అన్వేషణ ఎపిసోడ్ 5
అసలీ సంధ్య ఎవరో? సత్య కిరణ్ విషయంలో ఎందుకు తను అలా చేసిందోనని..? అన్వేషించే పనిలో పడ్డాము నేను, సత్య కృష్ణ. తనపై పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినా లాభం లేకపోయింది.
సత్య కిరణ్ ని పోగొట్టుకున్న దుఖం నుండి కోలుకోవడానికి మాకు చాలా సమయమే పట్టింది. జరిగిన సంఘటన నుండి అప్పుడప్పుడే కోలుకుంటున్న నాకు… మరొక పిడుగులాంటి, హృదయాన్ని ముక్కలు చేసే వార్తొకటి తెలిసింది, అదే సత్య కాంత్ భార్య సుకన్య గురించి.
సత్య కాంత్ ఉద్యోగరీత్యా దేశపు సరిహద్దులలో ఉండడంతో, వాడి భార్య ఇక్కడే ఒంటరిగా ఉండేది. వాడు మాత్రం సంవత్సరానికి రెండు మూడు సార్లు వచ్చి వెళ్తుండేవాడు. మధ్యలో తనకేదైనా అవసరమైతే, ఒక అన్నలాంటి వాడిగా నేను తన బాగోగులు చూసుకునేవాడిని.
అనాధైన తనని పెళ్ళిచేసుకుని, తనకి ఒక తోడుగా నిలిచిందని వాడు తనని చాలా బాగా చూసుకునేవాడు. వాడికి జీతం పడగానే వాడి అవసరాలకు వాడి దగ్గర కొంత ఉంచుకుని, మిగిలినది నా ద్వారా తనకు చెరవేసేవాడు. దూరంగా ఉంటున్నా కూడా తనకి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు.
ఆ తరుణంలోనే ఒక రోజు నాకు డబ్బు పంపించి, అది సుకన్యకు ఇవ్వమన్నాడు. తనకి ఎంతసేపు కాల్ చేసినా, లిఫ్ట్ చేయకపోవడంతో, నేనే స్వయంగా ఎప్పటిలాగానే ఆ డబ్బిద్ధామని వాళ్ల ఇంటికి వెళ్ళాను.
అలా వాళ్ల ఇంటికి వెళ్ళిన నాకు, ఎప్పుడూ లేనిది, ఆ ఇంటి దగ్గర బయట ఎవరిదో ఓ పెద్ద కారు, గుమ్మం వద్ద చెప్పులు ఉండడం గమనించాను. చూస్తుంటే ఆ చెప్పులు మగవారు దరించేవిలా ఉన్నాయి. ఇంటి తలుపులు కూడా మూసే ఉన్నాయి.
తనని కలవడానికి, ఎవరో వచ్చి వుంటారని అర్థమైంది.
“తనకి ఎవరూ లేరని చెప్పింది, పైగా ఇంత గొప్పింటి వాళ్ళు ఎందుకు తనని కలవడానికి వచ్చారు? అసలిప్పుడు తనని కలవడానికి ఎవరొచ్చి వుంటారు?” పైగా తలుపులు కూడా మూసి, అంత రహస్యంగా మాట్లాడుకోవల్సిన అవసరం ఏంటా…?” అని నా మనసులో ఒకటే సందేహాలు.
ఆ పక్కన కిటికీ తలుపు కొంచెం జారుగా తీసి ఉండడంతో, వెళ్లి ఆ గదిలోకి సూతణప్రాయంగానే తొంగి చూసాను. అలా చూసిన నేను, అక్కడ జరుగుతున్న సంఘటన చూసి నిర్ఘాంతపోయాను.
తను (సుకన్య) పరాయివాడు ఎవరితోనో,
బెడ్రూం మంచంమీద పక్కలో… ఛ..! ఛ..!! చెప్పడానికి నాకు నోట మాట కూడా రావడం లేదు.
“అసలేం లోటు చేశాడని వాడు, మరీ ఇంతలా భరితెగించింది సుకన్య”, అనుకుంటూ ఆవేశంగా ఆ మూసున్న తలుపులు దగ్గరకి వెళ్లి వాటిని గట్టిగా అదిమాను.
దాంతో ఆ చప్పుడుకి, రెండు తలుపులు కంగారుగా తీసింది సుకన్య. (చీర కొంగు సర్దుకుంటూ)
ఆవేశంతో, ఆక్రోశంతో నా కళ్ళు వాళ్ళిద్దరినీ అలానే ఉరిమి చూస్తుంటే, తనతో అప్పటి వరకూనున్న ఆ వ్యక్తి, అక్కడ నుండి అసలేం భయం లేకుండా హందాగానే షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ జారుకున్నాడు.
సుకన్య మాత్రం తను చేసింది తప్పన్నట్టే అంగీకరిస్తూ, నా కళ్ళ వంక నేరుగా చూడలేక, తలదించుకుని నేలవైపు బిత్తర చూపులు చూస్తుంది. నా కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని,
“అసలేంటమ్మ ఈ పని, వాడు నీకేం లోటు చేశాడని నువ్విలా అడ్డదారులు తొక్కుతున్నవ్? వాడక్కడ రాత్రి పగలు తేడా లేకుండా, ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఒక పక్క దేశం కోసం పోరాడుతూ, అహర్నిశలు శ్రమిస్తూ ఇంకో పక్క నీకు ఏ లోటూ లేకుండా చూసుకుంటుంటే, నువ్విలా ఛీ.. ఛీ .. నీకేం సిగ్గుగా గానీ, తప్పుగా కానీ అనిపించడం లేదు. అసలక్కడ ఏం తింటున్నాడో, ఎలా ఉంటున్నాడో కానీ, సంపాదించిందంతా నీకోసమే కూడబెడుతున్నాడు వాడు. అలాంటి మంచివాడిని నీకెలా మోసం చేయాలనిపించిందమ్మా… ?
నీపై నమ్మకంతో నిన్నిక్కడ వదిలి, వాడు నిన్నొక దేవతల చూసుకుంటుంటే, నువ్విలా చేయడం… ఇదంతా తెలిస్తే, అసలు వాడేమైపోతాడోనని కొంచెమైనా వాడి కోసం ఆలోచించావా.? ” అని నేను ఒకటే ఆవేశంగా వాగుతుంటే చలనం లేకుండా తను మాత్రం అలానే ఉండి పోయింది. దాంతో “నేనింతలా వాగుంతుంటే ఏం పట్టనట్టు అలా రాయిలా నిల్చున్నవేంటి? నేను అడుగుతున్న వాటికి సమాధానం చెప్పు” అంటూ గట్టిగా గదిమాను.
దాంతో, నువ్వెల్లి చెప్పు పోనీ నేను ఇలా చేశాను అని, ఎంతైనా నీ ప్రాణ స్నేహితుడు కదా! నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి, అక్కడ నీ ఫ్రెండ్ దేంతో కులుకుతున్నాడో ఎవరికి తెలుసు? అయినా నా లైఫ్ నా ఇష్టం, అసలు నా సొంత మొగుడికే లేనిది, నీకెందుకు అంత బాధ?” అంటూ అప్పటివరకూ ఒక సొంత అన్నగా భావించదనుకున్న నన్ను, అలా వేరు చేసి, వాడిని తక్కువ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాను.
ఇక తన మాటలకు చిర్రేత్తిన నేను, క్షణికావేశంలో లాగి చెంప మీద ఒకటిచ్చాను. ఇక ఆ సంఘటనలతో అక్కడ క్షణం కూడా ఉండలేక, అక్కడ నుండి వచ్చేసాను. వాడికి ఇదంతా చెప్తే దూరంగానున్న వాడు ఏమైపోతాడోనని, సైలెంట్ గానే ఉండిపోయాను. ఈ విషయం గురించి సత్య కృష్ణ కి చెప్దామంటే, ఎక్కడ సుకన్యని వీడు కూడా అసహ్యించుకుంటాడేమోనని వాడి దగ్గర కూడా ఈ విషయం దాచి పెట్టాను.
***********
ఇదిలా ఉండగా, ఒకానొక రోజు సత్య కాంత్ ఇంటికి వచ్చినట్టు సత్య కృష్ణ ద్వారా తెలిసింది. ఎప్పుడు సెలవుపై ఇంటికి వచ్చినా.. నన్నే ముందు కలిసేవాడు సత్య కాంత్. కానీ, ఈసారెందుకో కనీసం వచ్చినట్టు కూడా చెప్పలేదు. కాల్ కూడా చేయలేదు. వాడు వచ్చినట్టు మాత్రం సత్య కృష్ణ ద్వారానే తెలుసుకున్నాను. సుకన్య తప్పుతున్న అడ్డదార్లను అదుపులో పెట్టలేక, సత్య కాంత్ కి అసలు విషయం చెప్పేధ్దామనుకున్నా..
సర్లేనని, తనకి నేనే కాల్ చేసి “నీతో కొంచెం మాట్లాడాలి” అంటూ బయట కలుద్దామని చెప్పాను. అలా ఓ రోజు ఇద్దరం బయట కలిసాము. నన్ను చూస్తేనే ఆప్యాయంగా పలకరించే వాడు, ఈ సారి మొహం పక్కకు పెట్టుకునున్నాడు. తన వాలకం చూస్తుంటే, నాకప్పుడర్థమైంది సుకన్య జరిగిందంతా చెప్పేసుంటుందని.
అలా.. చాల సేపు మా మధ్య మౌనమే ఆధిపత్యం వహిస్తున్న సమయంలో, దానికి తెరదించుతూ నేనే వాడిని కదిపాను.
“ఏరా సత్య … ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావ్..? ఇంటికి ఎప్పుడొచ్చినా నువ్వు నా దగ్గరకే ముందొచ్చేవాడివి… ఈ సారి కనీసం కాల్ అయినా చేయలేదు. అసలేమైంది రా?” అని అడిగాను.
దానికి వాడు నువ్వేమైనా నా చుట్టానివా.. పక్కానివా.. వచ్చిన ప్రతిసారీ నిన్ను కలవడానికి.(వాడి చేష్టల్లోనే కాదు, మాటల్లో కూడా ఏదో తెలియని మార్పు కనిపించింది.)
ఇక నేనేం అనలేక, “సుకన్య నీకేమైనా చెప్పిందా” అని అడిగాను.
“హుం.. ఎప్పటికైనా బయట పడక తప్పదు కదా!” అంటూ అలాగే పక్కకు తిరిగి మూతి బిగించుకొని కూర్చున్నాడు.
“పోనిలేరా..! ఏదో చిన్నపిల్ల, పాపం తెలియక చేసింది. ఈ సారికి… ” అని నేను అంటుండగా…
నా వంక కల్లేర్ర జేసీ, కోపంగా చూస్తూ… “చాళ్లే ఆపు, చేసిందంతా చేసి, ఇప్పుడు తప్పు తన మీద నేట్టేద్దాం అని చూస్తున్నావా?” అంటూ నా మీద తన కఠినమైన మాటలతో తిరగబడ్డాడు.
నాకేం అర్థం కాకా “అదెంట్రా అలా అంటావ్!” అని అడుగుతుండగా..
ఆపమన్ననా… నీ నటనలు (నా వంక కోపంగా రగిలిపోతూ చూస్తూ)
ఎంతలా నమ్మాను రా నిన్ను…! తను కూడా నిన్నొక అన్నయ్య లాగానే కదరా! భావించింది. అలాంటిది, వరసకు చెల్లెలు అయ్యే దానితో, నేను లేని టైం చూసి పడక పంచుకుందాం రా అని అడుగుతావా…? ఒక ఫ్రెండ్ భార్య తో, పైగా అన్నయ్య అని పిలిచిన ఓ చెల్లెలు లాంటి దానితో ఇలాగేనా బిహేవ్ చేసేది. అలా అడగడానికి నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించలేదా రా..? ఇన్నాళ్ళ మన స్నేహానికి నువ్విచ్చిన బహుమతి బాగుంది రా..!
ఇదిగో నీ సంస్కారానికి నాదొక నమస్కారం (తన రెండు చేతులు జోడించి)” అంటూ నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ అనరాని మాటలు అంటుంటే,
“అరేయ్ .. సత్య కాంత్, అసలేం జరిగిందో ఒకసారి నేను చెప్పేది కూడా వినరా…!”
అంటూనే జరిగిన దాని గురించి చెప్పే ప్రయత్నం చేయబోతుంటే… అప్పటికే నాపై పట్టరాని కోపంతోనున్న వాడు, అది ఇంకా ఎక్కువై నా చెంప చెళ్లుమనిపించాడు.
“ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించకు” అంటూ నేను చెప్పేది అసలేమి వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
అప్పుడర్థమైంది, ఆరోజు జరిగిందంతా మనసులో పెట్టుకుని, సుకన్య లేనిపోనివి వాడికి కల్పించి చెప్పి, నాకు వాడికి దూరం పెంచిందని. తన ప్రతీకారం ఈ రకంగా తీర్చుకుందని. వాడు తన మాటలకు బాగా లొంగిపోయినట్లు ఉన్నాడు. అందుకే, నేను చెప్పేదేమీ వినకుండా అన్నెళ్ళ నా సావాసం మీద విశ్వాసాన్ని క్షణాల్లో తుంచేసి, నన్ను వాడికి దూరం చేసుకున్నాడు.
జరిగిందంతా సత్య కృష్ణ కి చెప్పాను, వాడు కూడా “కాలక్రమేణా అన్నీ అవే సర్దుకుంటాయిలే” అని నన్ను ఒదార్చాడు. అప్పటికే ఒక ఆడదాని వల్ల మంచి మిత్రుడిని కోల్పోయిన నాకు, ఇప్పుడు అదే ఆడదాని వల్ల వీడు కూడా దూరమయ్యాడు.
నేను చెయ్యని తప్పుకు నాపై అసహ్యం పెంచుకుని నాకు దూరం అవుతుంటే, అది మాత్రం అనుక్షణం బాధిస్తూనే ఉంది. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తూ… ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను. వాడి పలకరింపు కోసం, తిరిగి నా దగ్గరకు వస్తాడేమోనని ఆశతో మరెన్నో ఎదురుచూపులతో వేచి చూస్తూనే ఉన్నాను.
ఇది జరిగిన సరిగ్గా వారానికి, సత్య కాంత్ దగ్గర నుండి ఒక మెసేజ్ వచ్చింది. జరిగింది తెలుసుకుని చేసాడేమో అనుకుని అసలు అదేంటోనని ఆతృతగా ఓపెన్ చేసి చూసాను.
“రేయ్ సత్య కుమార్ నన్ను క్షమించరా..! నా భార్య చెప్పిన మాటలు విని, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఆరోజు మనిద్దరి మధ్య జరిగిన వాగ్వాదం తర్వాతే నాకు అసలు విషయం తెలిసింది. నా భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని చుట్టు పక్కల వాళ్ల వల్ల తెలుసుకోగలిగాను. గట్టిగా నిలదీస్తే అసలు మీ ఇద్దరి మధ్య జరిగింది తెలిసింది. నువు ఆ రోజు ఎంత చెప్తున్నా నేను వినలేదు.
“ఎందుకు నన్ను మోసం చేస్తూ ఇంత దారుణానికి ఒడిగట్టావని” తనని అడిగితే,
“అయితే ఇప్పుడేం చేస్తావ్, నీకు చేతనైంది నువ్వు చేసుకో..!” అంటూ కనీసం మొగుడునని కూడా చూడకుండా అనరాని మాటలు అంది. ఇక్కడితో ఇదంతా వదిలేసి ఇకనైనా సక్రమంగా ఉండమని బ్రతిమాలాడాను, ఇంటి పరువు వీధిన పదేయవద్దని ప్రాధేయ పడ్డాను.
“నువ్వెవరు నాకివన్నీ చెప్పడానికి, నాకు నీ నుండి ఏ సుఖం దొరకడం లేదు. నా పేరులో ఉన్న సుఖం, నా జీవితంలో లేకుండా పోయింది. అయినా నువు అక్కడ జాబే చేస్తున్నావో లేదా ఎవత్తినైనా తగులుకుని నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావో…?” అంటూ నా మనసుని గాయపరిచింది.
“ఏం మాట్లాడుతున్నావు సుకన్య నీ సంతోషం కోసమేగా నేను అనుక్షణం పరితపించేది. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏదోలా ఉంటుంది. దయచేసి అలా మాట్లాడకు” అని నేనంటూ తనని బ్రతిమాలుతుంటే,
అవేమి వినకుండా, భర్తని కనీస మర్యాద కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవడో వస్తె వాడితో పాటు కలిసి వాడి కారులో ఎక్కడికో వెళ్లిపోయింది.”
ఇంత జరిగాక, నా మొహం నీకెలా చూపించను చెప్పు సత్య కుమార్? అయినా నీ విషయంలో నేను చేసిన తప్పుకి నాకీ శిక్ష పడాల్సిందే… జీవితాంతం ఈ అనాధకి ఒక తోడులా ఉంటుందనుకున్న నా సుకన్య నన్ను మోసం చేసింది. దాంతో ఈ ప్రపంచంలో నేను మళ్ళీ ఒంటరివాడయ్యాను అనే భావన నా మనసుని గుచ్చి గుచ్చి చంపుతుంది.
