“మట్టి-మనుషుల సంవాదం కాంతార చిత్రం”
కాంతార సినిమా కర్నాటకలోని తుళునాడు లోని అటవీప్రాంతం లో జరిగిన కథ. తమ ప్రాంతాన్ని కాపాడే భూతదేవతలుంటాయని నమ్మే అటవీ ప్రజల కథ. దానమిచ్చిన భూమిని తిరిగి తీసుకోవచ్చా! అన్న ప్రశ్నలో దాగున్న మనిషి దురాశ చుట్టు అల్లుకున్న కథ.
నూటయాభైఏళ్ళ కితం ఒక రాజు గారు ఒక గ్రామ ప్రజలకు భూమిని దానం చేస్తాడు. ప్రతిగా తనకు మనశ్శాంతి నిచ్చిన ఆ వూరి దేవత ప్రతిమను తనవెంట తీసుకెళతాడు. అయితే ఆ భూమిని దానం చేసిన ఆ రాజు గారి వారసుడి కన్ను విలువైన ఆ భూములపై పడుతుంది.
ప్రస్తుత వారసుడు, ఇప్పటి భూస్వామి ఆ భూమిని తన వశం చేసుకోవాలని కుట్ర పన్నితే.. ఆ కుట్రను తెలియని కథానాయకుడు శివ, అతని స్నేహితులు ఆ కుట్రలో భాగస్వామ్యులవుతుంటారు.
మరోపక్క అటవీశాఖ అధికారి మురళి స్థానికులు అటవీ సంపద వాడుకోడదని, జంతువులను వేటాడరాదని, అడవిని ఆక్రమించారంటూ ఆ ఊరి సరిహద్దులను మార్చబోతాడు. ఈ క్రమంలో శివకు, అతనికి ఘర్షణ ఏర్పడుతుంది.
ఇక్కడ దర్శకుడు తుళునాడు ప్రాంతంలోని నమ్మకాలను, సంస్కృతి చిహ్నాలను వినియోగిస్తాడు. భూతకోలం అక్కడ స్థానిక సంప్రదాయ నృత్యం.
దైవారాధనగా భావించే ఆ నృత్యం తో భూత దేవతలు సంతృప్తి చెంది ఆ గ్రామాన్ని రక్షిస్తుంటారని ఆ ఊరివారి నమ్మకాన్ని కథలో భాగం చేస్తాడు.
ఒకసారి భూతకోలం నృత్య సమయంలో ఆ వూరి వారి భూములను కోర్టు ద్వారా స్వాధీన పరుచుకుంటానని ప్రకటిస్తాడు అప్పటి జమీందారు. కానీ అనూహ్యంగా మరణిస్తాడు. అదే సమయంలో భూతకోలం నృత్య కళాకారుడు కూడా అదృశ్య మవుతాడు.
అతను కథానాయకుడి తండ్రి. మరణించిన జమీందారు కొడుకే ఇప్పటి భూస్వామి దేవేందర్. తండ్రి మరణానికి ప్రతీకారంగా ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు.
అడవి రిజర్వ్ ఫారెస్ట్ గా మారితే అటవీతెగలవారు తమ హక్కులు కోల్పోతారు.. అందులో అటవీ శాఖ అధికారుల పాత్ర, అటవీ తెగలవారిని తమకవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకునే భూస్వాములు.. ఇలాంటి ఘర్షణ వాతావరణం లో తుళునాడు ప్రాంత ప్రజలలోని యక్షగాన వెలుగులను చూపుతాడు దర్శకుడు.
వారిని కాపాడే భూతదైవం, క్షేత్ర పాలుడు (గులిగ దైవం) చివరికి వారిని ఏతీరాలకు చేర్చారన్నది వెండితెరపై చూడాలి. మొదటి పదినిమిషాలు, చివరి ఇరవై నిమిషాలు ఆ భూతకోలం నృత్య రూపం తెరపై అద్భుతంగా పండిస్తాడు దర్శకుడు, కథానాయకుడు రిషబ్ షెట్టి.
తన చిన్నతనంలో తన గ్రామంలో విన్న కథను పరిశోధించి దృశ్య రూపమిస్తాడు. స్థానిక జానపద సంగీతం, వాయిద్యాలను వాడుకోవటంలో సంగీత దర్శకుడు అజనీష్ లోకనాధ్ ప్రతిభ కనిపిస్తుంది.. తుళునాడు అటవీ సౌందర్యంతోపాటు భూతకోలం నాట్యాన్ని మరిచిపోలేం.
మనిషికీ, ప్రకృతి ఉన్న బంధాన్ని, ప్రతిబింబిస్తూనే దురాశను, దుష్ట శక్తులను ఎదుర్కొనటాన్ని చూపుతుందీ చిత్రం. చెడుపై మంచి సాధించిన విజయం అంశమే అయినా బలమైన పాత్రలు, నాటకీయత, దక్షిణ కర్నాటక అడవి ప్రాంతం, సంగీతం, ఫొటోగ్రఫీ చిత్రాన్ని నిలబెట్టాయి.
చిత్రంలో ఆ గ్రామం వారందరూ వేలిముద్ర మాత్రమే వేయగలిగినవారుగా కనిపిస్తారు. పేదవారిపై బలహీనులపై జులుం చెలాయించే పెద్ద మనుషులు అన్ని ప్రాంతాలలో కనిపిస్తారు. అందుకే ఈ చిత్రం అన్నిభాషలవారినీ చేరగలిగింది.
కాంతార అంటే మిస్టీరియస్ ఫారెస్ట్. అడవిలో రాత్రి దృశ్యాలు, అడవి నింపుకున్న పచ్చదనం చూసేవారికి కనువిందు. కన్నడ భాషా చిత్రమే అయినా ఈ సినిమా హిందీ, తెలుగు,తమిళ భాషల్లోనూ డబ్బింగ్ చిత్రం గా విడుదల చేస్తే ప్రస్తుతం విజయ ఢంకా మోగిస్తోంది. ఈ చిత్ర దర్శకుడు, హీరో రిషబ్ షెట్టి అన్నట్లు దైవిక శక్తేదో ఈ సినిమా విజయానికి తోడ్పడినట్టుంది.
– సి. యస్. రాంబాబు