వేకువై విచ్చుకో
నిశ్శబ్దాల నిశీధిలో
స్వప్నమై అడుగేయ్
స్వేచ్ఛా దీపాలను వెలిగించి
వెలివేసిన ఆలోచనలను
వేకువగీతం చేయ్
వేధించే శత్రువుల్లా
కోపతాపాలు కోరికలు
దాడి చేస్తుంటే
సందిగ్ధాల నదిలో
నిర్భయవీరుడిలా తెడ్డేయ్
మాటను గురిపెట్టే విలుకాండ్రను
మౌనంతో కాచుకుంటూ
చిరునవ్వు అస్త్రాన్ని వాడాలి
వడలిపోయి వెడలటం కాదు
వెతలే ఊతంగా గమ్యంవైపు సాగు
అసత్యం నీడలా వెంటాడుతుంటే
నీడనిచ్చే నిజాల చెట్టెక్కడో ఉండే ఉంటుంది
సత్యాల తోటలో అడుగుపెట్టావా
సందేహాల మదిలో అరుణకాంతులు
తొలి వేకువై విచ్చుకుంటాయి
– సి. యస్. రాంబాబు