లేమి
మిత్రుడడిగాడు కవిత రాయలేదేమని
అన్నింటా ‘లేమి’ చోటుచేసుకున్న వేళ
కవితకూ ‘లేమి’ చుట్టుకుందని చెప్పాలనుకుని చుట్టూ పరికించి చూశాను
రైలెక్కుదామంటే స్థలము లేమి అనుకున్నా
ముసిరే చీకట్లలో వేలాడే జ్ఞాపకాల్లా
తోసుకుంటూ రాసుకుంటూ మనుషులుంటే గుండెకో హామీ
ఉదయాన్నే యమభటుల్లా వేధించే వార్తలతో
మనసు తడిలేమితో సతమవుతుంటే
తేమ నిండిన నేల
తేనీరు పరిమళంలా పలకరిస్తుంది
బస్సెక్కుదామంటే జనఘోషలో హారన్
వినిపించలేదు
మంచు పేరుకున్నట్టు మనుషుల మనసులపై మౌనం
పూశారెవరో!
హేమంతం వెలుగుకిరీటాన్ని ధరించలేదెందుకో
జంక్ ఫుడ్ తిన్నట్టు సూర్యుడూ జంకుతున్నాడు
ఆకలే ఉన్న లోకంలో కలల ప్రస్తావనెందుకుంటున్నాడేమో!
కలల తిమ్మిరి కరిగి చాలాకాలమైనా
మనసు కళ్ళద్దాల రంగుమాత్రం మారలేదు
పంచరంగుల ప్రపంచాన్ని చూద్దామనే ఆశమాత్రం చావలేదు
ఆశకిప్పుడు లేమి సమస్య లేదు
– సి.యస్.రాంబాబు