడుతున్నాడు అంతే.ఒక బాధ్యతాయుతమైన కొడుకుగా ఉన్న వ్యక్తి మంచి భర్తగా కూడా ఉంటాడమ్మా. తల్లిని ప్రేమించని వాడు భార్యను కూడా ప్రేమించలేడు.ఒకరకంగా నీవు అదృష్టవంతురాలివి. ఒక ఉత్తముడైన వ్యక్తిని నీవు భర్తగా పొందావు. పరిస్థితులకు అనుగుణంగా నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకో.

తొందరలోనే నీవు అనుభవిస్తున్న ఈ చిన్న వెలితిని కూడా అతడు తప్పకుండా అర్థం చేసుకుంటాడు. ఈ అమ్మ మాట మీద నమ్మకం ఉంచి  సంతోషంగా నీ భర్తతో వెళ్తావు కదూ…తర్వాత రోజు భర్తతో కలిసి అత్తారింటికి వెళ్తున్న కూతురు ముఖంలో పూర్వపు వెలుగును గమనించి తృప్తిగా నిట్టూర్చారు సుశీలమ్మ గారు.

             …….. సమాప్తం……

 

– మామిడాల శైలజ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *