జ్ఞాన సముద్రుడు – కథానిక

జ్ఞాన సముద్రుడు – కథానిక

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అన్నట్టు సీతారాముడికి హైదరాబాద్ మహానగరంలో ఆటో డ్రైవర్ లను విచారించటం ఇష్టం. విచారించటమంటే పోలీసు విచారణ కాదు. క్షేమసమాచారాలు కనుక్కోవడం. అనంతరం తన జ్ఞానాన్ని పంచడం అతని అలవాటు.. పొదుపు చేయటం నుంచి గుట్కా మానివేయటం వరకు చిట్కాలు చిటికెలో చెబుతుంటాడు. ఆ విధంగా ఆతని జ్ఞాన సముద్రం అంతులేనిది. ఇది తెలిసిన వాళ్లెవ్వరూ ఈదే ప్రయత్నం చెయ్యరు.

ఇవాళ సీతారాముడు కవాడిగూడాలో ఆటో ఎక్కాడు, సికింద్రాబాద్ లోని సోదరుడింటికి వెళదామని. యథాప్రకారం చిత్రగుప్తుడిలా తన జ్ఞానచిట్టా తీశాడు.

ఆలోపలే ఆ డ్రైవర్ అందుకున్నాడు. “సార్..గూగుల్ పే చేయండి సర్ క్యాష్ తీసుకోను..” సీతారాముడు కంగు తిన్నాడు.

“ఎందుకని “
“ఏం లేదు సార్, చిల్లరుండదు”
“గూగుల్ పే అయితే అకౌంట్ లో పడిపోతుంది”
“ఇంతకీ అకౌంట్ ఎవరిది”
“ఇద్దరి పేరునున్నది సార్. జాయింట్ అకౌంట్ అన్నట్లు.”

సీతారాముడు ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. తనది సింగిల్ అక్కౌంటేనే.. 

“సర్ ఇంకో విషయం చెప్పాల్నా… పైసల్ తీసే కార్డ్ ఆమె దగ్గర్నే ఉంటుంది. నేనామెని కావలసిన మందం అప్పడిగి ఖర్సు పెట్టుకుంట. ఆన్లైన్ పేమెంట్ లు మాత్రం నేను చేస్తుంట” సీతారాముడు కి మరోసారి మతి పోయింది.

“సరేనయ్యా. ఎంతివ్వాలో చెప్పలేదు”

“తమరికి తెల్వనిదా సారూ. మీరెంతిస్తే అంత” సీతారాముడికి మరో షాక్

“మీరు చూసిన్రా సార్. ఏటిఎమ్ కాడ మంది తక్కువయిన్రుప్పుడు. ఇదే మంచిగుంది సర్. ఆన్లైన్ పేమెంట్ చేస్తుంటే పైసలు ఏమన్నా ఎక్కువ వసూలు చేస్తున్రేమో తెలవడం లేదు. మీకు తెలిస్తే చెప్పండి సర్.”

మొదటిసారి సీతారాముడు కలవరపడ్డాడు. ఇన్నాళ్లూ తను చాలా జ్ఞానవంతుడని తలపోస్తూ ఉండేవాడు. వీడి దుంపతెగ వీడికెన్ని విషయాలు తెలుసు. వీడికెంత పరిశీలన ఉంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు ఛార్జెస్ పడతాయంటే నీళ్లు నమలాల్సి వచ్చిందనుకున్నాడు.

ఈలోగా ఆ ఆటో అతను మరో కస్టమర్ కి ఫోన్లో సలహా ఇస్తూ మాట్లాడుతున్నాడు.

“నేనొచ్చి తీస్కపోత. జరంత ఆగండి సర్. ఆగం కాకండి”

“ఏమయా నీదంతా ఫోన్ వ్యవహారమేనా?” మళ్లీ ఏం చెబుతాడో ఈసారి అనుకుంటూ అడిగాడు.

“మా ఏరియా వాళ్ళకు ఎక్కువ నేనే ఆటో తోలుతుంట సార్. ఇంతకుముందే ఆ కస్టమర్ తో పోయొచ్చిన. ఆయనేదో బేరం పెట్టిండు. వాళ్లు ఆ వస్తువు తెమ్మంటున్రు. మీ ముందు స్కానరున్నది. చేసేయుండ్లి సర్. నేను పోవాలి.

“పరుగు అప్పారావు అని నీ అక్కౌంట్ చూపిస్తోంది. అదే నా నీ పేరు” అడిగాడు.

పరువు నిలుపుకోవడం కోసం సీతారాముడు కొంచెం ఎక్కువే పేమెంట్ చేశాడు. ఆటో ఆగింది. కాసేపు సీతారాముడి ఆలోచనలూ ఆగిపోయాయి.

“వస్త సర్” ఆటో పరుగులు తీసింది. తేరుకున్న సీతారాముడు ఫోన్ తీసి భార్యకు చేశాడు.

“ఒక అరగంటలో వస్తున్నాను. అర్జ్ంట్ గా బ్యాంకు కెళ్లాలి. రెడీగా ఉండు”

“సీతారాముడు ఆమాట విననట్టే రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, ఆధార్ కార్డు తీసుకో..”

“ఎందుకివన్నీ” మొగుడి హడావిడి అర్థం కాక అడిగింది.

“నీ పేరుతో నా అక్కౌంట్ జాయింట్ చేయాలి వెంటనే. ఒక అరగంటలో వస్తాను. వచ్చాక చెబుతాను” ఫోన్ పెట్టేశాడు.

పరుగు లాంటి నడకతో సోదరుడింట్లోకి వెళ్ళాడు. సమీప భవిష్యత్తులో సీతారాముడు తన జ్ఞానాన్ని పంచే ప్రయత్నాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. జ్ఞానం తనొక్కడి సొంతం కాదని కూడా తెలుసుకున్నాడు

– సి. యస్ .రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *