స్నేహ హస్తం పార్ట్ 1
అన్నపూర్ణ కాలనీలోకి లారీ ఒకటి పచ్చి తాగింది అందులోంచి దిగిన రామారావు,
“తొందరగా దింపండి సామాను మళ్లీ అన్ని సర్దుకోవాలి” అని చెప్పాడు లారీ డ్రైవర్ క్లీనర్ తో…
“అలాగే సార్ గంటలో వేస్తాం కానీ కొంచెం చాయి ఇస్తారా?” అంటూ ఆశగా అడిగాడు డ్రైవర్.
“అదేంటయ్యా వచ్చిందే ఇప్పుడు ఇంకా పాలు పొంగించలేదు ఇక్కడెమో ఎవరూ తెలియదు మాకు అప్పుడే టి అంటావేంటి? అంతగా కావాలనుకుంటే వెళ్లి ఎక్కడైనా టీ కొట్టులో తాగేసి రండి” అని జేబులోంచి డబ్బులు తీయ పోయాడు రామారావు.
“అయ్యో ఎందుకండీ డబ్బులు ఇవ్వడం మేము లేమా ఏంటి…!? అంటూ వచ్చింది పక్కింటి వనజ.
“అయ్యో మీకు ఎందుకండీ శ్రమ” అన్నాడు ఆమె పక్కింటి లోంచి రావడం చూసి.
“అదేంటి అన్నయ్యగారు… మనం ఎప్పటికీ ఉండేవాళ్ళం ఆ మాత్రం చేయకపోతే ఎలా అయినా మా ఇంట్లో ఎప్పుడూ టీ రెడీగానే ఉంటుంది… తీసుకో బాబు” అంటూ ప్లాస్టిక్ గ్లాసులు వాళ్ళకి ఇచ్చి, “వదిన గారు ఇంకా రానట్టు ఉన్నారు…” అంది.
“అదేమీ లేదమ్మా వస్తున్నారు” అనగానే కారు వచ్చి ఆగింది.
“అదిగో వచ్చినట్లున్నారు” అంటూ కారు దగ్గరికి వెళ్ళాడు రామారావు.
“అన్నీ సరిగ్గానే ఉన్నాయా? కింద ఏమైనా పడేసారా?” అంటూ దిగింది గాయత్రి.
“అబ్బా ఇంకా దింపలేదులే చూడు ఆవిడ ఎదురింటి ఆవిడ టీ ఇచ్చింది.” అని అంటూ చెప్పడంతో అటు చూస్తూ,
“నమస్తే వదినగారు, నా పేరు గాయత్రి.” అంది ఆవిడకు ఎదురు వెళ్తూ…
“ఓ వదిన గారు నమస్తే అండి నా పేరు వనజ మీ ఎదురు ఇంట్లోనే మేము ఉండేది…” అంది చేయి కలుపుతూ…. ఇద్దరూ కౌగిలించుకొని,
“అవునా మా ఆయన రామారావు గారు బ్యాంకులో పని చేస్తారు ఈయన ఉద్యోగం వల్ల ప్రతి ఏడు తిరగవలసి వస్తుంది. ఊరు ఊరు తిరుగుతున్నాము. పిల్లల చదువులు కూడా పాడు అవుతున్నాయి. ఏమి ఉద్యోగాలో ఏంటో వదిన” అంది వనజ.
“అవును వదిన మా ఆయన రఘు కానిస్టేబుల్ అన్నట్లే కానీ ఎప్పుడు ఎక్కడ డ్యూటీ పడుతుందో ఏంటో రోజుల తరబడి వెళ్తారు… అందుకే నేను కష్టమైనా పిల్లల చదువులు పాడవుతాయి అని ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను. సొంత ఇల్లు అయితే ఎక్కడికి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా మళ్లీ ఇక్కడికి రావాలనే ఆలోచన మనోళ్ళకి ఉండేలా చేయాలి” అని నవ్వుతూ అండి వనజ.
“అవును అంతే లెండి” అంది గాయత్రి. ఇంతలో “అమ్మా….” అంటూ కార్లోంచి దిగి తల్లి దగ్గరికి వచ్చారు బాబు, పాప.
“ఇల్లు చాలా బాగుంది అమ్మ” అంటూ…. ఓ మీకు కూడా ఇద్దరు పిల్లలా…! నాకు అంతే ఒక పాప ఒక బాబు… బాబు ఏం పెర్లమ్మా మీవి” అడిగింది వనజ.
“ఆంటీ నా పేరు వాసూ, ఇది గిరిజ” అన్నాడు.
“ఏం చదువుతున్నారు మీరు? అంటూ అడిగింది.
“నేను పది ఇది ఎనిమిది” అన్నాడు వాసు గిరిజ ని చూపిస్తూ… వనజ నవ్వుతూ వింటోంది.
“ఓ అలాగా నేను మాటల్లో పడి టీ ఇవ్వడం మర్చిపోయాను.” అంటూ లోపలికి వెళ్ళింది వనజ.
తదుపరి భాగం లో ఏం జరిగిందో చదవండి
– భవ్య చారు