మాట
నారాయణ కు ముగ్గురు పిల్లలు ఇద్దరూ ఆడపిల్లలు, ఒక అబ్బాయి. నారాయణ ముగ్గుర్నీ బాగానే చదివిస్తున్నారు. ఆయనకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఉన్నంతలో బాగానే ఉన్నారు. ఒకరికి అన్నం పెట్టే స్థోమత కలిగిన నారాయణ అప్పుడప్పుడు అన్నదానం లాంటివి చేస్తూ ఉంటాడు.
అలాంటి ఒకరోజు గుళ్ళో అన్నదానం జరుగుతున్న సమయంలో గుడి మెట్ల పైన ఉన్న అందరినీ మండపం లోకి రమ్మని పిలవాలని వచ్చాడు. అందర్నీ బాబు నేను ఈ రోజు అన్నదానం చేస్తున్నా రండి వచ్చి భోజనం చేయండి అన్నాడు.
ధర్మ ప్రభువులు అంటూ అందరూ లోపలికి వెళ్ళారు. అందరితో పాటు లోపలికి వెళ్లబోతుంటే నారాయణ కు చివరి మెట్టు పై తల పై కొంగు వేసుకుని ఉన్న ఒక నలభై ఏళ్ళ ఆవిడ అలాగే కూర్చుని ఉండడం గమనించి, ఆమెకు వినిపించ లేదేమో అనుకుంటూ, ఆమె దగ్గరగా వచ్చాడు.
ఆమెతో నారాయణ, అమ్మా మీకు వినిపించనట్లు ఉంది. ఈరోజు నా కూతురి పుట్టిన రోజు అందువల్ల నేను అందరికీ అన్నదానం చేస్తున్నా, మీరు కూడా వచ్చి తిని నా కూతుర్ని ఆశీర్వదించండి అన్నాడు.
దానికి ఆవిడ నాకు వినిపించింది బాబు కానీ కానీ నేను బిచ్చగత్తెను కాను అంటూ తల ఎత్తింది. నారాయణకు ఆమె గొంతు విని ఎక్కడో ఉన్నట్టు అనిపించింది.
దాంతో ఆమె మొహం లోకి తేరిపార చూసిన నారాయణ ఒక్కసారిగా పుష్ప అంటూ గట్టిగా అరిచాడు.
ఆమె కూడా అతన్ని గుర్తు పట్టి అన్నయ్యా అంటూ లేచి దగ్గరగా వచ్చింది. అమ్మా పుష్ప ఇన్ని రోజులూ ఏమై పోయవమ్మా? నీ కోసం చాలా వెతికాను.
నువ్వు ఎక్కడా కనిపించక పోయేసరికి నువ్వు చనిపోయావాని అనుకున్నా, ఈరోజు ఇక్కడ ఇలా కనపడతావు అనుకోలేదు అసలు ఏంటి ఇది అన్నాడు దుఖం పొంగుకు రాగా….
చేతులారా నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను నేను ఇంకెలా ఉంటాను అన్నయ్య అంది విచారంగా పుష్ప.
సరెమ్మా జరింగిందేదో జరిగిపోయింది. నీకు మేమున్నాం కదా పద వెళ్దాం అన్నాడు నారాయణ. అంతలో ఏదో గుర్తొచ్చినట్లుగా పుష్ప అన్నయ్య ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన వాగ్ధానం అలాగే ఉంచవా లేదా చెప్పేసావా అంది పుష్ప.
లేదమ్మా నేను ఆ రోజు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటి వరకు ఎవరితో పంచుకోలేదు. నా ప్రాణం పోయినా దాన్ని అలాగే నిలబెట్టుకుంటూ ఉంటాను అన్నాడు నారాయణ.
అతనికి గతం గుర్తొచ్చింది. తన భార్య మూడో సారి కడుపుతో ఉన్నప్పుడు ప్రభుత్వ దావాఖానాలో చేర్చాడు. అక్కడ తన భార్య పక్క బెడ్ పైన పుష్ప అర్ధరాత్రి నొప్పులతో చేరింది.
అయితే తన భార్యకు ఆపరేషన్ చేయాలనీ కాన్పు కష్టం అని అన్నారు డాక్టర్లు. తను ఆ బాధ లో ఉండగా పుష్ప నొప్పులతో బాధ పడుతూ రావడం, తోడు గా ఎవరు లేకపోవడం గమనించి ఆశ్చర్య పోయాడు.
ఆమె నిబ్బరానికి, ఆడవాళ్లు ఆ సమయం లో ఎలా ఉంటారో తన భార్యను చూసిన నారాయణకు పుష్ప ను చూసి ఆమె ధైర్యానికి మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు. కానీ ఆమె తోడూ గా ఎవరు లేకపోవడం, మెళ్ళో తాళి కూడా కనిపించక పోవడంతో కొంత విషయం అర్ధం అయినా తనకేందుకని ఊరుకున్నాడు.
కానీ లోపలికి తీసుకు వెళ్ళిన తన భార్య బిడ్డను కన్నదని కానీ అది మృత శిశువు అని తెలిసి చాలా బాధ పడ్డాడు నారాయణ.
ఇక ఆపరేషన్ చేయించాలి ఉన్న కుతుర్లె కొడుకులు అనుకోవాలి అని అనుకుంటున్న సమయం లో అప్పుడే బిడ్డను కని బిడ్డతో పాటూ బయటకు వచ్చిన పుష్ప తన దగ్గరికి వచ్చి తన చేతుల్లో బిడ్డను ఉంచుతూ మీరెవరో నాకు తెలియదు కానీ నాకు అన్నయ్య ఉంటె మీలాగే ఉండేవారు.
నేనొక విధి వంచితను నా బిడ్డను పెంచే ధైర్యం నాకు లేదు అందుకే నేను మీ చేతుల్లో ఉంచాను. ఈ విషయం నాకు, మీకు తప్ప ఇంకెవరికీ తెలియడానికి వీల్లేదు. నేను జీవితం లో ఈ బిడ్డ గురించి రాను, అడగను అని మీకు హామీ ఇస్తున్నా ఈ బిడ్డను మీ బిడ్డ లగే పెంచండి అంది.
ఆ మాటకు నారాయణ ఎదో అనబోతూ చేతుల్లో ఉన్న కళ్ళు తెరవని ఆ పసి బిడ్డ వైపు చూసాడు. ఎందుకో తను ఒక రకమైన అనుభూతికి లోనైన నారాయణ కానీ నా భార్య కు నిజం తెలిస్తే అన్నాడు.
దానికి పుష్ప మీరు నా విషయం, కానీ ఈ బిడ్డను నేను మీకు ఇచ్చాను అని కానీ ఎవరికి చెప్పను అని నాకు ప్రమాణం చేయండి. అప్పుడు ఎవరికి చెప్పలేరు, ఈ కొన్ని క్షణాలలోనే మీరు నాకు అన్నయ్య గా అయ్యారు.
మీ చెల్లి లాగా భావించి ఈ ఒక్క సాయం చేయండి అంటూ చేయి చాపిన పుష్ప చేతిలో అనుకోకుండా చేయి వేసి ప్రమాణం చేసాడు నారాయణ.
నిమిషం లోనే పుష్ప ఒకసారి బిడ్డ వైపు చూసి గట్టిగా నిట్టూర్చి, గబగబా చీకట్లోకి వెళ్లి కనుమరుగు అయ్యింది.
ఆ నాడు ఇచ్చిన వాగ్దానం ఈరోజు వరకు అలాగే ఉండి పోయింది. ఎవరితోనూ చివరికి భార్యకు కూడా చెప్పలేదు నారాయణ. విష్ణు అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ బిడ్డను.
పుష్ప మాటలతో గతం నుండి బయటకు వచ్చిన నారాయణ తో పుష్ప, చాలా సంతోషం అన్నయ్య అవును ఇప్పుడు నన్ను మీ ఇంటికి రమ్మని పిలుస్తున్నారా అంది. అవునమ్మ ఇంటికే ఒకసారి అందర్నీ చూసినట్టు ఉంటుంది అన్నాడు నారాయణ.
మీ వాళ్లకు నా గురించి ఏం చెప్తారు అంది పుష్ప. నువ్వు నాకు చెల్లి లాంటి దానివి అని చెప్తాను అన్నాడు నారాయణ. దానికి పుష్ప నేను నీ తోడబుట్టిన చెల్లిని కాదు, దూరం చుట్టం కాదు.
మీ ఇంటికి వస్తే అందరికీ లేనిపోని సందేహాలు వస్తాయి వద్దు అన్నయ్య, నీ అభిమానం చాలు అంతే ఈ కట్టెను ఇలా కాలిపోని అన్నయ్య అంది పుష్ప.
నారాయణకు కూడా అదే నిజం అనిపించినా ఒక్కదాన్ని ఆలా వదిలెయ్యలేక లోలోపల బాధ పడుతూ కాదమ్మా కనీసం అన్నం అయినా తిని వెల్దువు రా అంటూ పిలిచాడు.
దానికి పుష్ప సరే అన్నయ్య అంటూ తనతో పాటు వచ్చింది. పిల్లల తో నారాయణ ఆమె పెద్దింటి ఆవిడ లాగా ఉంది. కొంచం బాగా చూసుకోండి బ్రతికి చెడ్డట్టు అనిపిస్తుంది అంటూ చెప్పి తానే దగ్గరుండి మరీ వడ్డించాడు.
పుష్ప నారాయణ పిల్లలను చూస్తూ తృప్తిగా తినది. తిన్న తర్వాత పిల్లలు ఆవిడ ఆశీర్వాదం తీసుకున్నారు నారాయణ ప్రోద్బలం తో, ఇక పుష్ప నారాయణ తో వెళ్తాను అన్నయ్య నా గురించి ఎవరికీ ఎప్పటికీ తెలియనివ్వకు అని మళ్లీ వాగ్దానం చెయ్యి అంటూ చెయ్యి చాపింది.
అప్పుడు సరిగ్గా అప్పుడు పరుగెత్తుకుని వచ్చిన నారాయణ కొడుకు నాన్న మీరు వాగ్దానం చేయొద్దు. ఇన్ని రోజులూ చేసిన వాగ్దానం చాలు. ఇక వద్దు అమ్మా నువ్వు నాతో పాటే ఉండు, ఏం నాన్న ఏమంటారు అన్నాడు.
నేను అదే చెప్పాను రా విష్ణు కానీ తానే వెళ్తా అంది. అన్నాడు తన తప్పేం లేదన్నట్టు గా…. విష్ణు అలా అనడం చూస్తూ పుష్ప ఆశ్చర్య పోయి నీకు నేను తెలుసా ఎలా అన్నయ్య ఏంటిది నాకిచ్చిన వాగ్ధానం ఏమయ్యింది అన్నది అయోమయంగా .
అయ్యో అమ్మా ఇంకా ఏ కాలం లో ఉన్నావు నువ్వు హా నాన్న నిన్ను చూడడం మాట్లాడడం చూసి నేను తెలుసుకున్నా, ఇక ఇప్పుడు నీ మొహం చూసి ఇంకా నాకంతా అర్దం అయ్యింది.
నేను నీ కొడుకుని అని, ఎవడో మోసం చేస్తే, నాన్నకు నన్ను ఇచ్చేసి, నువ్వు ఎక్కడికో వెళ్లి ఉంటావ్ అని నాకు అర్దం అయిపోయింది.
అందుకే మళ్లీ నువ్వు ప్రమాణాలు, తొక్క అనగానే పరుగున వచ్చాను. ఇవ్వన్నీ వద్దు కానీ మనం అంతా కలిసే ఉందాం పదండి నాకు ఇద్దరు అమ్మలనీ నేను గర్వంగా చెప్పుకుంటాను. అన్నాడు విష్ణు.
అవును పుష్ప ఈరోజుల్లో పిల్లలు చెప్పకుండానే అన్ని తెలుసుకుంటున్నారు. మనం వారికి చెప్పాల్సిన అవసరం లేదు.
పదమ్మా మీ వదిన కూడా ఎంతో సంతోషిస్తుంది అన్నాడు నారాయణ. తన కన్నా ఎత్తుగా, బలంగా ఉన్న కొడుకును చూస్తూ కన్నీళ్లు తుడుచుకుని పదండి అంటూ పుష్ప కొత్త జీవితానికి ముందడుగు వేసింది.
– భవ్య చారు