భానుమీటర్
బద్దకాన్ని మేసిన మాన్సూన్(monsoon) భానుడు
నాట్ సో సూన్ అంటూ
అమ్మ చాటు అబ్బాయి లా
మేఘాల మాటు దాక్కుంటే
ఫక్కుమంటూ మబ్బులన్నీ
ముందుకుతోశాయి
ఉనికి కోసం భగ్గుమనే ప్రతిపక్షంలా
మనవాడూ అంతే
మూణ్నెళ్ళు చెమటలు పట్టిస్తాడు
ఏదో మూణ్ణాళ్ళ ముచ్చట అనుకుంటే పోలా
చిటపటలాడటం మానేస్తాం
మాయా ప్రపంచం తమ్ముడూ
ఏదీ కుదురుగా ఉండదు
ఉండవివ్వదు కూడా
చూసీ చూడనట్టుగా పొమ్మనే
సూరీడు మాస్టారు చెప్పేది
యుగాల ప్రయాణం ఆయనిది
తత్కాల్ ప్రయాణం మనది
కర్మ సిద్ధాంతం ప్రతినిధిలా సాగిపోతుంటాడు
కాస్త సాగిలపడి నేర్చుకుంటే
గిలగిలలాడం..విలవిలలాడం..
వీణానాదమంతా తీయగా కాలాన్ని గడిపేయొచ్చు..
అదిగో సాక్షీభూతుడు నవ్వుతున్నాడు..
బారోమీటర్(barometer) లా తనది భానుమీటర్
– సి. యస్. రాంబాబు