అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ

 అక్షర లిపి ఫౌండర్ తో ఇంటర్వ్యూ

మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం, అక్షరలిపి ఫౌండర్ శ్రీ శారదా దేవి గారి ఇంటర్వ్యూ మీకోసం

అర్చన:- అమ్మ నమస్తే  మీరు పుట్టింది ఎక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నారు ?
అమ్మ:- అమ్మా నమస్తే,  నేను పుట్టింది పెరిగింది ఒక మోస్తరు పట్టణంలో అయినా  మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే, అంటే పల్లెలో పెరిగాను. మాది చాలా పెద్ద ఉమ్మడి కుటుంబం.
నేనొక మామూలు మధ్య తరగతి సగటు ఇల్లాలిని. చదువుకున్నది తక్కువే, అయినా ఎంతో,కొంత తెలుసుకున్నాను. అనుభవం అన్ని నేర్పిస్తుంది అమ్మ.
ఇప్పుడు నేను ఏమి చేయడం లేదు అంతా నా పిల్లలే చూస్తున్నారు. కాకపోతే కొన్ని విషయాల్లో నేను సలహాలు ఇస్తూ ఉంటాను, పిల్లలు కూడా నన్ను అన్ని అడుగుతూ ఉంటారు.
అర్చన:- అసలు ఈ అక్షరలిపి అనేది మీరు ఏలా మొదలు పెట్టారు  ?
అమ్మ:- దీని గురించి మీకు చెప్పాలంటే నేను నా గురించి ఇంకొంత మీకు చెప్పాలి. ఎనిమిదో తరగతి లోనే నాకు పెళ్లి చేశారు. మా వారు ప్రభుత్వ ఉపాధ్యాయులు.
పిల్లలు పుట్టక ముందు ఇద్దరమే ఉండే వాళ్ళం కాబట్టి నాకేం తోచక పోయేది. అందువల్ల మా వారు నాకు చాలా రకాల నవలలు తెచ్చి ఇచ్చేవారు.
పెళ్లికి ముందే నాకు నవలలు చదవడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. చాలా వరకు చదివేశాను.
కానీ పెళ్లి తర్వాత కుదరదు అనుకున్నా, కానీ మా వారు నాకు డిటెక్టివ్ నవలలు తీసుకొచ్చి ఇచ్చేవారు. అలా నవలలపై చాలా ఇంట్రెస్ట్ పెరిగింది.
ఆ తర్వాత పిల్లలు పుట్టడంతో నవలలు చదవడం మానేశాను. పిల్లల ఆలనా, పాలనలో, ఆడపడుచుల పెళ్ళిళ్ళు, వాళ్ళ సీమంతాలు, పురుళ్ళ తో , బాధ్యతల నడుమ సమయమంతా సరిపోయేది. తర్వాత తర్వాత కూడా నాకు చదవాలన్న కోరిక ఉండేది. కానీ సమయం ఉండకపోవడం వల్ల ఏమి చదవలేకపోయాను.
అయితే ఇన్నాళ్లకు మళ్ళీ కాస్త తీరుబాటుగా దొరికింది. కానీ చదవాలన్నా నా కోరిక తీరలేదు ఎందుకంటే నాకు కంటి చూపు మందగించింది దాంతో ఆపరేషన్ చేసుకోవాల్సి వచ్చింది.
పుస్తకాల్లో చిన్న చిన్న అక్షరాలు కనిపించవు.  ఫోన్లో కూడా చదవలేను. కానీ కొన్ని కొన్ని రచనలు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. వాటిని ఫాంట్ సైజు పెంచుకుని చదువుతూ ఉంటాను.
నాకు చదవాలన్న కోరిక తీరలేదు. కాబట్టి ఏదైనా రాస్తే బాగుంటుంది అని అనిపించింది. మా అమ్మాయి కూడా ఒక చిన్న  రచయిత కాబట్టి  అందరి సహకారంతో ఆలోచించి ఈ అక్షరలిపి అనేది మొదలు పెట్టాము.
మొదలు అయితే పెట్టాం. కానీ అన్నిట్లో సమస్యలు ఉన్నట్టే ఇక్కడా ఉన్నాయి. వాటిని దాటుతూ ముందుకు వెళ్ళడమే. ఇప్పటికీ కొన్ని చదువుతూ ఉంటాను.
