మేలుకొలుపు
కాలాలు కదిలిపోతున్నా
మాయాప్రపంచ మోహంలో మనిషి
కదలికలేనట్టు కూరుకు పోయాడు
స్వార్థం సాలెగూడు అల్లికలో
సాటి మనిషి ఉనికి ఊపిరాడనివ్వటం లేదతనికి
కలలు ఆశయాలు విలువలు
ఇప్పుడతనికి ఎండిపోయిన
బాల్యపు గుడి కోనేరు
సంపద లెక్కల ఎక్కాల బట్టియే
అతని గాయత్రీ మంత్రమిప్పుడు
తంత్రం కుతంత్రం అతని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు
అర్ధరాత్రివేళ అతని వూరు మూగరోదన
గుండెపై సమ్మెటపోటవుతుంది
ఇప్పుడుతను బాల్యం బోనులో బందీ
అతనింట అలంకారప్రాయుడైన
తథాగతుడి చిరునవ్వు
అతని దుఃఖాన్ని కడిగేస్తుండగా
మాగన్నుగా కునుకుపడుతుంటే
జీవితానికి అర్థం వెతుక్కుంటాడతను
– సి. యస్. రాంబాబు