తళుకులీనువజ్రాలు

తళుకులీనువజ్రాలు

నా అనే దిక్కులేని‌ తారకలవి
వెలుగులు మరచిన మిణుగురులు
దిక్కు తోచని స్థితిలో నిలిచిన తోకచుక్కలు
మెరవాలని ఉన్నా అమాస నిశీధులు ముసురుకుని
సంతోషమంటే తెలియని అభాగ్యులు…

ఎందరో చివాట్లు వేస్తున్నా పట్టించుకోక
మనసు చివుక్కుమంటున్నా శాంతం శాంతమని
పేదవాని‌ కోపం పెదవికి‌చేటని పెద్దలమాట నమ్మి
లేని‌నవ్వులు పెదవుల నిండా నింపుకుని
ఆశలు ఆశయాలు ఎన్నున్నా చిదిమేసుకుంటూన్న
చేయూతలెరుగని చిన్నారులు వాళ్ళు…

కరణాలనేకాలుగా ఒంటరులైపోతే‌…
బంధువులంతా రాబందులుగా మారి పొడుచుకుతింటే‌‌‌….
అనారోగ్యంతో ఐనవారు లేక అనాధైతే….
జగమంత కుటుంబమనుకుని‌ బ్రతుకీడుస్తున్న
సానపట్టని తారకలెందరెందరొ మన సమాజాన…

వాడ వాడలా బిచ్చగాళ్ళుగానూ….
వీధి వీధిలో అన్నార్తులుగానూ…
చీదరించుకుని ఛీకొడుతున్న పెద్దమనుషుల వద్ద
ఛీత్కారాల ఛీవాట్లు తింటూ….
నోరు మెదపక తెలివిని తాకట్టుపెట్టుకుని….
జాలిలేని‌ సమాజంలో రాలిపోతున్న జాతిరత్నాలు…
కళ్ళు తెరువక మేధావులని విదేశాలకి పంపుకుంటున్న
చదువుకున్న వివేకులం కదా మనం!!!!!!

– ఉమా మహేశ్వరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *