నిట్టూర్పు

నిట్టూర్పు

రోజూ భయంతో భారంగా అడుగేస్తాడతను
నిన్న నిరాశపరిచిందంటాడు
నేడు ఆశను పరచలేదంటాడు
రేపు వంక చూడనంటాడు!

బతుకే అంత
సాఫీగా సాగే రహదారిలా
ఉండదంటే వినడే
అవరోహణల ఆరోహణల
రాగవిహంగమై పరుగుతీయటమే
అర్థం పరమార్థమని
చెప్పాలతనికి!

కలతలు కల్లోలాల
కొనఊపిరి
కొత్తేమీ కాదు అతనికి
మారాంచేసే మనసుకు
గారాంచేయటం నేర్పాలని
అతను నేర్చుకుంటే
రేపు వంక ఓర్పుతో చూస్తాడు!

సాధ్యాసాధ్యాలను కొలవటం కాదు
ధ్యాసను దైవంగా భావించి
ఆశను ధ్యానంగా చేసి
ప్రేమపాశంతో అతను
మనుషులను మనసులను బంధించగలిగితే
బతుకు ఆకలి తీర్చే మెతుకవుతందతనికి
బోధపడని ఈసత్యాన్ని
బోధించే బోధిసత్వుడు
అతనికి దొరికితే బావుండన్న నిట్టూర్పు నాలోంచి వెలువడింది!

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *