శోభకృత్ రాగాలు
చైత్రమాసపు ప్రకృతి వసంతోత్సవ భావాలు
పెళ్లిపందిరిలా హరితవనం చిగురుటాకులు
తోరణాల శోభనలరించిన మామిడాకులు
ఎఱ్ఱనిముక్కున పచ్చని చిలుక పలుకులు
నల్లనయ్యనుపోలు వర్ణమున గానకోకిలలు
కన్నెమనసు తెలుసుకున్న కోయిల రాగాలు
జవ్వని చూపుతిప్పుకోనివ్వని యవ్వనాలు
ఎదపరువపు బరువుల్లా ఎత్తైన సొగసులు
షడ్రుచుల విందుకు ఒంటరి ఆహ్వానాలు
మగమహారాజు కోసం ఉగాది ఊరింపులు
ఏమని వర్ణింతు ఆమని సుస్వరజతులు
శోభనరాగాన ముంచెత్తవలె శోభకృతులు
శుభకామనాన దరహాసిని వలపుగాలాలు
కనుసైగల విరచించు కవ్వింపు కవితలు
కలానికి కళ్ళెమేసె మధురోహ వశీకరణలు
మనసుకు గాలమేసె మనువాడె తలపులు
బందీ చేసె సుందరాంగి కబంధబంధనాలు
గులామునై రాశా కావ్యనాయకి కథనాలు
డబ్బీరు వెంకట రమణమూర్తి ( శరత్కవి)