స్వేదబంధాన్ని బతికిస్తూ

స్వేదబంధాన్ని బతికిస్తూ

 

గెలుపొక బలమైన నమ్మకమని
మనస్సున దర్పణమై చీకటి సామ్రాజ్యానికి
వెలుగని….సంతృప్తుల సారాన్ని
నులక ప్రాయంగా అల్లిక చేసి….
నిమిషాని కొక కోరికను పెనవేస్తూ
తలచిన నిశ్చయాలను నిరాశతో
నింపకు….

ఓటమి బలహీనమని… వెలగని
అపనమ్మకపు హారతితో లోకం కళ్ళుకు
చూపులు కాలేక…సందేశాత్మకమైన ధోరణితో
మానసిక రూపానికి రాచబాటలు వేయలేక
గమనచ్చాయలను కూలదోసే పరాభవమని
గూడు కట్టిన మధిని తొలచకు…

గెలపోటములు జీవితానికి సాధారణ
అన్వయింపులే నని….
ప్రపంచాన్ని గెలవలేమనే ఖచ్చితాన్ని
పేదవాని ధీమాతో కదిలిస్తు…
ప్రతి స్వప్నం నేస్తమై ప్రతి క్షణాన్ని మధిస్తూ
తేలిన వెన్నలతో హృదయాలకైన గాయాలను మాన్పుతు…నువు నడిచే దారిని నిరంతరమై అనుసరిస్తు నిత్య హోమాలతో కుడి ఎడమల
సంధ్యారాగంగా గెలుపోటములతో
సంస్కరించబడు…

మట్టి పొరల మమకారాలుగా ఆవరించిన
భీకర సృష్టి తనను చుట్టిముట్టి…
అడుగున శూన్యం నిండిన చీకటిలో
ఏకాంత యోగ సాధనా బీజానికి
తన్మయత్వపు ప్రయాణమై…
భూమిని చీల్చుకు వచ్చింది ఒక గెలుపు
నవ్య నూతనమై బతికే నీ కాలానికి
గెలుపోటములు సమానాలే…
కూలదోసే ఆలోచనలు మాని మెదడును
తొలిచు గమ్యానికై….

ఎముకలేని నాలుక పై వల్లించే నీతులు
గుగ్గిపాల బతుకులను రూపంగా మార్చలేవు
వాటిని అనుసరించి మోచేతి నీళ్ళ తాగక…
శ్రమలో జారిన చెమట చుక్కల స్వేదబంధాన్ని
బతికిస్తు… ఆకలన్న వారికి అన్నమవుతు
చైతన్యపు రథసారత్యాన్ని స్వీకరించు
పండిన మాగాణుల్లో పైరు పచ్చలుగా
కనబడుతు గెలుపోటములను దారి
ప్రలోభాలకు గురిచేయకు…

 

దేరంగుల భైరవ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *