మేల్కొలుపు
మాదొక చిన్న కుటుంబం
మేము అయిదుగురము
అక్క, అన్న, నేనూ, అమ్మ
నాన్న కాలం చేశారు.
ఆ బాధ లోంచి
బయట పడడానికి అక్కే అన్నగా మారింది
ఇంటికి పెద్ద దిక్కు అయ్యింది.
మాకు ధైర్యం చెప్పింది.
పొద్దున్నే లేచేది, ఇంట్లో
పనులన్నీ చేసేది, మమల్ని
తినమంటూ బ్రతిమాలి తినిపించేది
అందరం కలసి ఉండాలని
కొట్టుకున్నా, తిట్టుకున్నా
మనమే అంటూ ఎన్ని కష్టాలు ఉన్నా
బ్రతకాలని మంచి మాటలు చెప్పేది
పొద్దున్నే మేల్కొలుపు తన గిన్నెల
చప్పుడుతో లేచేవారిమి అసలు
అక్క ఎప్పుడు పడుకునేది ఎప్పుడూ
లేచేదో తెలిసేది కాదు, మబ్బున్నే లేచి
వంటలు చేసి, బాక్స్ లు కట్టి తానూ
బాక్స్ కట్టుకుని మమల్ని అందర్నీ
పని చేయాలంటూ తరిమేది
పొద్దున్నే గిన్నెలు చప్పుడు చేయడంతో
తెగ విసుక్కునే వాళ్ళం, పనులు చేయాలంటూ
అనేసరికి ఇదెక్కడి గొడవంటూ అనుకునే వాళ్ళం
కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అంటూ బజారు
నల్లా దగ్గర నుండి నీళ్ళు తెచ్చి పెద్ద హౌస్ నింపేది
ఏదో ఒకలా మా కడుపు నిండేలా చేసేది
తినకుండా పడుకుంటే నిద్ర లేపి మరీ తినిపించేది
ఇలా ఒకటా రెండా అక్క చేసిన పనులన్నో , అవన్నీ
మా కోసమే మా మంచి కోసమే మమల్ని ఆనందంగా
ఉంచడానికి మాత్రమే అని తెలిసే సరికి
అక్క వేరే ఇంటికి వెళ్ళిపోయింది.
ఇప్పుడు పొద్దున్నే గిన్నెల చప్పుడు తో
అక్క మేల్కొలుపు లు లేవు
పెద్ద దిక్కు లేదు, ధైర్యం చెప్పే వారు లేరు
తినకుండా పడుకుంటే నిద్ర లేపి తినిపించే వారు లేరు
మమల్ని ఆనందంగా ఉంచే అక్క లేదు.
అయినా అక్క నేర్పిన పాఠాలు మేము మర్చిపోలేదు
పొద్దుటే లేస్తున్నాం, వండుకుంటున్నాం
బాక్స్ లు కట్టుకుని పనికి వెళ్తున్నాం.
ప్రతి రోజూ పొద్దున్నే అక్క ఫోన్ తో
మాకు మేల్కొలుపు పాడుతూ నిద్ర లేపుతుంది.
అందుకే అంటారేమో ఇంట్లో ఆడపిల్ల ఉంటే
మహాలక్ష్మి ఉన్నట్టే అని ,నిజమే మా అక్క
మహాలక్ష్మి, మా ఇంటి ఆడపడుచు కు
ఇవే మా అక్షర నమస్సుమాజలులు…
ఓ తమ్ముడి అంతరంగం…
– భవ్య చారు