నాన్నా నీవెక్కడ
సత్ ప్రవర్తన కలిగిన తండ్రి బ్రతికివుండగా తన తల్లికి మళ్ళీ ఎందుకుపెళ్లి చేయలనుకుంది కూతురు?
******
ఇక చదవండి…..
ఏంటి? నవ్య అన్నాన్ని అలా కెళుకుతున్నావ్! ఏమైంది ఆరోగ్యం బాలేదా? అని ప్రశ్నించింది అనిత. ఏం లేదు ఆంటీ, ఫ్రెండ్స్ అందరు కాలేజ్ లో మీ డాడీ ఏం చేస్తారు అని అడుగుతున్నారు, ఎప్పుడడిగిన మీరు కాని, అమ్మకాని ఏం చెప్పరూ, ఎదో విషయం చెప్పి దాటవేస్తారు, అసలు నాకు డాడీ ఉన్నాడా? చచ్చాడా అని అన్నం పళ్లెంలో చెయ్యి కడిగి విసురుగా లేచి రూమ్ లోకి వెళ్లి పెద్దశబ్దం వచ్చేలా తలుపులు మూసి, మంచం పై బోర్లాపడుకొని ఏడుస్తూ ఆలోచించ సాగింది డిగ్రీ చదువుతున్న నవ్య.
పుట్టి బుద్ది ఎరిగినప్పటి నుండి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది నవ్య, ఎన్ని సార్లు తండ్రి గూర్చి అడిగిన ఎదో ఒకటి చెప్పి దాట వేయడంతో మళ్ళీ అడగడం మానివేసింది నవ్య. కానీ, ఈ రోజు కాలేజీలో కొత్తగా వచ్చిన లెక్చరర్ మీ నాన్న గారు ఏం చేస్తారు అనేసరికి ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసుకొని చూస్తూవుంటే, ఎమ్మా నవ్య మీ నాన్నగారు ఏం పని చేస్తారు అని రెట్టించి అడగడంతో, కండ్లలో నీరు తిరుగుతుండగా లేరు చనిపోయారు అని నోటికి వచ్చిన అబద్దం చెప్పింది నవ్య.
అసలు తనకి నాన్న ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? లేదా చనిపోయాడా? కనీసం తన ఫోటో కూడా లేదెందుకు? కనీసం ఫోటో అయినా ఉండాలి కదా! తాను మంచివాడు కాదా? ఎందుకని నాన్న ఫోటో కూడా ఇంతవరకు చూడలేదు, తనకి కనీసం నాన్న ఫోటో ఇంటిలో ఉంచనంత తప్పు తాను ఏం చేసాడు? ఆలోచిస్తూ ఉండగా, నవ్య అన్నం మీద అలగడం ఏమిటమ్మా? మీ అమ్మ వస్తే నన్ను తిడుతుంది. ముందు లేచి అన్నం తినమ్మ అని చెయ్యి పట్టి లేవదీసింది నవ్య అత్త అనిత.
నాకేం వద్దు ఆంటీ అని అనిత చేతిని విసిరి కొట్టింది నవ్య. ఎందుకంత కోపం? మీ నాన్న ఏం సంసారి అనుకున్నావా? పచ్చి తిరుగుబోతు, తాగుబోతు. అలాంటి వాడి ముఖం చూసిన పంచమహాపాతకాలు చుట్టుకుంటాయ్, నిన్ను, నిన్నుగన్న ఆ మహా తల్లిని ఇంటిలో ఉంచుకొని మేపడందండగా అని ఎంత చెప్పినా వినని నా మొగుణ్ణి అనాలి అని విసురుగా బయటికి వెళ్ళింది అనిత.
****
నవ్య నీవు రాధ అక్క పెళ్లికి రెండు రోజులముందు వేళ్ళు టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి కాదా, నేను స్కూల్ కు వెళ్లక తప్పదు, మావయ్య అత్తమ్మలు పెళ్లి వరకు వస్తారు, నేను వీలుచూసుకొని వస్తాను అని బ్యాగ్ లో అన్ని ఉన్నాయో, లేదోనని సరి చూసుకొని స్కూల్ కు బయలు దేరబోయింది శోభ. నేను ఎక్కడికి వెళ్ళను మమ్మీ. పెళ్లిలో అక్కడ ఉన్నవారు ఎవరో ఒకరు మీ నాన్నపేరు ఏంటి అంటారు. పేరు చెపితే తాను ఏం చేస్తారు అని అడుగుతారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, చావాలనిపిస్తుంది.
అసలు నాకు నాన్న ఉన్నాడా? లేదా చచ్చాడా? ఏదో ఒకటి చెప్పు మమ్మీ నాకు విషయం ఇప్పుడే తెలియాలి అని ఏడుస్తూ అంది నవ్య. బ్యాగ్ ను పక్కకు పడేసి తాను ఏడుస్తూ నవ్యను దగ్గరకు తీసుకొని, మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తి తాను ఉన్నాడు. కాని, ఎక్కడ ఉన్నారో తెలియదు. నా దురదృష్టం కొద్ది నా ఆలోచన విధానం సరిగ్గా లేక తనని దూరం చేసుకొని, నీకు తండ్రిని దూరం చేసాను. మళ్ళీ తనకి మోహం చూపలేక, చావలేక చస్తూ, బ్రతుకుతున్నా అని వెక్కివెక్కి ఏడవసాగింది శోభ.
నాన్నను కలుద్దామా మమ్మీ అంది నవ్య, అది మళ్ళీ జరగదు తనకి నేను బ్రతికి ఉండగా మోహం చూపించలేను, మీ నాన్నకు నేను చేసిన ద్రోహం క్షమించరానిది. ఇక నన్ను ఏమి అడగకమ్మ ప్లీజ్, పెళ్లికి వెళ్లడం వెళ్లకపోవడం నీ ఇష్టం. నేను స్కూలుకు వెళుతున్న అని కంటినీరు కొంగుతో తుడుచుకుంటూ భారమైన మనస్సుతో బ్యాగ్ తీసుకొని బయటకు అడుగుపెట్టింది శోభ.
***
పెళ్లిలో అంతా హడావిడిగా ఉంది. పెళ్ళివారు చాలా పెద్ద బందువర్గం కలిగిన వారు కావడంతో, పెద్ద సంఖ్యలో బంధువులు రావడంతో, మండపం అంతా గోలగోలగా ఉంది. పెళ్లి పాటలు సౌండ్ సిస్టంలనుండి పెద్దగా వస్తుండడంతో ఒకరికి ఒకరు పెద్దగా మాట్లాడుకోవడం కనిపిస్తుంది అక్కడ. బందువులతో కలవలేక పెళ్ళి మండపంలో ఓ మూలకూర్చోని 40 సం.లు పై బడిన మగవారిని తదేకంగా చూస్తుంది నవ్య.
నాన్నగారికి కూడా ఈ పెళ్ళివారు బంధువులు అవుతారని నాన్నగారు వస్తారని పనిమనిషి ద్వార తెలుసుకొని హడావుడిగా బయలుదేరింది నవ్య. నాన్నగారి గూర్చి ఎవరినైనా అడుగుదాము అనుకుంటే ఎవరు ఏమనుకుంటారో అని మిన్నకుండి ఆలోచిస్తుంది నవ్య. మమ్మీ చేయరాని తప్పుడు పని ఏం చేసింది? నాన్న ఎందుకు అంత తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? తన మమ్మీ ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందా?
పుట్టి బుద్దిఎరిగిన నాటినుండి చూస్తుంది మమ్మీని, ఎవరు ఇంతవరకు తనని వేలు ఎత్తి చూపించలేదు ఛ,ఛ అలా అయివుండదు. కనీసం, నాన్న నన్ను ఒక్కసారైనా కలవాలి కదా, మమ్మి తప్పు చేస్తే, నాన్న నాకెందుకు శిక్ష వేసాడు? చిన్నపుడు పిల్లలందరు తల్లితండ్రులతో ఆటలాడుకుంటూ ఉంటె తాను ఎన్నిసార్లు నాన్న నాన్న నీవెక్కడా ఒక్కసారి కనిపించవు, దేవుడా నాన్నను ఒక్కసారి చూపించావు అని ఎన్ని వేలసార్లు కోరుకుందో, దేవుడా ఇప్పుడైనా నాన్నను చూపించవు అని మనసులో వేడుకుంటూ, కంటి నుండి వస్తున్న కన్నీటిని ఓనితో అద్దుకుంటూ తలవంచుకుంది నవ్య.
దూరంగా కూర్చొని నవ్యనే చాలసేపటినుండి గమనిస్తున్న శంకరలింగం మాస్టారు నవ్య దగ్గరకు వచ్చి ప్రక్కన కూర్చొని ఏయ్ అమ్మాయ్ అని రెండుసార్లు గట్టిగా పిలిచినా పలకకపోవడంతో తన చేతిలోని న్యూస్ పేపర్ తో చేతి మీద తట్టి మళ్ళీ గట్టిగా పిలవడంతో ఉలిక్కిపడి అయోమయంగా ప్రక్కకు చూసింది నవ్య. ఏంటమ్మా? ప్రక్కనుండే అంతగట్టిగా పిలిచినా పలకడం లేదు? ఎందుకు అంతదీర్ఘంగా ఆలోచిస్తూ ఏడుస్తున్నావ్? అని ప్రశ్నించాడు శంకరలింగం మాస్టారు.
ఏం లేదు తాతయ్య, ఏం లేదు అని తలవంచుకుంది నవ్య. నాపేరు శంకరలింగం, నేను టీచరగా రిటైర్ అయ్యాను. ఈ పెళ్ళివారు నాకు దగ్గర బంధువులు నీ పేరు ఏంటి? మీ అమ్మనాన్నల పేరు ఏంటి? మీది ఏ ఊరు? బృకిటిముడి వేస్తూ ప్రశ్నలవర్షం కురిపించాడు శంకరలింగం మాస్టారు. మా నాన్నగారి పేరు క్రిష్ణమూర్తి, మా మమ్మీ పేరు శోభ తాతయ్యా అని బదులిచ్చింది నవ్య. మరి మీ ఊరి పేరు ఏంటి? అని అనుమానంగా ప్రశ్నించాడు శంకరలింగం మాస్టారు.
మా ఊరు మంగపేట తాతయ్య అని బదులిచ్చింది నవ్య. మీ నాన్నగారు ఏం చేస్తారు అని ఉత్సాహకతో ప్రశ్నించాడు శంకరలింగం మాస్టారు. తెలీదు తాతయ్య నేను పుట్టకముందే మా మమ్మీతో డాడీ విడాకులు తీసుకున్నారట, డాడీ తాగుబోతు, తిరుగుబోతంట, చాలా చెడ్డవాడట తాతయ్య. మా డాడీ మీకు తెలుసా? అని ఏడుపు గొంతుతో ప్రశ్నించింది నవ్య. మీ నాన్నగూర్చి నీకు ఎవరో తప్పుడు మాటలు చెప్పారు, ఎవరో? ఏమిటి మీ మామయ్య వేంకటేష్ అయివుంటాడు అన్నాడు శంకరలింగం మాస్టారు.
మా మామయ్య కూడా తెలుసా మీకు, మా డాడీ ఈ పెళ్లికి వచ్చారా? నేను డాడీని చూడాలి తాతయ్య అని చుట్టుప్రక్కల చూస్తూ అంది నవ్య. లేదమ్మా, మీ డాడీ ఇక్కడి వారితో చాలా దూరంగా ఉంటున్నాడు. తాను మళ్ళీ ఇటువైపు రాడు, నీకు జరిగింది తెలియదు. చాలా మంచి వ్యక్తి మీ నాన్న అలాంటి వ్యక్తిని కోల్పోయిన మీ అమ్మ చాలా దురరదృష్టవంతురాలు.
కొందరు ఆడ పిల్లలలాగే మీ అమ్మ ప్రవర్తన ఉంది. తల్లిలా చూసుకోవాలిసిన అత్తను నాకేమి కాదనుకుంది మీ అమ్మ. నేడు చాల మంది కోడళ్ళు తాము ఎలాగైతే అత్తమామలను చూస్తున్నామో, తమ అమ్మానాన్నలని కూడా తమవదినలు అలాగే చూస్తారు అనే ఇంగీతజ్ఞానాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు నేటి ఆడపిల్లలు. దీనివల్ల తల్లిదండ్రుల పాలిట అదే శాపమై ఎంతోమంది మానసికక్షోభను అనుభవిస్తున్నారు.
తమ భార్యలను అదుపు చేయలేక, సంసారాన్ని బయట వేసుకోలేక తల్లిదండ్రులను దూరంపెట్టి తాము మానసిక క్షోభ అనుభవించే మగవాళ్ళు కోకొల్లలు, కాని “ఈరోజు తమ ప్రవర్తనను తమ పిల్లలు గమనిస్తున్నారని, వారు కుడా భవిష్యత్లో తమపట్ల తమలాగే ప్రవర్తిస్తారని తేలుసుకోలేని అజ్ఞానులు ఎందరో ఉన్నారు.” “సాలువెనక సాలువుంటుందని” మరిచి తమ తల్లిదండ్రులపట్ల జంతువుల్లా ప్రవర్తించే కుమారులు ఎందరో ఉన్నారు. కాని, మీ నాన్న అలా కాదు. నీతి నిజాయితీ, నిబద్దత, క్రమ శిక్షణ గలిగిన వ్యక్తి తాను.
మీ తాతగారి ఇంటి ప్రక్కనే మా ఇల్లు. నేను, మీ తాతయ్య అన్న దమ్ములం. నాకు పిల్లలులేరు, నేను రిటైర్ అయిన ఏడాదికే నాభార్య మరణించింది. ఒకరోజు మీ ఇంటి ముందు అదే మీ నాన్నగారి ఇంటిలో పెద్ద గొడవ అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళాను, అక్కడ చాలా మంది గ్రామస్థులు గుమ్మి గూడి ఉన్నారు…
******
నేనేమి నీ తల్లి తండ్రులకు సేవ చేయడానికి రాలేదు. “లక్షలకట్నం పోసి నిన్నుపెళ్లి చేసుకుంది, పక్షవాతంతో రేపో మాపో చావడానికి సిద్ధంగా ఉన్న దానికి సేవలు చేయడానికి రాలేదు. నువ్వేదో పట్నంలో ఉద్యోగం వెలగబెడుతున్నావని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ ముసలివారికి సేవలు చేస్తూ, మీ వాళ్ళు చచ్చేదాక ఇక్కడే ఉండాలి అంటే నేను ఉండను. ఉండను గాక ఉండను అని అరిచినట్లు అంటూ కృష్ణమూర్తి పైకి గయ్యిమని లేచింది శోభ.
అంతమంది ముందు అలా సభ్యత, సంస్కారం లేకుండా మాట్లాడుతున్న భార్యని ఏమని నిలవరించాలో ఆర్ధం కాక కోపంతో చాచి చెంపపై కొట్టాడు కృష్ణమూర్తి. శోభ ప్రక్కకు జరగడంతో దెబ్బ ముక్కు మీద బలంగా తాకడంతో, ముక్కునుండి రక్తం బొటబొటాకారడం శోభ సృహ తప్పడం వెంట వెంట జరిగిపోయాయి. ఈ పంచాయతీ గూర్చి తెలిసి ఒకరోజు ముందేచేరుకున్న శోభ అన్న వెంకటేష్ విచక్షణ కోల్పోయి బక్కపలచగా ఉన్న కృష్ణమూర్తిని ఇష్టమున్నట్లు కొట్టి, గాయపరిచి, తన చెల్లెలు శోభను తీసుకొని నిష్క్రమించాడు అక్కడి నుండి.
******
కొన్నిరోజులతరువాత కృష్ణమూర్తి ఎంతగా బ్రతిమిలాడినా, ఎవరు ఎంతచెప్పినా వినకుండా, తన అన్న వెంకటేష్ చెప్పినట్లుగా కృష్ణమూర్తికి విడాకులు ఇచ్చి కృష్ణమూర్తికి పూర్తిగా దూరం అయ్యింది శోభ. తన వల్లనే కొడుకు, కోడలు విడాకులు తీసుకున్నారని మనోవ్యాధితో కొన్నాళ్లకే కృష్ణమూర్తి తల్లి మరణించడం, ఆదేసమయంలో కృష్ణమూర్తి నాన్నగారు గుండెపోటుతో మరణించడంతో, ఇది అంతా తన అసమర్ధత వల్ల, తన భార్య వల్లనే కుటుంభం చిన్నా భిన్నం అయ్యిందని, భావిస్తూ అవమాన భారంతో ఆస్తులు తెగనమ్ముకొని గ్రామాన్ని విడిచాడు కృష్ణమూర్తి.
తనతో పాటు నేనుకూడా మీ నాన్నగారి వెంట వెళ్లిపోయాను. అమ్మ నవ్యా, మీ మామయ్య వస్తున్నాడు. నేను నీతో మాట్లాడడం చూస్తే అతను భరించలేడు. నాకు కూడా గ్రామంలో పని ఉంది అని, తన పాకెట్లో ఉన్న విజిటింగ్ కార్డ్ తీసి నవ్యకు ఇచ్చి వేగంగా అక్కడినుండి నిష్క్రమించాడు శంకరలింగం మాస్టారు.
*****
ఏంటి నవ్య మీ రౌడీ బావతో పెళ్లి కుదిరిందా ఏంటి? ముఖ్యమైన ఫ్రెండ్స్ ఐదుగురిని ఇక్కడ సమావేశ పరిచావు? మా ఇంట్లో అనుకుంటూ వుంటే విన్నాను, చిన్నప్పటి నుండి అనారోగ్యంగా ఉన్న మీబావను నీకు ఇచ్చి చేయాలనే నిన్ను, మీఅమ్మను ఇంటిలో ఉంచుకుంటున్నారని, మీ అమ్మ సంపాదనంత కుడా మీ మామయ్య తీసుకుంటున్నాడట కదా అలా అని అందరు అనుకుంటున్నారట నిజమేనా? అని ఉత్సాహంతో ప్రశ్నించింది క్లాస్మేట్ రవళి.
అప్పుడే పెళ్లిచేసుకోబోతున్నావా నిజమా అక్కడవున్న అందరూ ఏకకంఠంతో ప్రశ్నించారు, ఛ ఛ “పెళ్లినాకు కాదు, మా మమ్మీకి పెళ్లిచేయబోతున్నా” అని జవాబు ఇచ్చింది నవ్య, ఒక్కసారే ప్రక్కన బాంబు పడ్డట్టు ఏందీ? అని ఒక్కసారిగా నోరు వెళ్ళబెట్టారు ఫ్రెండ్స్.
నేను నిజమే చెబుతున్న, మా మమ్మీకి మళ్ళీ పెళ్లిచేయలనుకుంటున్నాను, మా మమ్మీకి ఇదివరకే పరిచయం ఉన్న మా బంధువుల్లో ఒకవ్యక్తి ఉన్నాడు, తాను కూడా ఒంటరిగా ఉన్నాడు. ఆ వ్యక్తి అయితే ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటుందని అనుకుంటున్నాను, ముందుగా చెబితే తాను రాదు. అందుకే, తనకి తెలియకుండా మనమే విహరయాత్ర పేరు తో మా మమ్మీని ఒప్పించి తీసుకవస్తాను.
అక్కడికి వెళ్ళాక మా మమ్మీకి కాబోయే భర్త కానీ, మా మమ్మీ కానీ పెళ్లికి నిరాకరిస్తే పెళ్లి జరగదు, ఇది కేవలం నాప్రయత్నం మాత్రమే, ఇకపోతే శ్రీకాకుళం లోని అరసవిల్లి సూర్యదేవాలయంలో ఈ పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నాను, మీరందురు నాకు సహకరించండి అంది నవ్య, అమ్మో మాఇంట్లో తెలిస్తే సంపుతారు.
ఇంకేమయినా ఉందా? అని భయపడుతూ అంది రవళి. భయం అక్కరలేదు పెళ్లి జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు, మనం కనీసం సూర్యదేవాలయం, మరియు వచ్చేటప్పుడు విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని వద్దాం ఏమంటారు అంది నవ్య, అంతదూరం వెళ్లాలంటే మీమమ్మి వస్తుంది అంటే పంపిస్తారు కాని డబ్బులు ఇవ్వరు. మరి ఎలా అని అంది సత్య. నేను చిన్నప్పటి నుండి డబ్బులు దాచుకుంటూన్నాను, అవి దారి ఖర్చులకు సరిపోతాయి, అయినా ప్రయాణం ఇప్పుడు కాదు వచ్చే నెల 6 న ఏమంటారు? అంది నవ్య. అందరు ఒక్కసారిగా ముక్తకంఠంతో మేము వస్తాము అని అన్నారు.
