ప్రేమ + బాధ్యత = సైనికుడు
ఒక ఆదివారం మా నాన్న గారి దగ్గరకు బాల్ సింగ్ అనే అతను వచ్చాడు. మా నాన్నగారు ఉద్యోగ రీత్యా మెదక్ జిల్లా లోని ఒక మండలం లో ప్రభుత్వ ఉపాధ్యాయులు గా పని చేస్తున్నారు.
ఆ మండలంలో గిరిజనులు ఎక్కువగా ఉండేవారు. అయితే నాన్న గారు వారికి ఎలాగైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో కొందరికి ఆర్మీ లో ఉద్యోగాలు పడినప్పుడు చెప్పారు.
పదవ తరగతి అర్హతతో వాళ్ళు ఆ ఉద్యోగాలను సంపాదించారు. ఆ విషయం విని బల్ సింగ్ నాన్నగారి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. వారి సంభాషణ ఈ విధంగా సాగింది.
సార్ నేను ఆర్మీ లో జాయిన్ అవ్వలని అనుకుంటున్నాను సార్ అన్నాడు బాల్ సింగ్. అక్కడికి ఎందుకురా, అసలే తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకువి వాళ్ళను వదిలేసి ఆర్మిలోకి వెళ్లడం ఎందుకురా అన్నారు నాన్న.
ఏం ఒక్క కొడుకును సార్ ఒక్క కొడుకు కావాలని మా అయ్యా అయిదు మంది అమ్మాయిలను కన్నాడు. ఇప్పుడు వాళ్ళ బాధ్యత నా పైన పడింది. నేను ఏదో ఒక ఉద్యోగం చేయక పోతే ఇల్లు గడవని పరిస్థితి ఉంది సార్ అన్నాడు బాల్ సింగ్.
అదేంటీ అలా అంటావు. మీకు పొలం ఉంది కదా, దాంట్లో పంట రావడం లేదా? మీరు బాగానే పండిస్తారు కదా, దానితో మీరు బతుకుతారు కదా, నీ వాళ్ళను వదిలేసి నువ్వు అంత దూరం వెళ్లడం అవసరమా? ఉన్న ఊర్లోనే ఏదో ఒకటి చేసుకుని ఉండురా అంటూ నాన్న బాల్ సింగ్ కు హితవు చెప్పారు.
ఏ లేదు సర్ ఇక్కడ ఉంటే నా అక్కలను చూస్తూ నా తల్లిదండ్రులని బాధ పెడుతూ ఉండలేను. అదే ఆర్మీ లోకి వెళ్తే ఇవ్వన్నీ మర్చిపోయి హాయిగా ఉండొచ్చు. అన్నాడు బాల్ సింగ్.
కానీ పొలం ఉంది కదరా ఆ పొలం లో పంట వేస్తూ ఉండొచ్చు. అందరితో కలిసి ఉండొచ్చు. వాళ్ళ కళ్ళ ముందు ఉండొచ్చు. వాళ్లకు సంతోషంగా ఉంటుంది. కొడుకు కళ్ళ ముందే ఉన్నాడు అని అంటూ సర్ది చెప్పాలని నాన్న అన్నారు.
సార్ పొలం పొలం పంట పంట అంటున్నారు. ఆ పొలం లో విత్తనాలు వేస్తే అవి నకిలీ విత్తనాలు అయ్యాయి. ఎరువులు వేస్తుంటే అవి కూడా నకిలీ ఎరువుల వల్ల రెండేళ్లుగా పంట లేదు.
మేము రేషన్ బియ్యంతో రోజులు గడుపుతున్నము. అవి కూడా సరిపోవడం లేదు. ఒక్క పూట తిని ఒక పూట పస్తులు ఉంటున్నాం.
తిండికి కూడా గతి లేక మా అక్కలు ఎండు కట్టెలుగా అయ్యారు. కట్టెలు అమ్మినా కూడా డబ్బులు సరిపోవడం లేదు.
పంటలు సరిగ్గా లేక కూలి పనులు కూడా దొరకడం లేదు. ఇక్కడ పనులేవీ లేవు. పట్నం వెళ్ళి పనులు చేసుకోవాలి అనుకున్నా కూడా అక్కడ ఉండడానికి, నా తిండి కి ఖర్చులు అవుతాయి.
అవన్నీ చేసే బదులు ఆర్మీ లో జాయిన్ అయితే అక్కడ తిండి బట్ట అన్ని దొరుకుతాయి.
నాకు వచ్చిన జీతంతో నేను నా వాళ్లను బతికించుకోవచ్చు దేశం అంటే ప్రేమ ఉంది కానీ ఆ దేశం లో భాగం అయినా నన్ను కన్న తల్లిదండ్రులు అంటే నాకింకా ఎక్కువ ప్రేమ ఉంది.
వారు నన్ను కన్నందుకు నేను వారి రుణం కాస్తయినా తీర్చుకోవాలి అలాగే ఏదో చేస్తాడు అని నా పై నమ్మకం ఉంచిన నా తోబుట్టువులు వారికి ఏదైనా చేయాలి.
అందుకే సార్ ఆర్మీ లోకి పోతా అంటున్నా అన్నాడు బాల్ సింగ్ ఆవేదనతో…
నాన్న గారికి అతని మాటల్లో నిజం తెలిసింది. అతను దేశనికన్నా తన తల్లిదండ్రులను ఎక్కువ ప్రేమిస్తున్నాడు అని గ్రహించి, తల్లిదండ్రులను ప్రేమించే వాడు దేశాన్ని ఎక్కువ ప్రేమించగలడు అనుకుంటూ …
సరే బాల్ సింగ్ నేను నీ కోసం ఆర్మిలో జాయిన్ అవ్వడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాను. పది రోజుల్లో నువ్వు వెళ్లొచ్చు అక్కడ టెస్ట్ లన్ని పాస్ అవ్వాలి. కాబట్టి నువ్వు అన్నిటికీ సిద్దంగా ఉండు అన్నారు నాన్న గారు.
మంచిది సార్ మీరు మాలాంటి వారికి దారి చూపే దేవుడి లాగా మా ఊరికి వచ్చారు. మీకు వేల వేల దండాలు సార్ అంటూ నాన్న కాళ్ళ పై పడ్డాడు బాల్ సింగ్.
అయ్యో దీంట్లో నేను చేసింది ఏముంది రా నాకు తెలిసింది ఏదో చెప్పాను అంటూ అతన్ని లేవనెత్తి షేక్ హ్యాండ్ ఇస్తూ నీ తల్లిదండ్రులకు చెప్పు మళ్లీ వాళ్ళు నీ పై బెంగ పెట్టుకుంటారు.
బాగా తిను అంటూ నాన్న జేబులోంచి వెయ్యి రూపాయలు తీసి బాల్ సింగ్ జేబులో పెట్టారు. అయ్యో వద్దు సార్ అన్నాడు. పర్లేదు ఉంచు నీకు అక్కరకు వస్తుంది అంటూ అతన్ని పంపించారు నాన్నగారు.
అనుకున్నట్టుగానే బాల్ సింగ్ పదిరోజుల్లో అన్ని టెస్ట్ లు పాస్ అయ్యాడు. ఆర్మీ లోకి వెళ్తున్న రోజు నాన్న దగ్గరికి వచ్చి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్.
నాకు నా తల్లిదండ్రులకు ఒక దారి చూపిన దేవుడు సార్ మీరు అంటూ అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకుని అమ్మ చేతి వంట తిని మరి వెళ్ళాడు.
అందరూ దేశం పై ప్రేమతోనే కాదు. తల్లిదండ్రుల ను బాగా చూసుకోవాలని కూడా సైన్యం లో చేరతారని నాకు అప్పుడు అర్థం అయ్యింది.
తల్లిదండ్రులను ప్రేమించే వారు దేశాన్ని కూడా ప్రేమిస్తారు కదా. మరి మీరేమంటారు.. అలాంటి సైనికులకు అందరికీ…
సైనిక దినోత్సవ శుభాకాంక్షలు
-భవ్య చారు
,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