నీకోసం
నీలాల నింగి
నీలి కోక చుట్టి
మేఘాల ముంగురులకు
చుక్కల మల్లెలు తురిమి
విశాల నుదురు మీద
జాబిలి తిలకము తీర్చి
వెన్నెల కన్నులకు
చీకటి కాటుక పెట్టి
నది అద్దము లోన
ప్రియమారగ
ప్రతిబింబము చూసి
మురియ
ప్రియుని చెంత వాలమని
మది తొందర పెట్టెను..
కడలి కౌగిలి చేరగ
సొగసు వాన చినుకులతో…
ఉరుము దూతతో పంపెను
మెరుపు ప్రేమ లేఖను
వలపు వలలు విసిరిన
చెలి వయ్యారి మిన్నుకు
చెలికాడు చెప్పెను
చెవిలోన ఊసులేవో..
చిలిపి నవ్వులు రువ్వు
మబ్బుసిగ్గు బుగ్గలపై
అలల ముద్దిడె కడలి
నదము ముకురము లోన..
– సలాది భాగ్యలక్ష్మి