అక్షరం
అక్షరం అనే పదం చాలా పదునైనది అది కత్తిలా కొస్తుంది, బాకులా ప్రశ్నిస్తుంది. అక్షరానికి ధన, పేద అనే తేడా లేదు అది ఎవరినైనా ఏదైనా అడగవచ్చు. ఏదైనా చేయవచ్చు. అక్షరాలన్నీ ఏర్చి కూర్చి దాన్ని ఒక పదునైన ఆయుధంగా మార్చవచ్చు. కత్తి కంటే కలం గొప్పది. కలంతో ఏన్నో అక్షరాలు రాయొచ్చు. నిజాలు నిర్భయంగా చెప్పవచ్చు. భావ ప్రకటనకు అక్షరాన్ని ఆయుధంగా మలుచుకునే వారందరూ తమపై జరిగే దాడులను ప్రశించడం పరిపాటి. కానీ కొన్ని సార్లు ఆ అక్షరాలే కొందరి ప్రాణాలు తీశాయి.
ఎందుకు అంటే ప్రశ్నించడం తప్పు, అది కూడా అందరి ముందు పత్రికలో వేయడం తప్పు, ఆ తప్పు చేసినందుకు కాను, ప్రశ్నించినందుకు గానూ వారి కలాన్ని, వారిని అంతం చేశారు. అక్షరాలతో ఎన్నో ఆటలు ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఆట వెలదులుగా మార్చవచ్చు, నాట్యాన్ని చేయించవచ్చు, వేదననూ, ఆవేదనను, ఆక్రోశాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, బాధను, విరహాన్ని, శృంగారాన్ని ఇలా ఎన్ని విధాలుగా అయినా అక్షరాన్ని వాడవచ్చు.
అదే అక్షరాన్ని ఆయుధంగా ప్రత్యర్ధులపై దూసుకు వెళ్లేలా చేయవచ్చు. అక్షరంతో రాసిన పదాల కూర్పు మన భావాలు, మన ఆలోచనలు అనేవి ఎప్పటికీ కాలగర్భంలో కలిసిపోవు, ఎప్పుడూ ఎవరో ఒకరి నోటి నుంచి వెలువడుతూనే ఉంటాయి. ఎప్పుడూ అవి జీవిస్తునే ఉంటాయి. మనం ఉన్నా లేకున్నా మన ఆలోచనలు ముందు తరాలకు పెన్నిధిగా అక్షర లక్షలుగా నిధి నిక్షేపాలు వలె దాగుంటాయి.
ఒక్కసారి మనం రాసిన కథలు, కవితలు, పాటలు, వ్యాసాలు ఏవైనా మనకు స్థిర పడిపోయి ఉంటాయి అనడం లో సందేహం లేదు. ఇప్పుడు అంటే సాంకేతికత పెరిగి అక్షరానికి విలువ లేకుండా పోయిందని బాధ పడుతున్నాం. కానీ మన ముందు తరాలలోని వారు మన అక్షరలానే చదువుతారు. మనల్ని గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే మన పూర్వీకుల వల్లనే మనకు రామాయ మహాభారతాలు తెలిసాయి. వారికి కూడా మన అక్షరాలతో రాసిన రాతలు నిధి నిక్షేపాలతో సమానం అవుతాయి అనడం లో సందేహం ఏమి లేదు.
అందువల్ల మనకు తెలిసిన విషయాలు అన్నీ రాయాలి. దేన్నీ వదిలిపెట్టకుండా అన్ని రకాల రచనలు, వ్యాసాలు రాయాలి. మన జ్ఞాపకాలు చిన్ననాటి అనుభవాలు, జీవిత సత్యాలు, జీవిత చరిత్రలు లాంటివన్నీ రాసి పెడితే ముందు తరం మనల్ని ప్రతిరోజూ గుర్తు చేసుకుంటుంది. ఇది నిజం ఇదే వాస్తవం. అక్షరమే ఆయుధం అని నలుగురికి చాటుదాం.
– భవ్య చారు