వదులైన బొందు వేసెను బంధానికి పీఠముడి!! (భాగం-2)
” బండి కిక్ కొట్టాడు” వాసు.
అందరికీ, ‘సీ యూ టుమారో’ అంటూ రివ్వున దూసుకెళ్లారు ఇద్దరూ…
కాలేజీ మెయిన్ గేటు దాటి, మెయిన్ రోడ్డు పై రైట్ టర్న్ తీసుకున్నారు. కొంచం ముందుకి వెళ్ళగానే, లెఫ్ట్ సైడ్ ఒక కాలనీ వస్తుంది. దాని పేరు మార్కండేయ కాలనీ.
అప్పుడప్పుడే అక్కడ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎర్ర మట్టి రోడ్లు, ఇండ్లు ఇంకా వెలువక పోవడం తో ఒర్రెలు, గుంతలు, తుమ్మ చెట్ల తో నిండిపోయి ఉంటుంది దారి పొడవునా…..!
నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఇంకా పూర్తి స్థాయిలో పని ప్రారంభించలేదు. ఇంకా కొన్ని యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయి. దాంతో, ఆ రోడ్డుకి ఇరుపక్కల, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన రోజూ కూలీలు గుడిసెలు వేసుకొని తాత్కాలిక నివాసాలు ఏర్పరుచుకున్నారు.
నిత్యం జన సంచారంతో హడావుడి ఎక్కువ అక్కడ. ఈ పొడవాటి రోడ్డుని గనక ఒక పెద్ద చెట్టు కాండము అనుకుంటే, దాని శిఖరాన పూసిన రెండు అందమైన కాలీఫ్లవర్స్ లాగా ఉంటాయి ఎఫ్సీఐ మరియు గౌతమి నగర్.
ఎఫ్సీఐ అంతా గేటెడ్ కమ్యూనిటీ. చక్కటి చెట్లు, పూదోటలు, అందమైన ఇంటర్నల్ రోడ్లు చక్కగా ప్లాన్ చేసి కట్టిన ఇండ్లు.
********
రోడ్డు సరిగా లేకపోవడంతో ఎక్కువసార్లు బ్రేక్ వేయాల్సి వస్తోంది వాసు కి.
“పోనీ రా……!” అన్నాడు ఆనంద్.
స్పీడ్ పెంచే ప్రయత్నం చేశాడు వాసు.
అక్కడ ఎండల తీవ్రత ఎక్కువ. 50 డిగ్రీల సెంటిగ్రేడ్ కు చేరుకుంటుంది ఉష్ణోగ్రత ప్రతీ సంవత్సరం. సాయంత్రం నాలుగు దాటింది కానీ వడగాలి రివ్వున చెవులకు తాకుతోంది.
“పాపం, రెండు జెళ్ళ సీత.” అన్నాడు ఆనంద్
“ఇప్పుడు ఏమైంది ఆమెకి?” విసుగ్గా అడిగాడు వాసు.
“లేత తమలపాకులా ఉంటుంది, ఈ వేడికి వడలి పోదా……!” నిట్టూర్చాడు ఆనంద్.
“అబ్బో, ఉప్మా ఇచ్చింది నాకు, నీకెందుకో తెగ జాలి?” అన్నాడు వాసు.
“ఆ, నువ్వు కాస్త తిండి పోతులా కనబడి ఉంటావు.” అన్నాడు ఆనంద్.
“ఏంటి……?” రెట్టించి అడిగాడు వాసు.
“నీకు ఇస్తే మాత్రం ఏంటి? అంతా నువ్వు ఒక్కడివే మింగవని ఆమెకి తెలుసు. అందరికీ ఇచ్చింది” అన్నాడు ఆనంద్.
“మరి నన్నే ఎందుకు పిలిచింది?” ప్రశ్నించాడు వాసు.
“ఆ, ఒక ఫోర్ కొట్టావుగా…. అలసిపోయావు అనుకుంది లే!” అని వెటకారంగా అన్నాడు ఆనంద్.
“అదిగో, సీత” కొండని తవ్వి కోట్లు పట్టినట్టు ఆనందం వాడిలో.
“ఏంటి, ఇంకా ఇంటికి చేరలేదా పిల్ల?” అన్నాడు వాసు.
“ఎండ కదరా, పాపం.” అన్నాడు ఆనంద్.
బండిని ఆమె ప్రక్కనుంచి తీసుకెళ్లాడు వాసు. ఇద్దరూ ఆమెని పట్టించుకోనట్టు ముందుకి దూసుకెళ్లారు. కానీ సీత ఏదో కొత్త పేరుతో పిలిచినట్టుగా అనిపించింది వాసుకి.
“ఒరేయ్, నందు గా! ఆమె ఏదో వెరైటీగా పిలిచింది విన్నావా?” అడిగాడు వాసు.
“ఓ, పోటుగాడివి నువ్వు. నా చెవులు వడ గాలి కి వాపు వచ్చి పనిచేయట్లేదు.” నేను వినలేదు అన్నాడు ఆనంద్.
“వెటకారాలు ఆపి విన్నావా లేదా సూటిగా చెప్పు.” అన్నాడు వాసు.
“విన్నాను లేరా, కానీ నాకు సమజ్ కాలే.”
“బండి ఆపి దిగు.” అన్నాడు వాసు.
“ఎందుకురా?” అని అడిగాడు ఆనంద్.
“నేను వెళ్లి వివరాలు రాసుకుని వస్తా….!” అన్నాడు వాసు.
“వివరాల?” దేని గురించి అన్నాడు ఆనంద్.
“దిగురా, నువ్వు ముందు బండి!” అన్నాడు వాసు.
“నేనూ, వస్తా. నీ పెన్ను రాయకపోతే, నేను రాస్తా” అన్నాడు ఆనంద్.
“అదిగో, అక్కడ ఒక షటర్ మూసి ఉంది. అక్కడ గద్దె మీద కూర్చో. నేను వెనక్కి వెళ్లి వస్తాను.” అన్నాడు వాసు.
తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ, బండి దిగాడు ఆనంద్.
ఇంతకీ ఆ రెండు జెళ్ళ సీత ఏమని పిలిచింది? ఎందుకు పిలిచింది? వాసు కి ఎం వినిపించింది? తెలుసుకోవాలంటే తదుపరి భాగం వచ్చేవరకూ ఆగాల్సిందే
– వాసు