కవిత రాలేదు

కవిత రాలేదు

 

అక్షరానికి అక్షరం జోడించి
పదానికి పదం మేళవించి
వాక్యం కుదిరినప్పుడు
మాటల్లో వర్ణించలేని
ఒక అనుభూతికి లోనై రాసిన
ఆ కవిత రాలేదు…

అర్థవంతమైన మాటల్ని శోధించి
చదివే పాఠకుడికి
అర్థమవుతాదో లేదో అని పరిశోధించి
పదాలు అనే ఇటుకల్ని ఒకదానిపైనొకటి
పేర్చుకుంటూ రాసిన
ఆ కవిత రాలేదు…

సులభతర భాషలో
అంత్యానుప్రాసలో
అందంగా అలంకరించి పంపిన
నా కవిత రాలేదు

రాత్రంతా కలలు కని
ప్రొద్దున్నే కళ్ళు నులుముకుని
ఆత్రంగా కాస్త ఆత్రుతగా చూసినా
ఆ కవిత రాలేదు

అయినా సరే
కవిత రాలేదని
కవిని కాలేనంటే ఊరుకోను
కవిత రాలేదని
కలం కదపకుండా ఆగిపోను…

-గురువర్ధన్ రెడ్డి

0 Replies to “కవిత రాలేదు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *