పలుకుతేనెల వ్యాసార్ధం
కొన్ని పుస్తకాలు ఒక భావపరిమళాన్ని మనలో వ్యాపింపచేస్తాయి. ఎంచుకున్న అంశాలు… ఆ అంశాలను ఆవిష్కరించిన తీరు మనలను ముగ్ధుల్నిచేస్తాయి. మళ్ళీ మళ్ళీ చదివిస్తాయి. కథో, నవలో అయితే కొంత కాల్పనికత బరువును మోస్తాయి.
అయితే పుస్తకమో వ్యాససంకలనమయినప్పుడు అది వ్యాసార్ధమై రచయిత హృదయ వైశాల్యాన్ని ఆవిష్కరించే వెన్నెల జాబిలి కావొచ్చు. అసలు వ్యాసమంటే వచనం కదా. వచనం రాసి మెప్పించటం అంత సులువు కాదు.
వ్యాసం అందంగా ఆకట్టుకోవాలంటే పదాల కూర్పు, పొహళింపు వ్యాసానికి మరింత అవసరం అని గుర్తించాలి. అందుకే చాలా వ్యాసాలు భారంగా సాగుతూ చదువరిని ఆకట్టుకోవు…. అందుకు భిన్నం వోలేటి పార్వతీశంగారి వ్యాస సంకలనం “వ్యాసార్థం”.
ఆకాశవాణి, దూరదర్శన్ లలో ప్రయోక్తగా నాలుగు దశాబ్దాల అనుభవం, స్వరమాంత్రికుడిగా అనేక సభలలో ఆశువుగా మాటలను అల్లేనేర్పు, రచనా వారసత్వం ఇవన్నీ కలిసి ఈ పుస్తకాన్ని అక్షర పరిమళంతో నింపేశాయి. సౌకుమర్యాన్ని పరవశంతో పరిచాయి.
అందుకే ఈ సంపుటిలోని వ్యాసాలన్నీ వారు మన పక్కనే కూర్చుని చదివి వినిపించినంత హాయిగా ఉంటాయి. మొత్తం ఇరవై వ్యాసాలున్న ఈ “వ్యాసార్థం” పుస్తకం ప్రముఖుల రచనా పాటవాన్ని పరిచయం చేస్తుంది.
అయితే ఈ వ్యాసాలు కొన్ని సంక్షిప్తంగా కనిపిస్తాయి. వాటి పరిధి ఇంకొంచెం పెరిగితే బావుండేది కదా అనిపిస్తుంది. ఉదాహరణకు, చిలకమర్తి వారిపై వచ్చిన వ్యాసం కానీ, అమర గాయకుడు ఘంటసాలపై వచ్చిన వ్యాసంకానీ, కర్ణాటక సంగీత కళానిధి బాల మురళీకృష్ణ పై ఉన్న వ్యాసాలు అప్పుడే అయిపోయాయే అనిపిస్తుంది.
ఇక వోలేటి వారిది పండిత వారసత్వ కుటుంబం. తాతగారు వోలేటి పార్వతీశం వెంకటపార్వతీశ కవుల్లో ఒకరు. మాతామహులు కందుకూరి రామభద్రరావుగారు గొప్ప గేయకర్త. తండ్రి శశాంక కూడా గేయకవే. అందుకే శ్రుతపాండిత్యంతో పాటు వారసత్వ పాండిత్యమూ పార్వతీశం గారిని వరించింది…
వ్యాసమేదయినా వోలేటి వారిదే విశిష్ట ముద్ర. సరళ వాక్యాలు, తేనెధార లాంటి రచనా శైలి వారి వ్యాసాలకు వన్నె తెచ్చింది. ప్రౌఢ కావ్యాలను వారు ఎంతో కాంతిమంతంగా పరిచయం చేస్తారు వారు.
కృష్ణదేవరాయని ఆముక్తమాల్యదను వారు సమీక్షిస్తూ ఆ కావ్యాన్ని విడమరచి చెప్పిన తీరుకు కావ్యరహస్యాలను విశ్లేషించిన నేర్పుకు, ఆ కావ్యంలో రాయల సౌందర్య దృష్టిని వారు గమనించిన తీరుకు ముగ్ధులమవ్వాల్సిందే..
వర్ణ చిత్తరువుల కొలువు ఆముక్తమాల్యద అని వోలేటి వారంటే తెలుగువారి వరదాయిని కదా ఆముక్తమాల్యద అని అనిపించకమానదు.. ఈ సంపుటిలోని మొదటివ్యాసం శశాంక యశశ్చంద్రి
శశాంక పార్వతీశం తండ్రిగారే అని ముందే చెప్పుకున్నాం కదా. కానీ శశాంక రచనా వైభవాన్ని పరిచయంచేయటమే రచయిత ఉద్దేశం.
“శిరసెత్తు గగనమ్ముదాకా
చిరయశలు దశదిశలు ప్రాక
ఓ భారతపతాక
ప్రాగ్దిశా సౌభాగ్య రేఖ”
అన్న ఈ పల్లవి ఆనాడు ఆకాశవాణి ద్వారా తెలుగు లోగిళ్ళలో మారుమోగింది. పీడిత జనపక్షాన తన రచనా రథాన్ని నిలిపిన మానవీయకవి శశాంక అంటారు రచయిత..
గోదావరి నీళ్ళలోనే కవిత్వం ఉందంటారు రచయిత ఒక వ్యాసంలో. ఆ వ్యాసం పేరు “గోదావరి తూరుపు దారిలో- నవ కవితా ఝరి” తెలుగు నాట భావకవితా ఉద్యమం గురించి వివరిస్తూ వారంతా కవిత్వన్ని సౌందర్యవతారంగా ఉపాసించారంటారు.
దేవులపల్లి, పిఠాపురం రాజావారు, వేదుల సత్యనారాయణ శాస్త్రి, పిలకా గణపతిశాస్త్రి వంటి ఎంతోమంది భావక వితా కన్యకలను సృష్టించారంటూ పేర్కొంటారు.
అంకురారోపణం రాయప్రోలు వారిపేరిట ప్రచలితంగా నమోదైనా బీజావహనం కందుకూరి వీరేశలింగంవారి సరస్వతీ విలాపంతో జరిగిందని పేర్కొంటారు.
తెలుగు సాహితీ గౌతమీ తూరుపుతీరం నవకవితాఝరి అమృత తుల్యప్రవాహమై సాగిందని అందంగా వివరించే కోమల కుసుమం ఈ వ్యాసం…
“దృశ్య శ్రవణ మాధ్యమాలలో తెలుగుభాష-సాహిత్యం” అన్న వ్యాసంలో పత్రికా రచనకు రేడియో రచనకు రూపంలోనూ సారంలోనూ ఉండే భేదాలను చాలాలోతుగా వివరిస్తారు రచయిత. ఇప్పడు టీవీ మాధ్యమంలో జరుగుతున్న భాషాసంకరం పట్ల విచారమూ కనిపిస్తుంది.
రేడియో ప్రక్రియలైన సంగీత రూపకాలు, నాటకాలు, నాటికలు, కవిత్వము, లలిత గీతాలలో భాషను వినియోగించేటప్పుడు విధిగా పాటించాల్సిన జాగ్రతలను సుతిమెత్తగా చెప్పే వ్యాసమిది. ప్రాచుర్యం పొందిన లలితగీతాల పల్లవులను మనందరికీ జ్ఞప్తికితెస్తారు.
రేడియో మాధ్యమం తెలుగు సాహిత్యానికి అజరామరమైన పాటలను ప్రసాదించిందంటారు… గేయ రచనలో అసమాన ప్రతిభా మూర్తి కవి కందుకూరి రామభద్ర రావు పార్వతీశం గారి మాతామహులు. 50, 60 దశకాల్లో వారి లలిత గీతాలు ఆకాశవాణి శ్రోతలను సురభ పరిమళమై అలరించాయి.
‘”ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట
ఎంత పరిమళమోయి ఈ తోట పూలు
ఏ నందనము నుండి ఈ నారు తెచ్చిరో
ఏ స్వర్ణదీ జలము లీ మడుల కెత్తిరో
ఇంత వింతల జాతులీ తోటలో పెరుగు
ఈ తోట యేపులో నింత నవకము విరియు”
అన్న అపురూపు మైన పాటను మనందరకూ గుర్తు చేస్తారు. రచన ఎంత సున్నితమో రామభద్ర రావు గారి వ్యక్తిత్వమూ అంతే కాంతివంతం అంటారు రచయిత. తెలుగు నాట ఏకాంత సేవ కావ్యం ఎంత ప్రశస్తి పొందిందో అందరికీ విదితమే.
వెంకట పార్వతీశ కవులు కలం నుండి జాలువారిన భక్తి పరిమళమా కావ్యం. ఈ జంట కవులు ప్రకృతి కాంతను ధ్యానించి, ప్రేమించి, ఆరాధించి తాదాత్మ్యం చెంది రచించారంటారు రచయిత.
“వంగ భాషకు రవీంద్రుని గీతాంజలి ఎట్టిదో మన ఆంధ్రమున మహాకవుల భక్తుల ఏకాంత సేవ అట్టిది” అన్న దేవులపల్లి వారి వాక్యాలను గుర్తు చేసి ‘ఏకాంత సేవ’ కావ్య విలువను ప్రకటిస్తారు.
అత్యంత వేగంగా పద్యాలన అల్లి చదవటంలో ఖ్యాతి గడించిన కొప్పరపు కవులపై వచ్చిన వ్యాసంలో కావ్య కంఠ గణపతి ముని, వేదం వెంకట రాయ శాస్త్రి, వావికొలను సుబ్బారావు, వేటూరి ప్రభాకర శాస్త్రి, కొమర్రాజు లక్ష్మణరావు వంటి ధీమంతులు కొప్పరపు కవుల అవధానాలలో ఆసు కవితా ప్రదర్శనల్లో పాల్గొని వారి వేగాన్ని వీక్షించిన వారే అంటారు. ఈ వ్యాసం సవిస్తరంగా కొప్పరపు కవుల ప్రతిభకు పట్టం కడుతుంది.
జ్యోతి, రేరాణి, కినిమా,మిసిమి పత్రికల నిర్వహణతో ప్రచురణా మాధ్యమంలో సృష్టించిన ఆలపాటి రవీంద్రనాథ్ ని తలుచుకుంటూ తెలుసుకోవటం, తెలియ చెప్పటం రెండు కళ్ళుగా బతికిన దార్శనికుడు అంటారు.
‘పాద ముద్రలే కాదు పథ ముద్రలే’
అన్న వ్యాసంలో అలనాటి ఆకాశవాణి ప్రయోక్త ఆచంట జానకిరామ్ గారి పై వెలువరించిన ‘విస్మృత బాటలో ఒక స్మృతి పథం’ ఎంతో విలువైన వ్యాసం.
ఒక సందర్భంలో రచయిత విన్న ఒక ఉపనిషత్ కథలో ని ఆసక్తికర వాక్యాలను వారికి వర్తింప చేస్తూ వివరిస్తారు రచయిత.
ఎంత లోతైన వాక్యాలో అవి “ఏది చదివితే, ఏమీ చదవక పోయినా, అన్నీ చదివినట్లో, ఏది చదవకపోతే, అన్నీ చదివినా, ఏమీ చదవనట్ల”. ఎంత గొప్ప వాక్యాలో కదా.
అంత సందర్భోచితంగా ఈ వాక్యాలను ఆచంట జానకీ రామ్ గారి ‘నా స్మృతి పథం – సాగుతున్న యాత్ర’ పుస్తకానికి అన్వయిస్తారు శ్రీ పార్వతీశం. అలా ఒక గొప్ప వ్యక్తిని అవలీలగా మన మదిలో నింపుతారు.
ఆకాశవాణి పరిభాషలో వాక్చిత్రాలు లేదా సౌండ్ పిక్చర్స్ అన్న మాటను నిజం చేస్తుంది లేదా ఋజువు చేస్తుంది ఈ పుస్తకం అంటారు రచయిత. అది ఆచంట జానకీ రామ్ గారి సులభ శైలి అంటారు.
వాక్చిత్రం అంటే మాటతో మన హృదయాల పై బొమ్మ కట్టించడం. ఆ నైపుణ్యాన్ని ఈ పుస్తకంలో చూడొచ్చని కితాబిస్తారు రచయిత. ఇదే పుస్తకంలో డా.ఉమర్ ఆలీషా పై, ఘంటసాల పై, బాలమురళి పై, కొవ్వలి పై చిరు వ్యాసాలు ఉన్నాయి.
చివరికి మిగిలిన సగం అంటూ బుచ్చిబాబు గారి జ్ఞాపకాలను శివరాజు సుబ్బలక్ష్మి గారితో సంభాషించి మరీ వివరిస్తారు. ఇక స్మృతి సాహిత్యం పై అమృతాసృవులు అను గాద్గదిక వ్యాసం ఉంది. ‘తల్లీ నిను తలంచి’ అంటూ వారి అమ్మగారు వోలేటి హైమవతి గారిపై వ్రాసిన వ్యాసంలో ఓ మాట అంటారు.
‘అమ్మ ఒక గొప్ప శిల్పి. మా కుటుంబం అనే శిల్పాన్ని ఆమె చెక్కింది.’ అంటారు. ఎంత గొప్ప మాట. ప్రతి కుటుంబానికి వర్తించే విలువైన మాట.
వ్యాసార్ధం లోని 20 వ్యాసాలు మహా మహులు సాహిత్యాన్ని, పద్య సౌరభాన్ని కవితా కోమలతలు, నిష్పాక్షికంగా బేరీజు వేయటమే కాదు, పఠనం పూర్తయ్యాక ఒక తెలియని హాయిని, ఎంతో తెలుసుకున్న వైనాన్ని, ఒక కమ్మని వీణా నాదంలా మన మదిని శృతి చేస్తాయి.
అలనాటి వైభవాన్ని సాక్షాత్కరింప చేస్తాయి. పాటలా సాగే వచనంతో వ్యాసార్ధం చదువరులను చరితార్ధులు గావించే కార్తీక మాసం నదీ స్నానం లాంటిది అంటే అతిశయోక్తి కాదేమో. వోలేటి వారి వాక్పటిమతో బాటు రచనా చమత్కృతి ని దఖలు పరిచే సజీవ సాక్ష్యం ఈ పుస్తకం.
– సి.యస్.రాంబాబు