అర్చన:- అమ్మ మీకు ఎవరి నవలలు అంటే ఎక్కువ ఇష్టం? మీరు చదివిన వాటిల్లో ఏ నవల ఇష్టం?
అమ్మ:- అందరి నవలలు ఇష్టమే, అందరూ ఇష్టమే… యద్దన పూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యా దేవి, పోల్కం పల్లి శాంతాదేవి, యండమూరి, సూర్యదేవర, అడవి బాపిరాజు, మల్లాది, మధుబాబు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు…. 
ఇలా నేను చదివిన వాటిలో చాలా వరకు సినిమాలుగా వచ్చాయి. అవన్నీ చూసాను కానీ సినిమాకు, పుస్తక రచనకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఏ నవల అంటే చెప్పలేను కానీ సెక్రెటరి నవల చాలా  ఇష్టం.
అన్ని నవలలు బాగుంటాయి, ఏదని చెప్పలేం, అయితే ముక్కుసూటిగా ఉండే రచనలు ఎక్కువ ఇష్ట పడతాను. వర్ణన ఎంత ఉండాలో అంతే ఉండాలి.
ఇప్పుడు భవ్యచారు అని ఒకమ్మాయి, అలాగే నా కూతురు కూడా సూటిగా రాస్తారు. కొందరికి కొన్ని జన్మతః వస్తాయి. వాటిని సాన పెట్టాలి. సమాజంలో జరుగుతున్న విషయాల పై దృష్టి పెడుతూ వాటికి పరిష్కారాలు చూపగలగాలి. అప్పుడే ఆ రచనకు అర్ధం పరమార్ధం కలుగుతుంది. 
అర్చన:- అమ్మ ఈ అక్షర లిపి ని  ఎలా ముందుకు తీసుకు వెళ్లాలని అనుకుంటున్నారు ?
అమ్మ:- మంచి ప్రశ్న… ఈ మధ్యకాలంలో తెలుగులో చాలా మంది రాస్తున్నారు కానీ వాళ్ళు ఏం రాస్తున్నారో వాళ్లకి అర్థం కావడం లేదు. పిచ్చి పిచ్చి రాతలు అన్ని రచనలే అనుకుంటున్నారు.
పాత పాటల్లో పదాలు తెచ్చి అవే కవిత్వం అంటూ చూపిస్తున్నారు. కాని రచన చేస్తే మది ని తట్టిలేపాలి, సమాజాన్ని ప్రశ్నించాలి, ఎదురించాలి, ఆలోచించేలా చేయగలిగేదే రచన అని నా అభిప్రాయం. 
అలాగే చాలామంది తెలుగునే మర్చిపోతున్నారు. తెలుగు వారిని గౌరవించలేక పోతున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా పిల్లలు అందరూ తెలుగు మీడియంలోనే చదివారు.
వాళ్లకి ఉద్యోగాలు రావడం చాలా కష్టమైంది. ఎందుకంటే తెలుగు మీడియం అని అందరూ వాళ్ళని చులకన  చేశారు. అందువల్ల ఈ అక్షరలిపి అనేది మొదలు పెట్టాను. దీనికి దానికి సంబంధం ఏంటి అనేది మీకు ఇంకా వివరంగా చెప్తాను.
బ్రతకడానికి ఇంగ్లీష్ భాష అవసరమే కావచ్చు అలా అని కన్నతల్లి లాంటి తెలుగును మర్చిపోవద్దు. కన్నతల్లి లాంటి తెలుగును చిన్నచూపు చూడడం నాకు నచ్చలేదు.
అందరూ ఆంగ్ల భాషపై మక్కువ పెంచుకొని, ఆంగ్లం లో పుట్టి పెరిగినట్లుగా మాట్లాడడం కూడా ఇందుకు కారణం. ఆంగ్ల భాష అనేది కడుపు నింపుతుంది కావచ్చు, కానీ ఎంత దేశ దేశాలు దాటి వెళ్లినా తిరిగి కన్న భూమి కి కన్న తల్లి దగ్గరికి రావాలి.
అంటే కన్నతల్లి లాంటి తెలుగు దగ్గరికి రావాలి. కొందరు విదేశాల నుంచి వచ్చిన వాళ్లు వాళ్ల గొప్పని చూపించుకోవడానికి ఆంగ్లంలో తల్లిదండ్రులతో మాట్లాడటం నేను చూశాను.
అప్పుడు నాకు ఇదేమి పరీక్ష ధోరణి అని అనిపించింది. నువ్వు ఎక్కడైనా ఉండు గాక మీ తల్లిదండ్రులతో మాతృ భాషలోనే కదా మాట్లాడాలి.
ఇదే కాకుండా మన రచయిత అయిన భవ్య గారి స్నేహితురాలు (తనకన్నా పెద్ద) అయిన   కూతురు ప్రవర్తన కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
ఆ అమ్మాయి ఈ దేశంలో పుట్టి పెరిగి, సంస్కృతి సాంప్రదాయాలను మరచి, అక్కడ  పాశ్చాత్య ధోరణులను అవలంబిస్తూ ఉండడం ఆ స్నేహితురాలు మాతో చెప్పి చాలా బాధపడింది.
ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ఇలాంటి ఒక వేదిక స్థాపించి మన తెలుగును, తెలుగువారిని సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవచ్చు అని అనిపించి స్థాపించడం జరిగింది.
అలాగే నాకు సాహిత్యం పై ఉన్న మక్కువ కూడా ఒక కారణం అయ్యింది. ఎవరి కోసమో కాకుండా మన కోసం మనం స్థాపించుకున్న సంస్థ ఇది.
ఇక్కడికి ఎవరైనా రావచ్చు, తమ రచనలు రాయొచ్చు, అనుభవాల ద్వారా పది మందికి జ్ఞానాన్ని ప్రసాదించవచ్చు. ఇక దీన్ని ముందుకు తీసుకెళ్లడం అంటారా మనకు పెద్దగా విరాళాలు రావడం లేదు.
ఎవరైనా దాతలు తెలుగును గౌరవించేవారు ఇస్తే ఇంకా దీన్ని పెద్ద వేదికగా మార్చాలని మన ఆశయం. నాకు చేతనైనంతలో తెలుగును కాపాడుకోడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అయితే  విరాళాలు  రావడం అనేది వారి ఇష్టం నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.
మేము ఉన్నంతవరకు ఈ పత్రిక ఇలా కొనసాగుతూనే ఉంటుంది. దాతలు ఎవరైనా వారి ఇష్ట పూర్వకంగా ఇస్తే కాదు అనలేం. అలాగని వాళ్ళని ఇబ్బంది పెట్టలేము.
ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఇది ఒక వేదిక గానే కాకుండా ఒక అనువర్తన అంటే యాప్ లాగా కూడా తీసుకురావాలని అనుకుంటున్నాను. కానీ ఆర్థిక భారం వల్ల చేయలేకపోతున్నాం.
తెలుగు భాష గౌరవం కోసం కాపాడుకోవడం కోసం ఎవరైనా ఉచితంగా వస్తే వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం.
అర్చన:- అమ్మ మహిళా దినోత్సవం జరుగుతున్నది కదా దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
అమ్మ:- మహిళా దినోత్సవం అంటూ అందరూ సంబరాలు జరుపుకుంటున్నారు మంచిదే కానీ,  మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము?  ఏం సాధించామని జరుపుకుంటున్నాము? అనేది మనం ఒకసారి ఆలోచించాలి.
ఎంతో సంతోషంగా ఉంటేనే ఇలాంటి దినోత్సవాలు జరుపుకోవాలి. కానీ మహిళలు ఎక్కడ సంతోషంగా ఉన్నారు? యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర  దేవతాః అన్నారు.
కానీ స్త్రీ ఎక్కడ పూజింపబడుతుంది? ఎక్కడ ఆమెను గౌరవంగా చూస్తున్నారు? ఎక్కడ చూసినా మహిళను ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధిస్తున్నారు.
నన్నే తీసుకోండి నేను ఎన్నో రకాల హింసలు అనుభవించే ఇక్కడి వరకు వచ్చాను. అసలు ప్రాణాలతో ఉంటానో, లేదో తెలియని పరిస్థితి.
నా పిల్లల కోసం, వాళ్ళ బాగుకోసం, నేను తిన్నా, తినకపోయినా, నా పిల్లలకి పెట్టుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంతవరకు వచ్చాను. ఎంతో నరకం అనుభవించాను. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను ఎన్నో లైంగిక హింసలను ఎదుర్కొన్నాను.
