వడ్డించిన విస్తరు

వడ్డించిన విస్తరు

అనుభవం జ్ఞాపకాలను వడ్డించిన
విస్తరు…తీపులని దగ్గరికై చేదులని
దూరమవుతు పెన్నిధికాని వెసలుబాటును
అవకాశాల సన్నిధిగా అవసరం నిలిపిన
మనషివై…కాయని కనువిప్పును
కావడి కర్రకు కట్టుకొని కారణాన్ని
పేక మేడలపై నిర్మిస్తున్నావు…

నిజం నిర్మొహమటమై దోచిన దొరల
గుండె చప్పుడు నీవవుతు…ఆకురాలిన
వనాన భయకంపితపు దావానలమై…
కోరికల ప్రాయచిత్తాలు కాలిపోతు
ఓరకంటిలో దృశ్యం జీవనానికి ఆధారం
కాలేక…పరిచిన బంధం పలుచనై వెలుగును ఎడబాపుతు నిలిచిన గమనంతో
దూరపు కొండల నునుపు ధనాన్ని చూస్తు…
ఆలకించని నిర్మాణుష్యంతో తలచిన
ప్రాకారాలపై నిలిచిన మమకారాలు
పేక మేడలుగా కూలిపోవాల్సిందే…

కష్టాల కడలిలో కన్నీటిని దాహంగా
తాగుతు…తీరం కనిపించలేదనే
నిరుత్సాహానికి నీరైతే…బతికిన కాలం
నీకు సమాదానం చెప్పదు…పగిలిన
హృదయమని నేటితో నడిచిన తీర్పునకు
సాక్ష్యంగా నిలబడలేక…అవిటి అస్త్రాన్ని
ప్రయోగించేది పేదవాడని లోకానికి లోకువవై
తెలియని దేహానికి నాగరికథా విన్యాసాలు
కూలిన పేక మేడల వంటివే….

ఈ లోకం పాడును ముద్రిస్తుంటే…
కులాల కార్పణ్యాలు కళ్ళార్పడం లేదు
కళ్ళుండి చూడలేని అందకారంతో
విడ్డూరాలు విధ్వంసక చర్యలై…కలత
చెందిన ప్రతి మనస్సు కల్పనా
చాతుర్యమవుతు నిరంతర క్షామంలో
తనువుల తపనలు తడుస్తు…ఆశయాల
సాధనలు మొలకెత్తే అవకాశం నివురు
గప్పిన నీడలతో కట్టిన పేక మేడల వంటిదే

 

-దేరంగుల భైరవ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *