సమిష్టి గృహం
ఒక పౌరుడి మాతృదేశం పైన ప్రేమ ప్రకృతి పట్ల ప్రేమతో ప్రారంభమవుతుంది అన్నాడు ఒక రచయిత..
ఆధునిక నాగరికత వల్ల ప్రకృతి నుండి క్రమక్రమంగా దూరం జరుగుతున్నాము. అది అత్యున్నతమైన జీవన సంస్కృతిగా భావించి అనేక ఉపద్రవాలకు కారణమవుతున్నాము. ఒక సూర్యోదయాన్ని ఒక సూర్యాస్తమయాన్ని చూడకుండా కొన్ని సంవత్సరాలు ఉన్న వాళ్లు కూడా ఎందరో.. అంత ఉరుకుల పరుగుల కృత్రిమ జీవితానికి అలవాటు పడిపోయి ప్రకృతి మాతకు దూరంగా అత్యధునిక జీవనం తాలూకు సుఖాల కోసం పరుగులు పెడుతున్నాము.
ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, చెట్లు, పువ్వులు ఇలా ఎన్నో రూపాలలో మన చుట్టూ ఉంది. వాటిలో లాగా మనము ప్రకృతిలో అంతర్భాగమే.. మన జీవితం ప్రకృతి మీదే ఆధారపడి ఉంది. ప్రకృతి నియమాల ప్రకారమే మనిషి సృష్టించబడ్డాడు కానీ ఆ ప్రకృతి నియమాలని అనుసరించకుండా ప్రకృతి ప్రకోపానికి గురై అనేక ఉపద్రవాలను తెచ్చుకుంటున్నాము. ప్రకృతిని ప్రేమించి దానితో మమేకమైనప్పుడు మాత్రమే మానవ జీవితం ఉనికి యొక్క అర్థం తెలుస్తుంది.
ప్రకృతి మనకు జన్మనిచ్చింది ఆమెను దర్శించడం, తన నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించకుండా బాధ్యతగా ఉండడం ప్రకృతి మాత సంతానంగా మన కర్తవ్యం.
ప్రకృతి మన ఉమ్మడి ఇల్లు. మనం మన ఇంటిని తీర్చిదిద్దుకోవడం తోనే మాతృభూమిపై ప్రేమ ఆరంభమవుతుంది. కుటుంబమే కదా మనిషికి మొదటి పాఠశాల. వివిధ రకాల పనుల మీద బయటికి వెళ్లిన పిల్లలు సాయంకాలం కాగానే ఇంటికి చేరుకొని తల్లి ఒడిలో ఒదిగినట్లు ప్రతి ఒక్కరూ ప్రకృతిలో తమను తాము చూసుకోవాలి. ప్రకృతికి అనుగుణంగా నడుచుకోవాలి.
కానీ తల్లి లాంటి ప్రకృతిపై మనిషి ఒక యజమానిలా ప్రవర్తించి తన సౌకర్యవంతమైన జీవితం కోసం ప్రకృతి వనరులను నాశనం చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ప్రకృతి మాత క్షమించదు. దారి తప్పిన పిల్లలను శిక్షించే తల్లిలా అందుకు ప్రతిగా కన్నెర్ర చేసి ప్రకృతి వైపరీత్యాల రూపంలో శిక్షిస్తుంది. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే సంతానానికి శిక్ష తప్పదు అని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన సమయం ఇది.
మనమందరం ప్రకృతి నుంచి వచ్చాము. ప్రకృతి మన నుండి ప్రతీది తీసుకోగలదు. మనది అంతా ఆమెకే చెందుతుంది అందుకే ప్రకృతితో సంపర్కంతోనే అన్ని రకాల మానవ పురోగతులు సాధ్యమవుతాయి.
ప్రకృతిని ప్రేమించని వాడు మనిషిని ప్రేమించలేడు మంచి పౌరుడిగా జీవించలేడు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తేరగాల్సిన జీవిత సత్యం.
– మామిడాల శైలజ