చిగురాశ

చిగురాశ

అబ్బా ఎంత బాగుందో కదా అంటూ షాప్ ముందే ఆగిపోయింది లత. నీకు ఏది చూసినా అలాగే ఉంటుంది కానీ పద ముందు అంటూ తన చేయి పట్టుకుని ముందుకు నడిపించింది శారద. అబ్బా అక్కా నాకు అది కనుక్కోవాలని ఉందే అంది లత. దాని ధర చూసావా ఎంత ఉందో ఆ డబ్బుతో మనం మన ఇంట్లోకి వారం రోజులు కూరగాయలు తెచ్చుకోవచ్చు పద నీకేం పని లేదు అంటూ లాక్కు వెళ్లసాగింది శారద.

అబ్బా అక్కా ఎప్పుడు కొనియమన్నా కొనియ్యవు అంటూ ఏడవ సాగింది లత. ఊరుకో లతా నీకు ఎప్పటికైనా అది కొనిస్తాలే. ఇదిగో ఇప్పుడు నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను తింటూ వెళ్దాం అంటూ ఐదు రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కొనిచ్చింది లతా ఏడుపు ఆపడానికి.

ఆరోజు రాత్రి శారద కళ్ళ ముందు ఆ షాప్ లో ఉన్న నీలం రంగు గౌను మెదల సాగింది. అబ్బా నిజంగా లత అన్నట్టు ఎంత బాగుంది గౌను. మెరుస్తున్న వస్త్రంతో కుట్టినట్లు ఉన్నారు అక్కడక్కడ చమ్కీలు, అద్దాలు నీలం రంగు మీద గులాబీ వర్ణంలో ఉన్న చమ్కీలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి. దాని ఖరీదు చూసి తనని వెనక్కి లాగింది. లేకపోతే షాపులోకి వెళ్లి అల్లరి చేసేదే ఎలాగైనా లతకి అలాంటి గౌను కుట్టివ్వాలి అంటూ ఆలోచిస్తూ పడుకుంది శారద.

మరుసటి ఉదయం తాను నేర్చుకునే కుట్టు మిషన్ సెంటర్ కు వెళ్లిన శారదకు ఎవరో తెచ్చి అక్కడ వేసిన నీలం రంగు జాకెట్ ముక్కలు కనిపించాయి దాంతో సంబరపడిన శారద వెంటనే వాటిని అన్ని ఏరుకుంటూ సంతోషపడసాగింది. అవన్నీ తీసుకొని సెంటర్ మేడం దగ్గరికి వెళ్లి మేడం ఇవన్నీ నేను కుట్టుకొని మా ఇంటికి తీసుకు వెళ్ళవచ్చా అంటూ అడిగింది.

అమ్మా అవి ఎలాగూ పడేసేవే కదా తీసుకువెళ్ళు అయినా వాటితో ఏం చేయగలవు నువ్వు అంటూ అడిగింది మేడం… లేదు మేడం దీన్ని ఒక ఆకారానికి తీసుకు వస్తాను మీరే చూస్తూ ఉండండి అంటూ శారదా సంతోషంగా ఆ ముక్కలని తీసుకొని తాను కుట్టే మిషన్ దగ్గరికి వెళ్లి ఒక్కొక్క ముక్కని అతికించుకుంటూ కుట్టడం మొదలుపెట్టింది. మేడం కూడా ఆసక్తిగా తను ఏం చేస్తుందో చూడడం మొదలు పెట్టింది.

అలా సాయంత్రం అయింది అయినా శారద కుట్టడం మాత్రం ఆగలేదు ఒక్కొక్కరిగా వెళ్లిపోసాగారు మేడం కూడా సమయం అయిపోయింది ఇక వెళ్ళండి అని అన్నారు కానీ శారద మాత్రం మేడం దయచేసి నాకు ఒక అర్ధగంట సమయం ఇవ్వండి నేను దీనిని పూర్తి చేస్తాను అని అనడంతో తను కూడా ఆసక్తిగా గమనిస్తూ మేడం అలా కూర్చుండి పోయింది సరే అంటూ….

*******

దాదాపు రాత్రి 7:00 అవుతున్నా ఇంకా శారద రాకపోయేసరికి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడసాగారు అసలే రోజులు బాగాలేవు. ఈ అమ్మాయి వచ్చే సమయానికి ఇంకా రాలేదు ఏమైందో అని అనుకుంటూ తలోదారిన వెతకసాగారు.

అలా చాలా సేపు వెతికిన తర్వాత కుట్టు మిషన్ సెంటర్ దగ్గరికి వెళ్లాలని అనుకున్నారు కానీ వాళ్ళు ఎదురుగా తన స్నేహితురాలలో ఒకావిడ రావడంతో అమ్మా సెంటర్ మూసేశారా అంటూ అడిగారు అవునండి సెంటర్ మూసేసి చాలా సేపు అయింది అంటూ తన దారిన తాను హడావిడిగా వెళ్లిపోయిందా అమ్మాయి.

సెంటర్ మూసేసిన ఈ అమ్మాయి ఇంకా రాలేదేమిటి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటూ భయపడుతూ బాధపడుతూ తిరిగి ఇంటి ముఖం పట్టారు ఇంట్లోని వారంతా…. వారికి ఏం చేయాలో పాలుపోలేదు రోజులు బాగాలేవు అమ్మాయికి ఏదైనా జరిగి ఉంటుందా అనే ఆలోచనతో సతమతం అవసాగారు.

అమ్మాయి ఏడైపోయింది అయిందా లేదా అంటూ మేడం రాగానే తను అంతవరకు కుట్టిన గౌను తీసి మేడం కళ్ళ ముందు ఉంచింది శారద. దాన్ని చూడగానే మేడం కళ్ళు తలుక్కున మెరిసాయి ఆశ్చర్యంతో పాటు ఇలా ఏలా చేయగలిగావు అనే ఒకలాంటి ఆలోచనతో అబ్బురంగా శారద వైపు చూసింది మెచ్చుకోలుగా. శారద భుజం తడుతూ చాలా బాగా కుట్టావు అమ్మాయి. నువ్వు చిన్న చిన్న ముక్కలతో ఇంత అందంగా కుట్టగలవని నేను ఊహించలేకపోయాను అన్నారు మేడం గారు.

మేడం నా ఒక్కగానొక్క చెల్లెలు లత, దానికి ఈ రంగు గౌనంటే చాలా ఇష్టం అది మొన్న షాప్ లో చూసింది అయితే దాని ఖరీదు ఎక్కువ కావడంతో మేము దాన్ని కొనలేకపోయాము కానీ నా చెల్లి కోరిన ఒక్క చిన్న కోరిక ఇది.

అది ఆశ పడినట్లు నేను ఆ రంగు గౌను కొనివ్వలేకపోయాను కానీ నా అదృష్టం బాగుంది ఇలాంటి ముక్కలు కనిపించాయి వెంటనే దాన్ని గుర్తు చేసుకుంటూ కుట్టాను మేడం. మాలాంటి పేదవారికి బ్రతకడమే గగనమైతే అంతంత ఖరీదు పెట్టి ఎలా కొనగరం అంటూ తలదించుకుంది శారద.

పేద, గొప్ప ఏముంది శారద తెలివి ఉంటే ఆలోచన ఉంటే ఎలాగైనా బ్రతకవచ్చు. నీ చెల్లి కోరిన ఈ చిన్న ఆశని కోరికని ఇలాగైనా తీర్చాను అనే సంతోషం నీ కళ్ళలో కనిపిస్తుంది వెళ్ళు ఇంటికి వెళ్లి నీ చెల్లికి ఇది ఇవ్వు తను సంతోషిస్తుందో తిరిగి వచ్చి రేపు నాకు చెప్పు అంటూ శారదను భుజం తట్టి ప్రోత్సహించింది మేడం. అలాగే మేడం చాలా ధన్యవాదాలు నాకోసం ఇంతసేపు మీరు కూడా మీ సమయాన్ని వెచ్చించారు అంటూ మేడంకి కృతజ్ఞతలు చెప్పి తన ఇంటికి బయలుదేరింది శారద.

ఇంట్లో అందరూ బాధతోనూ భయంతోనూ శారద కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. తలుపు చప్పుడు అవడంతో శారద వాళ్ళ అమ్మ వెళ్లి తలుపుతీసింది. ఎదురుగా శారద కనిపించడంతో చెంప మించి ఒక్కటి లాగిపెట్టి కొట్టింది. ఏంటి ఎక్కడికి వెళ్లావు ఇంతసేపు నీకోసం మేము పిచ్చి వాళ్ళలా ఊరంతా వెతికాము అయినా చెప్పా చేయకుండా ఎక్కడికైనా వెళ్లడమేనా? ఇంతసేపు ఎక్కడ తగలడ్డావ్ అంటూ తిట్ల వర్షం కురిపించింది.

అయినా శారద ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లి తన చెల్లి అయిన లత దగ్గరగా తీసుకొని గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.

తాను ఏం చేస్తుందో గదిలోకి అతను ఎందుకు తీసుకొని వెళ్ళిందో ఎవరికి అర్థం కాక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. కాసేపటి తర్వాత తలుపులు తెరుచుకున్నాయి నెమ్మదిగా… అందరూ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూశారు అక్కడ నీలం రంగు గౌనులో బుట్ట బొమ్మలా మెరిసిపోతున్న లతను చూసి ముక్కున వేలేసుకున్నారు.

అప్పుడు అందరికీ కొంచెం కొంచెం అర్థమవ్వసాగింది శారదా ఆలస్యంగా ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారిగా వారి కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి అందరూ గబుక్కున వెళ్లి శారదను గట్టిగా కౌగిలించుకున్నారు. తన చెల్లి కోరిన ఒక చిగురాశను తీర్చిన శారద తృప్తిగా కళ్ళు మూసుకుంది.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *