రైతు జీవితం
1. తే.గీ.
గూడు లేకున్న కానల కూటి కొరకు
పోడు గొట్టుచు ముళ్ళతో పోరు సలుపు
పాడి పంటలు పెంపొంద పాటు పడుచు
మాడు చుండెడి రైతు సామాన్యు డగునె
2. తే.గీ.
ఇష్టమున్నను లేకున్న యిలను దున్ని
కష్ట పడినను రైతుపై కరుణ లేదు
ముష్టి వాళ్ళను జేయుచు మురిసి పోవు
నాయకుల మాట లెవ్వరూ నమ్మరాదు
3. ఆ.వె.
ఆత్మహత్య పాపమందురే గాని మా
నిత్య జీవితమున నిజము గనరు
నమ్ముకొన్న పంట నానాట ధరలేక
రైతు బతుకు లిట్టి రాతలాయె
4. ఆ.వె.
రైతు జన్మభూమి రాణించె నేతీరు
కొరతలేక నీరు కోరినాము
ఊతమిత్తుమంటు ఊరించి పోయిరి
మాటలన్ని నీటి మూటలాయె
5. ఆ.వె.
ఎన్ని రంగములను ఎందరున్నను గాని
అన్నదాత కన్న అధికులెవరు?
అన్నదాత గుండె ఆరాట పడినచో
కన్నవారి మనసు కరుగకున్నె?
– కోట