నే గెలిచి ఓడా

నే గెలిచి ఓడా

కళాశాల.. అది ఓ అందమైన రంగుల ప్రపంచం.. ఎన్నో కొత్త పరిచయాలకు.. మరెన్నో అనుబంధాలకు నిలయం.. అలాంటి కాలేజీలో అడుగుపెట్టిన మొదటిరోజు నుంచే మొదలైంది మన తగవు.

గిల్లికజ్జాలతో ప్రతిక్షణం కొట్టుకుంటున్న‌ క్రమంలో నాకే తెలియకుండా ప్రేమ చిగురించి, నా మనసును నీ ముందు పరిస్తే.. ఇష్టమంటూనే నువ్వు తిరస్కరించిన క్షణం‌ నా ప్రేమ పరీక్షలో మొదటిసారి ఫెయిలయ్యాను.

ఎన్నో పరీక్షలకు ఎదురొడ్డి నిన్ను దక్కించుకున్న రోజు లోకాన్నే గెలిచినంత సంతోషం నా మదిని ఆకాశంలో ఎగిరేసింది. తరగతి గదిలో ప్రతి బెంచీ, కాలేజీ గుమాస్తా దగ్గర్నుంచి ప్రిన్సిపల్ వరకూ ప్రేమకు సాక్ష్యమయ్యారు.

ఒకే ప్రాణంగా విహరిస్తున్న మనల్ని చూసి ఆ విధి కుళ్లుకుందేమో.. ఒక్కసారిగా నిన్ను నానుంచి దూరం చేసి ప్రేమలో మళ్లీ ఓడించింది. నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయిన నీకోసం‌ ఎన్నో ఏళ్లు ఎదురుచూశాను.

నీ ఆచూకీ సైతం తెలియక పిచ్చివాడినై నీ రాక కోసం వేచి చూసి విసిగిపోయిన నా జీవితంలోకి మెరుపులా నువ్ వచ్చావు. ఇప్పుడైనా నాతోనే ఉంటావనుకున్నా, కానీ ఎందుకో దగ్గరగా ఉన్నా నాదానివి కాలేదు.

గెలుపు ఆశలు కల్పించి మళ్లీ మళ్లీ ఓడించి నా మనసుకు మానని గాయాన్ని మిగిల్చావు.. మరొకరిని‌ మనువాడి నా గుండెను‌ నిలువెల్లా కోసేశావు..చివరికి ఈ ప్రేమ పరీక్షలో‌ నే గెలిచి ఓడాను.

– ది పెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *