మనిషిని కదా
ఒంటరిగా వేకువ జాడను
వెతకాలని ఉవ్విళ్ళూరుతాను
కలలను వెంటేసుకుని
దిగంతాలకు సాగిపోతాను
అక్షరాల తోటలో విరబూసిన కవితా పుష్పాలను
ఆఘ్రాణిస్తూ మరోప్రపంచంలో విహరిస్తాను
ఆశల కుదుళ్ళు చేసి ఆకాంక్షల జలాన్ని చల్లి
మనిషికి సామరస్యపు అంటు కడతాను
అసూయాద్వేషాల చీడపీడలకు మానవత్వమే మందంటాను
చీలిపోయిన మనుషులకు
అనురాగ గీతాన్ని నేర్పుతాను
– సి.యస్.రాంబాబు