వెలుగంతా నాదే
అక్షరం..
అమ్మలా ఆదరించక పోతే
ఈ అవనిపై అనాథనవుదునేమో..
కవిత్వం..
నేస్తంలా తోడుండకపోతే
నేలపై ఒంటరినవుదునేమో..
సాహిత్యం..
నాన్నలా నిలబడి వేలుపట్టి నడిపించకపోతే
అంధకారపు అగాధపులోయలలో
ఎక్కడో పడి వుండేదాన్నేమో..
అక్షరం
నాతో వున్నంత కాలం
అవని నాదే, ఆకాశం నాదే..
దిక్కులు, చుక్కలు, దిగంతాలన్నీ నావే..
జగతిలోని వెలుగంతా నాదే
ప్రతిరోజూ ప్రభవించే ఆ సూర్యుడు నా వాడే..
అమ్మలాంటి అక్షరం ఒడిలో ఒదిగి ఉన్నంత కాలం
కువకువల మెలకువల కూనిరాగాల వేకువలన్నీ..
నిత్యం నా కనురెప్పలపై వాలతాయి..
పదాల కూనలమ్మలు పొందికగా నా పెదాలపై చేరి
చిరునవ్వులతో నను పలకరిస్తాయి..
పగటినీ రాత్రినీ ఏకం చేసి
వెలుగునూ వెన్నెలను రంగరించి
అక్షరాన్ని మథించి
అల్లుతున్న కవితల లతలన్నీ
పదాల రెమ్మలతో
వాక్యాల కొమ్మలతో
శాఖోప శాఖలుగా విస్తరిస్తాయి..
ఈ ప్రపంచాన్ని పట్టి తెచ్చి
నా మ్రోల నిలుపుతాయి..
నన్ను మరో సూర్యునిలా జగతిలో నిలుపుతాయి..!!
-గురువర్ధన్ రెడ్డి