దైవం మనుష్య రూపేణా…!

దైవం మనుష్య రూపేణా…!

అప్పుడు నాకు పదిహేనేళ్లు.. పదవతరగతి పూర్తి చేసేపనిలో ఉన్నాను. ఒకరోజు నేను నా స్నేహితుడు కలిసి దగ్గర్లోని టౌన్ కి సినిమాకు వెళ్లాలని అతికష్టం మీద ఇంట్లో ఒప్పించాం.. అందులో భాగంగా నా స్నేహితుడి అమ్మకు నేను ఒక మాటిచ్చాను.

ఎట్టి పరిస్థితుల్లోనూ లారీ ఎక్కమని.. బస్సులోనే వెళతామని.. జాగ్రత్తగా వాడిని తీసుకువస్తానని.. అప్పుడుగానీ ఆ అమ్మ మనసు కుదుటపడలేదు. ఆ వయసులోనే నా వయసులో ఉన్న మరొకరికి నేను రక్షణనివ్వడం వెనుక నా ధైర్యం‌ ఏమిటో…? నాకప్పుడు తెలీదు.

చేతిలో కాసిన్ని డబ్బులతో పట్నానికి బయలుదేరాం.. పట్నానికి వెళ్లి ఓ సినిమా చూశాం. అప్పటికే బాగా ఆకలి వేస్తుండటంతో ఓ హోటల్ కి వెళ్లాం. రెండు ఇడ్లీలు తిని బిల్లు ఇస్తే ఒక రూపాయిని హోటల్ లో వెనక్కి ఇచ్చారు.

నేను ఆ రూపాయిని సర్వర్ కి టిప్పుగా ఇచ్చేశాను. ఆ సమయంలో నాలో ఒక లాంటి సంతృప్తి.. ఉన్నంతలోనే కొంత దానం అప్పుడే అలవాటైందనుకుంటా..!

కడుపుకాస్త శాంతించాక తిరుగుప్రయాణం మొదలైంది. బస్టాండ్ కి వచ్చి బస్సు కోసం‌ ఎదురుచూస్తున్నాం.. అప్పుడు అమ్మకిచ్చిన మాట గుర్తొచ్చింది.. చేతిలో మిగిలిన డబ్బులెంతా‌‌‌‌ని చూసుకున్నాం.. ఒక్కసారిగా ఒంట్లో భయం పుట్టింది.

బస్సెక్కాలంటే చార్జీకి ఒక రూపాయి తక్కువగా ఉంది. అప్పుడేంచేయాలో తెలియలేదు. లారీ ఎక్కించలేను వాడేమో.. అనవసరంగా హోటల్లో టిప్పు ఇచ్చావ్.. అదే రూపాయి తక్కువైంది.. ఏం చేస్తావ్ అంటున్నాడు.

నాకు‌ మాత్రం ఓ నమ్మకం ఉంది. చేసిన సాయం ఎప్పటికీ వృధా కాదని.

నిమిషాలు గడుస్తున్నాయ్.. బస్సులన్నీ వెళ్లిపోతున్నాయ్.. చీకటి పడిపోతోంది.. ఇంకా రాలేదని ఇంట్లో కంగారు పడుతుంటారు. మాకేమో ఆ పట్నంలో ఎవరూ తెలీదు.. ఏం చేయాలో పాలుపోవడం లేదు.. ఆ సమయంలో అమ్మకు నేనిచ్చిన మాట నిలబెట్టమని దేవుడిని కోరుకున్నాను‌..

సరిగ్గా అప్పుడే ఒక వ్యక్తి కనిపించారు. ఆయనను ఎక్కడో చూసినట్టుగా ఉందనిపించింది.. మా ఊరతనే అని గుర్తొచ్చింది. కానీ ఆయన దగ్గరకు వెళ్లి ఒక రూపాయి ఇమ్మని అడగాలంటే ఎందుకో మనసు ఒప్పుకోలేదు.. దానినే ఆత్మాభిమానం అంటారని అప్పుడు నాకు తెలీదు.‌. కానీ‌ మాకు వేరే మార్గం లేదు.

ఎలాగో ధైర్యం చేసి ఆయన దగ్గరకెళ్లి పలకరించాం. “ఏమ్మా… ఇక్కడున్నారేంటి? ఊరికి వచ్చేస్తున్నారా”.. అని ఆయన అడగగానే‌ అవునంటూ తటపటాయిస్తుంటే మా‌ అవస్థను గమనించి.. ఏమైందని ఆయనే అడిగారు.

మేం‌ విషయం చెప్పడంతో‌‌.. అయ్యో.. దీనికెందుకు అంత ఆలోచన.. రండి నేనిస్తాను అన్నారు‌. ఒక్క రూపాయి మాత్రమే చాలని, ఊళ్లోకి వెళ్లగానే తిరిగి ఇచ్చేస్తామని చెప్పి ఆ రూపాయి తీసుకుని ఆయన వెంట బస్సు ఎక్కి ఇంటికొచ్చేశాం.

“మాటిస్తున్నప్పుడు కష్టం గురించి ఊహించలేదు.. ఖర్చు చేస్తున్నప్పుడు డబ్బు విలువ తెలియలేదు.. దానం చేస్తున్నప్పుడు దాన్నసలు పట్టించుకోలేదు”. కానీ ఒక్క రూపాయి.. ఎన్నో పాఠాలను నేర్పించింది..

ఒక్క రూపాయి జీవిత పరమార్ధాన్ని బోధించింది. కానీ ఒక్కటి మాత్రం బాగా అర్థమయ్యింది. ఎంతకష్టమైనా ఇచ్చిన మాట కోసం నిలబడాలని, దానగుణంతో జీవించాలని, అలాంటి వారికి దైవమే తోడవుతుందని.. వెన్నంటి ఉండి నడిపిస్తుందని.

ఇంతకీ చార్జీ ఎంతో చెప్పలేదు కదూ.. బస్సుకైతే ఒక్కొక్కరికీ ఆరు రూపాయలు.. లారీకైతే ఐదు రూపాయలు.. మా దగ్గర ఉన్నవి పదకొండు రూపాయలు.. బస్సుకు ఒక రూపాయి తగ్గింది.. అదే అమ్మకు ఇచ్చిన మాటను ఒక్కక్షణం పక్కనపెట్టి ఉంటే ఒక రూపాయి మిగిలేది.

గంటలపాటు నిరీక్షణ.. అంతకు మించిన భయంతో కూడిన సంఘర్షణ తప్పేది.. కానీ అది నా జీవితాన్ని మరోలా మలిచుండేది. కానీ‌ మనుష్యరూపంలో నాతోనే దానం చేయించి, అదే మనుష్యరూపంలో నాకు సాయం అందించి ఆ దైవం నాకు అప్పుడే ధర్మ‌మార్గాన్ని ప్రబోధించాడని ఆ తర్వాతే నాకు తెలిసింది. మనిషిలోనే దేవుడిని చూడటం అప్పుడే అలవాటైంది.

– ది పెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *