న్యాయమా నీవెక్కడ
న్యాయవాదుల
నల్లకోటుల్లోనా?
బడాబాబుల బంధీఖానాల్లోనా?
బరితెగించిన అధికారంలోనా ?
భూ బకాసురుల
హస్తాల్లోనా?
కార్పోరేట్
కబంధాల్లోనా?
రాజనీతి
కుతంత్రాల్లోనా
మాఫియా
సామ్రాజ్యంలోనా?
అవినీతి అధికారుల
జేబుల్లోనా?
నీతిలేని వ్యాపారుల
కనుసన్నల్లోనా?
చట్టాల చట్రాల ఇరుసుల్లోనా?
అందరాని విద్య
అంచుల్లోనా?
దురాచారాల
దౌర్భాగ్యంలోనా ?
దుస్సాహసుల ద్వంద
నీతిలోనా?
కవిరాయని
కల్పితపు రాతల్లోనా?
పెట్టుబడిదారుల
పెత్తనం లోనా?
అహంకారపు అంచుల్లోనా?
ఆది పత్యపు
పోరులోనా?
మానవ మృగాల
పైశాచికత్వం లోనా?
సత్యమెరుగని
సమాజం లోనా?
అర్హులనే వారు ఎవరైనా ఉంటారా న్యాయానికి?
నమ్ముకుని కూచుంటే
దొరుకుతుందా న్యాయం
అని సందేహమే?
అంగట్లో కొనే సరికాదు
అందరికీ న్యాయం అంటే?
ఖరీదు కట్టే న్యాయమే
వద్దు ఎప్పటికీ
సామాన్యుని ఆగ్రహావేశాలు చవి చూడకుండా న్యాయమా
కదలిరా ఇప్పటికైనా….
– జి జయ