భర్త ప్రేమ..

భర్త ప్రేమ..

భార్య కోసం భర్త రాసిన ఓ లేఖ

నీవేవరో తెలీదు.. మా కన్నవాళ్ళు నిన్ను చూపించి ఇదిగో ఇదేరా నీకు కాబోయే భార్య అన్నారు.. నీ అందాన్ని మాత్రమే చూడగలిగాను.. నీ మనసు ఏంటో తెలీదు..
నువ్వు ఎలా ఉంటావు ఎలా నడుచుకుంటావో తెలీదు.. మా అమ్మ నాన్నలని ఎలా చూసుకుంటావో తెలీదు.. అసలు నువ్వేంటి నీరూపం ఎంటి నీ మనస్తత్వం ఎంటి.. ఇవేమీ తెలీదు.. కానీ మా వాళ్ళు నిన్ను చూపించారు అనే ఒక్క కారణంతో నీ నుదుటిన బొట్టు పెట్టి నీ చిటికెన వ్రేలు పట్టుకొని నీతో ఏడడుగులు నడిచాను..

మా ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుండి నిన్ను అర్దం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా.. కానీ నువ్వు నాకు ఏ మాత్రం అర్దం కావటం లేదు.. మా అమ్మ నన్ను ఎలా చూసుకుందో.. నేను నిన్ను అలాగే కంటికి రెప్పలా ప్రాణంగా ప్రేమిస్తూ వస్తున్నా.. కానీ నువ్వు ఏ మాత్రం కనికరం లేకుండా చిన్న చిన్న విషయాలను కావాలని పెద్దదిగా చేస్తున్నావు.. ఇష్టం లేదో.. నీకేం కావాలో నాకు మాత్రం అర్థం కావడం లేదు..

ఏదన్నా ఉంటే చెప్పుకుంటేనే కదా తెలిసేది.. కానీ నువ్వు చెప్పవు.. నీ బాధ బయట పెట్టవు.. నీ మనసు అర్ధం చేసుకోవడం నా వల్ల కావడం లేదు.. రోజు రోజుకీ నిన్ను కొత్తగా ఎలా ప్రేమించాలి అని రోజూ కొత్తగా నాకు నేను ఎంతో మారాను… అసలు నేను నీ భర్తని అనే విషయం అయినా గుర్తుందో లేదో తెలీదు.. నిన్ను ప్రేమించే ఆరాటంలో నాకు నేను దూరం అవుతున్నా నీ బాధ ఇప్పటికీ అయిన చెప్పు లేదంటే పిచ్చి వాడిని అయ్యేలా ఉన్నాను..

అది చదివిన భార్య.. ప్రత్యుత్తరం.

ఎన్నో కళలతో… ఎన్నో ఆశలతో మీ ఇంట్లో అడుగు పెట్టాను.. నా భర్త అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఏ ఆడపిల్ల అయినా ఎన్నో కలలు కంటుంది… కానీ నీ ప్రేమ అంతకు వంద రెట్లు అధికంగా ఉంది.. నువ్వు చూపించే ప్రేమలో నేను రోజు రోజుకి ఎంతో కుమిలి పోతున్నాను. అదేంటి సంతోషించాలి కదా ప్రేమ అర్ధం అయితే.. కుమిలి పోవడం ఏంటి అనుకుంటున్నారా? మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టి.. మీ వంశాభివృద్ధి చేయడానికి.. మీకు భార్యగా.. మీ ఇంటి కోడలిగా.. మీ వారసులకు తల్లిగా.. తల్లిగా… హ్మ్ తల్లిగా ఉండే అదృష్టం నాకు లేదు..

మా పుట్టింటి వాళ్ళు మీ దగ్గర ఈ విషయం దాచిపెట్టి నా పెళ్ళి చేశారు. ఆ విషయం నాకు పెళ్లి అయిన రెండో రోజు తెలిసింది.. నాకు నేను చాలా కుమిలి పోతున్నాను.. మీతో ఈ విషయం చెప్పలేక.. కానీ మీకు నిజం చెప్పే ధైర్యం లేదు.. అందుకే మిమ్మల్ని మోసం చేసిన దానిలా మీ ముందు తల ఎత్తుకుని తిరిగే ధైర్యం లేదు.. మీ ప్రేమను పొందే అర్హత లేదు.. నన్ను క్షమించండి.. నేను మీకు తగిన దానిని కాదు.. నాకు నేనుగా మీ జీవితంలో నుండి తప్పుకుంటున్నాను..

ఈ లేఖ చదివిన భర్త కళ్ళలో నీళ్ళు తిరిగాయి..

నేరుగా తన భార్య దగ్గరికి వెళ్ళాడు.. భర్త ను చూసిన భార్య కాళ్ళ మీద పడి ఏడుస్తుంది.. నన్ను క్షమించండి.. ఇక సెలవు.. అంటుంది.. అపుడు భర్త నువ్వు ఏం తప్పు చేశావు.. అని ఇంత బాధ పడుతున్నావు….? నీకు అమ్మ అయ్యే వరాన్ని ఇవ్వని ఆ దేవుడు కదా తప్పు చేసింది.. ఆ దేవుడు చేసిన తప్పుకి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు..?

ఇక అమ్మ అంటావా…? నాకు అమ్మవీ అవ్వు.. నేను నీ ఒడిలో పసి బిడ్డనవుతా…
ఒకరికి ఒకరం అవుదాం…
మనకు మనమే అమ్మా నాన్నలం…
సరేనా అని దగ్గరికి తీసుకుంటాడు..

నిజంగా ప్రాణంగా ప్రేమించే భర్త భార్య చేసే పొరపాట్లను సరిదిద్దుతాడు.. ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటే.. ఆ బంధంలో ఎలాంటి అవరోధాలు ఉండవేమో.. ఇలాంటి ఇంత ప్రేమను పంచే మగవాళ్లకు మనస్పూర్తిగా వందనాలు తెలుపుకుంటున్నాను .

– వనీత రెడ్డీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *