నూతన నిర్ణయం

నూతన నిర్ణయం

నమస్తే అండి నా పేరు అంజలి. నేనొక ఒంటరి మహిళను నాకొక బాబు. నేను వాడి కోసమే బ్రతుకుతూ ఉన్నాను. పిల్లలుంటే చాలు అండి పిల్లల కోసమే కదా మనమేం చేసినా అందుకే నేను వాడు పుట్టినప్పటి నుండి ఏదో ఒక పని చేస్తూ ఉండేదాన్ని. అయితే వాడిని ఇంట్లో అమ్మ దగ్గర వదిలేసి పనికి వెళ్ళేదాన్ని టీచర్ గా నా ప్రయాణం మొదలైంది.

పొద్దున్నే పాలు పట్టి వెళ్ళడం, మధ్యాహ్నం వచ్చి మళ్ళీ పాలు పట్టి వెళ్లేదాన్ని, అలా పని చేస్తూ వాడి చిన్న చిన్న అవసరాలు తీరుస్తూ ఉండేదాన్ని. నిజానికి వాడిని అమ్మే చూసుకునేది. అమ్మనే అన్ని విధాలా చేసేది. అలా గడుస్తూ ఉండగా ఒక రోజు మధ్యాహ్నం ఎప్పటిలా ఇంటికి వచ్చేసి అన్నం తిని వాడికి పాలు పట్టి వెళ్దాం అనుకునే లోపు ఏడుపు మొదలు పెట్టాడు.

వెళ్లొద్దు అన్నట్టుగా నాకు కాస్త జాలిగా అనిపించింది ఎంతైనా తల్లిని కదా… కానీ నెల చివరి రోజులూ ఉన్న ఒక్క సెలవు అయిపోయింది. ఇప్పుడు మానేస్తే సగం జీతం కట్ చేస్తారు. వచ్చేది జీతాల రోజు. వీడేమో ఏడుస్తున్నాడు. ఇక భరించలేక కోపం, నిస్సహాయత అన్ని కలగలిపిన కోపం తో ఏడుస్తున్న వాడికి కళ్ళలో జండుబమ్ రాసి, ఎండలో పడుకో బెట్టాను.

ఇంత కర్కశంగా చేశాను అంటే మీకు కూడా ఇదేం తల్లి అనిపిస్తుందని తెలుసు కానీ నా పరిస్థితి పైగా సూటి పోటి మాటలతో ఎవరి పైనో ఉన్న కోపం ఇలా నోరు లేని పసి వాడి పై చూపించాను. నిర్ధాక్షిణ్యంగా వాడిని అలా వదిలేసి వెళ్ళాను. జీతం అందుకున్న తర్వాత వాడి కోసం బట్టలు, సెరిలాక్ తీసుకుని ఇంటికి వెళ్ళాను.

కానీ అప్పటికే వాడి ఒళ్ళు జ్వరం తో కాలిపోతుంది. అమ్మ నన్ను తిట్టని తిట్టు లేదు. అయినా వాడిని తీసుకుని ఆసుపత్రికి బయలు దేరాను నీళ్లు నిండిన కళ్ళతో…. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చి, గంటగంటకు సిరప్ వేయమని చెప్పాడు. ఆ రాత్రి నేను బాధపడుతూ ఏడుస్తూ వాడిని చూసుకుంటూ గడిపాను. తెల్లారే సరికి జ్వరం తగ్గి పోయింది.

వాడు కళ్ళు తెరిచి బోసి నవ్వులు నవ్వుతూ ఉంటే నా హృదయం ఉప్పొంగి పోయింది. ఇలాంటి నవ్వును నేను కర్కశంగా నలిపాను. వాడికి శిక్ష వేసాను ఛీ నాలాంటి తల్లి ఒక తల్లేనా ఇన్ని రోజులూ ఇది గమనించలేదు. ఇప్పుడు వాడి నవ్వుతో నాలో ఉన్న భయాలన్నీ తొలగిపోయాయి.

పోతే పోయింది ఉద్యోగం. వాడు పెద్దయ్యే దాకా ఎలాగో గడపాలి అని గట్టి నిర్ణయం తీసుకున్నా, వాడిని చేతుల్లోకి తీసుకుని ముద్దులు పెట్టుకుంటూనే ఏడవడం మొదలు పెట్టాను. ఇది గమనిస్తున్న అమ్మ పాప నీ కొడుకు కన్నా ఏది ఎక్కువ కాదు. ఇప్పుడు పరుగులు పెడుతూ వాడి అల్లరి, నవ్వులు అన్ని కోల్పోతున్నావూ, తల్లిగా ఇవన్నీ నీకు జ్ఞాపకాలుగా ఉండాలి అంటే నువ్వు వాడితో గడపాలి.

లేదంటే చాలా బాధ పడల్సి వస్తుంది. ఏదో కోపం లో చేసావు ఇప్పటికైనా నిజాన్ని గ్రహించి మేదులు అంటూ హితవు చెప్పింది. అవును అమ్మా నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. ఇక నేను వీడిని వదలను వీడి నవ్వులు, అల్లరి పనులు అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. ఇక పని అంటావా ఏదో ఒకటి దొరకక పోదూ వాడు కాస్త పెద్దయ్యాక బళ్లో వేసి, వాడితో పాటూ నేను వెళ్తాను అమ్మా అంటూ వాడిని ఎత్తుకుని అమ్మను కౌగిలించుకున్నాను. వాడికేమి అర్థం అయ్యిందో కానీ చిరునవ్వులు చిందించాడు.

పిల్లలు దేవుడితో సమానం వారి చిన్ననాటి అల్లర్లు, చేష్టలు చూడకుండా ఎడారి వెంట పరుగెత్తి, చివరికి బాధ పడితే ప్రయోజనం లేదు కదా అలా నేను నా కొత్త నిర్ణయాన్ని తీసుకుంటూ, ఇంకెప్పుడూ నీ కళ్ళలో నీళ్ళు రానివ్వను రా కన్నా అని మనసులో అనుకుంటూ తృప్తిగా, ప్రేమగా వాడి నుదుటి పై ముద్దు పెట్టాను.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *