పట్టపగలు వెండి పూలతోటలో
పాఠశాల విద్యార్థులతో పాటుగా ఎవరైనా టీచర్స్ కూడా వెళ్ళాలి అంటూ పాఠశాల లో ప్రధాన ఆచార్యుల వారు చెప్పడం వల్ల ఎప్పుడూ ఆ ఊరు దాటి వెళ్ళని నేను వాళ్ళతో వెళ్తానంటూ చెప్పాను. కానీ వెళ్లడానికి ఇంట్లో పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. వద్దని, నీకేం తెలియదు అని ఇంట్లో వాళ్ళు అంటే, నేనెప్పుడూ వెళ్ళలేదు వెళ్తాను అంటూ నేను గొడవపడడం, చివరికి నా మాటే నెగ్గి వెళ్లడానికి సిద్ధం అయ్యాను.
తోటి వారితో కలిసి మరొక కొత్త ప్రదేశానికి వెళ్ళడం, అది ఒక రోజంతా వేరే కొత్త ప్రదేశాలు చూడడం ఒక రకమైన మజాగా వుంటుంది కాబట్టి తినడానికి తలో రకం చేసుకు వస్తాము అన్నారు మిగిలిన వారు. మరి నేనేం చేయాలి అన్నాను.
మీకెందుకు లెండి మాతో వస్తె చాలు. మీ మనసు కాస్త కుదుటపడుతుంది అంటూ నేస్తాలు, నా గురించి అన్నీ తెలిసిన వారు అనడంతో మనం ఉరుకోము కాబట్టి ఏదో ఒకటి మామూలు రకం చేసుకుని వెళ్దాం అని అన్నం, పెరుగుతో దద్దోజనం అందరికీ సరిపోయేలా చేసుకున్నాం. ఆ రోజు పొద్దున్నే ఎనిమిది గంటలకు నలభై మంది విద్యార్థులతో పాటు మేము నలుగురు ఉపాధ్యాయురాళ్లము కలిసి చిన్న మినీ వ్యాన్ లో బయలు దేరాము. నాకు కిటికీ దగ్గర కూర్చుని వెళ్ళడం అంటే చాలా ఇష్టమని నా నెచ్చెలి తన స్థలాన్ని నాకు ఇచ్చేసి తాను వేరే దగ్గర కూర్చుంది.
నేను కిటికీ పక్కన కూర్చుని అలా వెళ్తున్న చెట్లు, చేమలు ప్రకృతి అందాలు చూస్తూ చిన్న చిన్న ఊర్లు దాటుతూ వెళ్తుంటే ఆ ఊర్ల చివర ఉన్న చెరువులు, అందులోని నీళ్లు ఎండకు మెరుస్తూ కదలాడడం, ఆ చెరువులోని పువ్వులు పట్టపగలే వెండిని సంతరించుకున్న పువ్వుల్లా కనిపించడం మనసుకు ఎంతో హాయిగా అనిపించింది.
ఇక హైద్రాబాదుకు చేరాక లుంబిని పార్కు, జూ పార్క్ లను సందర్శించాము. పిల్లలతో పాటూ నేనూ ఆనందించాను. కాసేపు అయినా నా బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా చిన్న పిల్లలా మారిపోయాను. చివరికి ట్యాంక్ బండ్ లో పడవ ప్రయాణం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ఆ నీళ్లు ఎండలో వెండి పూలలా కనిపించాయి నా కళ్ళకు.
ఒక్కొక్కరి మనసు, ఒక్కక్కరి కళ్ళు, భావాలు, ఉన్న పరిస్థితి మనకు ఏవో చూపిస్తుంటాయి. ఆ క్షణంలో నా కళ్ళకు అక్కడ ఉన్న ప్రదేశం అలా కనిపించడంలో వింత లేదు. నేనున్న పరిస్థితిలో అలా కాసేపు నా అంతులేని భావాలను బయటకు రావడానికి వచ్చే క్షణం కాబోలు అందుకే పట్ట పగలు ఆ నీళ్ళలో పడవ ప్రయాణంలో నాకు ఆ నీళ్లు ఎండకు మెరుస్తూ వెండి పూల తోట లాగా కనిపించాయి.
అక్కడి నుండి గండిపేటకి వెళ్ళాము. అక్కడ కూడా అలాగే అనిపించింది. ఇక్కడి కన్నా అక్కడ ఇంకా ప్రశాంతంగా అనిపించడంతో పిల్లలతో పాటూ మేము అక్కడే తెచ్చుకున్న ఆహారాన్ని అందరం పంచుకుంటూ తినడం, విద్యార్థులు మాకు తెచ్చి ఇవ్వడం, మేమూ మా ఆహారాన్ని వారితో పంచుకోవడం సరదాగా అనిపించింది.
ఇక సాయంత్రం అయ్యేసరికి వెళ్ళాలి, ఇంటికి తొందరగా చేరాలి అనే ఒక ఆందోళన అందరిలో కనిపించసాగింది. కానీ నాకు మాత్రం కదలాలని లేదు. కానీ తప్పదు కాబట్టి నా మనసు ఊసులన్నీ అక్కడే బందీని చేసి కొంచం బాధ, కొంచం సంతోషంతో తిరుగు ప్రయాణం అయ్యాము. ఇక వెళ్లిన దారినే అయినా, అందరూ తిరిగి తిరిగి అలసిపోయి నిద్రలోకి జారుకున్నారు. కానీ నా కళ్ళు మాత్రం మళ్లీ వెళ్లిన ప్రాంతాలలోనే తిరుగాడుతూ ఆ వెండిపూలతోటను గుర్తు చేసుకుంటూ, కళ్ళు మూస్తే మర్చిపోతానేమో అని నిద్ర పోకుండా ఇంటి వరకు మోసుకు వచ్చాను.
ఇది చాలా చిన్న విషయమే కావచ్చు. కానీ మనసు బాధలో, లేదా విషాదం లో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు అలా మనకు గుర్తుగా జీవితాంతం ఉండిపోతాయి. నా మనసింకా ఆ జ్ఞాపకాలను మర్చిపోలేదు మర్చిపోదు కూడా..
– భవ్య చారు