అందుకే, మిమ్మల్ని అందరినీ వదిలి దూరంగా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమిస్తావు కదూ…. అన్నట్టు ఈ విషయాలేవీ ఎవరికీ చెప్పకు.. దేశానికి కాపలా కాసినోడు, సొంత పెళ్ళాన్ని దారిలో పెట్టుకొలేక ఇలా పిరికివాడిలా చనిపోయాడని ఈ లోకం నవ్వుకుంటుంది. నా పై ఇష్టంతో నేనిలా చేయడానికి కారణం తానేనని, తనపై కోపం పెంచుకుని తనకి హాని తలపెట్టాలని చూడకు. కనీసం తననైన తను కోరుకున్నట్లు సుఖపడనీ. ఇదే నా చివరి కోరిక”
అంటూ ఆ మెసేజ్ సారాంశం…
అదంతా చదువుతున్న నా చేతిలోనుండి ఫోన్ జారీ కింద పడింది. నా నిట్టూర్పు సెగలకు అడ్డే లేకుండా ఒక ధారలా కారుతూనే ఉన్నాయి. నా రక్తమంతా కోపంతో మరిగిపోయింది. ఆ క్షణం సుకన్యని చంపాలన్నంత కోపం నాలో రగిలింది. వెంటనే తేరుకుని సత్య కాంత్ కి కాల్ చేశాను, కానీ కలవలేదు. సరిగ్గా అప్పుడే, సత్య కృష్ణ దగ్గర నుండి కాల్ వచ్చింది. సత్య కిరణ్ గన్ మిస్ ఫైర్ అయ్యి చనిపోయాడని.
నేను కుప్పకూలి నేలపై పడ్డాను. అసలేం జరిగిందో? వాడు ఎందుకు? ఎలా చనిపోయాడన్నది నాకు, సత్య కృష్ణకి మాత్రమే తెలుసు. కానీ, ఈ ప్రపంచం దృష్టిలో వాడి తుఫాకి మిస్ ఫైర్ అయ్యి చనిపోయాడు.
వాడి అంతిమ సంస్కారాలకి, నన్ను బలవంతంగా ఒప్పించి తీసుకెళ్ళాడు సత్య కృష్ణ. వాళ్ళింటికి వెళ్ళే సరికి వాడి బాడీ ప్రభుత్వ లాంచనాలతో స్మశాన వాటికకి తీసుకెళ్లడానికి రెడీగా ఉంది. తన కోసం చుట్టూ ఎడ్చేవాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు, ఒక్క వాడి భార్య తప్ప. చేసిందంతా చేసి వాడి చావుకు కారణమై తను, మాకు మాత్రమే తెలిసి, ఈ ప్రపంచానికి తెలియని తన కొత్త కోణంతో అందరినీ మభ్య పెడుతుంది.
********
ఇది జరిగిన కొన్నాళ్ళకి సుకన్య, ఒక షాపింగ్ మాల్ లో నాకు ఎదురుపడింది. పక్కన ఎవరో ఉన్నారు. అసలు కట్టుకున్న మొగుడు పోయాడన్న దిగులు ఏమాత్రం లేకుండా, కొత్త పెళ్ళికూతురిలా ముస్తాబయ్యి, ఎవరితోనో చెట్టా పట్టాలు వేసుకుని బజారు మనిషిలా తిరుగుతుంది తను.
చిటికేస్తూ… తనని దాటుకుంటూ వెళ్తున్న నన్ను ఆపి,
“ఇప్పటికైనా తెలిసిందా ఎవరి జీవితాలు ఏం అయ్యాయో… ?” ఆ రోజు నా చెంప చెళ్లుమనిపించినందుకు చూసావా ఎలా ప్రతీకారం తీర్చుకున్నానో…? అంటూ నాపైనున్న అక్కసుని వెళ్లగక్కింది. ఇది కూడా వెళ్లి చెప్పు, చచ్చిన నీ ఆ పిచ్చి స్నేహితుడికి” అంటున్న తన మాటలు వింటుంటే, నా కోపం నాషాల్లన్నింటింది. కానీ, సత్య కాంత్ గుర్తొచ్చి ఏమి చేయలేక అక్కడ నుండి వచ్చేసాను.
ఆ తర్వాత ఏమైంది?
ఇప్పటికే ఇద్దరు ప్రాణ స్నేహితులని పోగొట్టుకున్న సత్య కుమార్ ఎలా తేరుకున్నాడు?
ఇంత జరుగుతుంటే, సత్య కిరణ్ ఏమయ్యాడు?
సంధ్య గురించి వెతుకుతున్న సత్య కుమార్, సత్య కిరణ్ కి తను దొరికిందా?
రంజిత్ కి ఇంకేం ఆధారాలు లభించాయి? లాంటి సందేహాలన్నీ నివృత్తి చేసుకోవాలంటే, తర్వాతి భాగం, అన్వేషణ-6 వరకూ వేచి చూడాలి.
– భరద్వాజ్