తొలి కెరటం
సంద్రానికి
సూర్య చంద్రులకీ అవినాభావ సంబంధముందేమో
ఇద్దరినీ చూసి ఉప్పొంగే సాగరుడు
జీవితంలోని వగరును వదిలేయమంటాడు
ఎగసిపడు..మిడిసిపడకు..
మంద్రంగా ఉండు..మందకొడిగా ఉండకు..
పడిపోయినా ఫర్వాలేదు..లేచి నిలబడటం నేర్చుకో
అలల సందేశాన్ని అలా తీరం చేరుస్తుంటాడు
తీరేమయినా మారుతుందేమోనని
లేలేత ఉదయ కిరణాలయినా,
వెన్నెల వాటిక పరచిన చల్లదనమయినా
తలాపు వాకిటి పరిచిన వసంత సమీరంలా
తాతా బామ్మల వాక్చాతుర్యమై
వేడుకల వాక్చిత్రాన్ని
ముంగిట నిలుపుతాయి
ముందే కూసిన కోయిల పాటలా
మోముపై ఉత్సాహాన్ని
ఉదయపు తొలి కెరటంలా
చిలకరిస్తాయి.
-సియస్ రాంబాబు