నా పరిస్థితే ఇలా ఉంటే మిగిలిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రొద్దున లేస్తే పేపర్లో, టీవీలో ఎక్కడ చూసినా మహిళలపై హింసలు కొనసాగుతున్నాయి. దీనికి అంతు, అదుపూ లేకుండా పోతోంది.
ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోయి, ఆ స్త్రీని ఎన్ని రకాలుగా వేధించాలో అన్ని రకాలుగా వేధిస్తున్నారు. పసి పాప నుంచి పండు ముదుసలి వరకు  ఎవరినీ వదలడం లేదు.
ప్రభుత్వాలు, చట్టాలు వారిని ఏమీ చేయలేక పోతున్నాయి. ఎక్కడో నూటికో, కోటికో ఒక్క మహిళ విజయం సాధిస్తుంది.అది కూడా అన్ని అవమానాలు తట్టుకొని,అన్నిటినీ అధిగమించి తన ఆశయం నెరవేర్చుకుంటుంది.
ఇంకేక్కడుంది మహిళా సాధికారత, కేవలం కాగితాలపైనే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ మహిళలు అటు ఆఫీసు, ఇటు ఇల్లును, పిల్లలను, కుటుంబాన్ని, సమర్థంగా నిర్వహిస్తూ తమ సత్తా చాటుకుంటున్నా కూడా ఈ లైంగిక వేధింపుల వల్ల ఇంకా అభివృద్ధిని సాధించలేకపోతున్నారు.
ఈ మహిళా దినోత్సవం ఒక్క రోజు జరుపుకునేది కాదు. ప్రతిరోజు పండుగలా జరగాలి.ఒక్కరోజైనా మహిళలకు పూర్తి విశ్రాంతి ఇస్తూ, ఆమె చేసే పనులన్నీ ఇంట్లోవారు ఎవరైనా చేయాలి అలా చేయగలుగుతున్నారా?
ప్రతి దానికి అమ్మ పైన, భార్య పైన, అక్క పైన, చెల్లి పైన ఆధారపడి బ్రతుకుతున్న మగాళ్లు ఎందరున్నారు? పుట్టింటి లోనూ, అత్తింటి లోనూ, ఉద్యోగ నిర్వహణలో ఎన్నో బాధ్యతలను నిర్వర్తిస్తున్న మహిళను చాలా చిన్నచూపు చూస్తున్నారు.
ఒక్క రోజు కూడా విశ్రాంతి లేకుండా స్త్రీ ఒక నిరంతర యంత్రంలా పని చేస్తూనే ఉంది. మహిళా దినోత్సవం అంటే మహిళలంతా సంతోషంగా ఉన్నరోజు. ఆ రోజు తొందరలోనే రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.
అర్చన:- అంటే అమ్మ కొందరు కొన్ని రంగాలలో విజయాలు సాధించారు కదా మరి వారి గురించి ఏమంటారు ?
అమ్మ:- అదే చెప్తున్నా.. ప్రతి మగాడి విజయం వెనకాల స్త్రీ ఉన్నట్టే కొందరు ఆడవాళ్ళ విషయంలో నూటికో, కోటికో ఒక మగవాడు ఉంటాడు. ఆ ఒక్క మగాడి సహకారం వల్లే అలాంటి విజయం సాధించిన మహిళలు అరుదుగా కనిపిస్తారు.
ఇలాంటి వాళ్లని వేళ్లపైన లెక్కపెట్టవచ్చు. ఇందిరాగాంధీ, నిర్మల సీతారామన్, దుర్గాబాయి దేశ్ముఖ్ కస్తూర్బా గాంధీ, కిరణ్ బేడీ, సానియా మీర్జా, పీవీ సింధు, మిథాలీ రాజ్ ఇలాంటి ఏ కొందరో వివిధ రంగాల్లో తమ సత్తా చాటారు.
అయితే నేను అనేది ఏంటంటే మహిళలు ఇంకా ముందడుగు వేయాలని. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ,మహిళలు అభ్యున్నతి సాధించాలని. ఇంకా మహిళల్లో చైతన్యం రావాలని కోరుకుంటున్నాను.
విజయం సాధించినా కూడా ఆయా రంగాల్లో వాళ్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అంతవరకు ఎందుకు నా భర్త కూడా నన్ను చదువుకోమని చాలా ప్రోత్సహించాడు. నాకు పెళ్ళయ్యి ఒక పాప పుట్టిన తర్వాత పదోతరగతి పరీక్షలు రాశాను,ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత సాధించాను.
ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఒక చిన్న స్కూల్ కూడా నడిపాను. నా భర్త ప్రోత్సాహం లేకపోతే నేను అవన్నీ చేసేదాన్ని కాదు. అందుకే చెప్తున్నాను ఎక్కడో నూటికో, కోటికో ఒక్కరు ఉంటారు అని.
ఆయన కూడా పెద్ద గొప్పవాడు అని చెప్పను. ఎందుకంటే నన్ను అన్ని రకాలుగా హింసించాడు. కానీ ఎక్కడో చోట మంచితనం అనేది ఉంటుంది కదా, ఆ మంచితనంలో నన్ను ప్రోత్సహించడం కూడా ఒకటి.
మా ఆయన వల్లే నేను నవలలపై ఒక అవగాహన అనేది పెంచుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఇలా మీ ముందుకు రావడానికి కూడా అదే కారణం కావచ్చు. అయితే మహిళలకు ఇలాంటి ఏ ఇబ్బందులు రాకుండా సంతోషంగా వాళ్ళ లక్ష్యం, ఆశయాల  వైపు అడుగులు వేయాలని నా ఆకాంక్ష.
అర్చన:- అమ్మ అయితే మీరు కూడా చాలా హింసలు పడ్డారు అన్నమాట ?
అమ్మ:- ఆడదంటే ఒక విలాస వస్తువని, ఆమెను హింసించడమే తమ పరమావధిగా భావించే మగవాళ్ళు ఉన్నంతకాలం హింసలు తప్పనిసరి. అందుకు ఎవరు తక్కువా, ఎక్కువా కాదు.
నేనే కాదు ప్రతి రంగంలోనూ, ప్రతి ఇంట్లోనూ, ప్రతి స్థలంలోనూ ఆడవాళ్లు ఎప్పుడో ఒకసారి హింసించ బడుతూనే ఉన్నారు.
ఆ హింస అనేది తోటి ఆడదాని చేతిలో కావచ్చు, భర్త చేతిలో కావచ్చు, పరాయి వాడి చేతిలో కావచ్చు, కొడుకు చేతిలో కావచ్చు, ఇలా ఆడవాళ్ళు ప్రతి వ్యక్తితో హింసించబడుతూనే ఉన్నారు. మాటల ద్వారా, తమ చేతుల ద్వారా, సైగల ద్వారా ఎన్నో రకాలుగా ఆడవారిని తాకుతూ హింసిస్తూ ఉన్నారు.
నేను దానికి అతీతురాలిని కాదు, అత్త, ఆడపడుచులు, మరుదులు, మామ, తోటి కోడలు, ఆడపడుచు భర్త, చేతిలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఎన్నో దెబ్బలు కూడా తిన్నాను.
నాకు కలిగిన ఈ హింస ఇంకెవరికీ కలగకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ప్రతిరోజు వస్తున్న వార్తలను నాకు ఎంతో బాధ కలిగిస్తున్నాయి.
అర్చన:- అమ్మ చివరిగా మీరు మహిళలకి ఏం ఏం చెప్పదలచుకున్నారు?
అమ్మ:- మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కాదు కానీ నా తరపున రెండే రెండు మాటలు చెప్పాలనుకుంటున్నా. ఆడవాళ్లు ఎంతసంతోషంగా ఉంటే అంతమంచిది. మీ సంతోషమే మీకు బలం.
ఇది పాత మాటనే కావచ్చు, కానీ మీ కన్నా శక్తిమంతులు ఎవరూ లేరు. నీకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకో. ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని భావించు. సహనం ఓపిక ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది.
సహనంతో, ఓపికతో ఉంటే దేనినైనా సాధించవచ్చు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఇక మీరు ఏ రంగంలో అయినా అభివృద్ధిని సాధిస్తారు. మీరందరూ అనుకుంటున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీకు నా శుభాకాంక్షలు.

అమ్మ చాలా విషయాలు మాతో పంచుకున్నారు. మేము అనుకుంటున్న మహిళా దినోత్సవం సందర్భంగా మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు నమస్కారం.

– అక్షరలిపి టీం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *