హృదయాకాశపు వెలుగు
అతనో అగ్ని గోళం
అతనిదో సందడి వేషం
అతనో నిరంతర యాత్రికుడు
నిలకడలేేని మానవ జీవన నావికుడు
కాలానికి మిత్రుడీ రోదసీ చక్రవర్తి
ఈనిత్య సంచారి నీడలో
రోదించే చరితను ఓపికపట్టమంటాడు
విజయాలు ఓటమిల బాటలో
అలసిన జీవితాలకు ఓపిక నేర్పుతుంటాడు
దేవుడున్నాడో లేదో
అతను మాత్రం కనిపించే దైవం
కని పెంచిన అమ్మంత సత్యం
నిత్యగీతమై మనలో పలుకుతుంటాడు
ఉదయాన్నే వెలుగై
సాయంత్రానికి సంబరమవుతాడు
కనిపించని సాయమై
కలలను పంచే న్యాయమై
వెంటే ఉంటాడు
అగాధాల రాత్రులలో
జీవితం జారిపోతుంటే
ఉదయమై చేయందిస్తాడు
మధ్యాహ్న మార్తాండుడై మాడ్చేసినా
కలతలను ఊడ్చేసే
హృదయాకాశపు వెలుగతను
– సి.యస్.రాంబాబు