ఇంకొక్క విషయం మామమ్మీకి మళ్ళీ పెళ్లిచేయబోతున్న విషయం ఎవరికి చెప్పవద్దు, చివరినిమిషం వరకు నేను మామమ్మీకి కూడా చెప్పను అలా అని నాకు ప్రామిస్ చేయండి అని చెయ్యి చాపింది నవ్య, అందరు చేతిలో చెయ్యి వేసి ప్రామిస్, ప్రామిస్ అని జవాబు ఇచ్చి అందరు అక్కడినుండి నిష్క్రమించారు.
*****
ఈ సూర్యదేవాలయంనకు నేను మీనాన్నగారితో పందొమ్మిది సంవత్సరాల క్రితం వచ్చానమ్మ, ఆ రోజు మా పెళ్లిరోజు. ఇదే అన్నసత్రంలో మీ నాన్నగారు మా పెళ్లిరోజు సందర్భంగా అన్నదానం చేయించారు. విచిత్రంగా మళ్ళీ ఈ రోజు కుడా నా పెళ్లిరోజు కావడం విచిత్రం అంటూ కంటినుండి వస్తున్న కన్నీటిని పమిటకొంగుతో తుడుచుకుంటూ విస్తరిలో వేసిన అన్నాన్ని కెలుకుతూ ఉండిపోయింది శోభ.
మమ్మీ అన్నం తిను ముందు అంది నవ్య. నేను లోపలికి వస్తుంటే గేటు ముందు బోర్డ్ చూసాను, ఈ అన్నదానం చేయించేది శోభకృష్ణమూర్తి దంపతులట, పేర్లు భలే కలిసాయి కదా… నీ పేరు, డాడీ పేరు కలవడం విచిత్రంగా ఉంది. సరే ఒకసారి వారిని చూసి వెళ్దాం ఏమంటావు మమ్మీ అంది నవ్య. కలుద్దాం ఆంటీ అని అందరు కోరస్ గా అన్నారు నవ్య ఫ్రెండ్స్. సరే చూద్దాంలే అని బదులిచ్చింది శోభ.
****
సార్ ఇక్కడ కృష్ణమూర్తి దంపతులు ఎక్కడవున్నారు? అని అన్నదాన సత్రంలోని వెళ్లి అక్కడ కూర్చున్న వ్యక్తిని ఉద్దేశించి అడిగింది నవ్య. ప్రక్కనే సమావేశ మందిరం ఉంది, అందులో ఉన్నారమ్మ అన్నాడు ఆ వ్యక్తి. రండి మమ్మి వెళదాం, ఎవరో చూడాలి అని ఉత్సాహంతో నవ్య పరుగులాంటి నడకతో వెళుతుండగా వెనక శోభ, నవ్య ఫ్రెండ్స్ అనుసరించారు.
ఏంటి బాబాయ్ ఎవరైనా వస్తున్నారా? మాటమాటకి దర్వాజ వైపు చూస్తున్న శంకరలింగం మాస్టారును ఉద్దేశించి అన్నాడు కృష్ణ మూర్తి. అవును నాన్న నా మనమరాలి కోసం చూస్తున్న అని బదులిచ్చాడు శంకరలింగం మాస్టారు. మనమరాలా? నాకు తెలియని మనమరాలు కూడ ఉందా మీకు? అని భ్రుకుటి ముడి వడుతుండగా అన్నాడు కృష్ణమూర్తి. ఆదిగో వచ్చేసింది నా మనమరాలు నవ్య అని లోపలికి అడుగు పెడుతున్న నవ్యకు ఎదురెళ్ళాడు శంకరలింగం మాస్టారు.
నవ్య ను చూడగానే, కుర్చీలో అలాగే స్థంభించిపోయాడు కృష్ణమూర్తి. అవును ఈ అమ్మాయి ఎవరు? అచ్చు శోభలానే ఉంది. ఆమె కూతురు కాదు కదా, బహుశా భార్య భర్తలు వచ్చారేమో అని ఆలోచిస్తూ, ఒక్కసారిగా లేచి నిల్చొని తనని చూడడం ఇష్టం లేదన్నట్లు ప్రక్కదారి గుండా వెళ్ళడానికి రెండు అడుగులు వేసాడు కృష్ణమూర్తి. కృష్ణ ఆగు నాన్నా, ఈ అమ్మయి నీ కూతురు నవ్య. విడాకులకు ముందు శోభ కడుపుతో ఉంది. అనగానే స్థాణువులా, అయోమయంగా నిల్చుండి పోయాడు కృష్ణమూర్తి.
పిచ్చిపట్టిన దానిలా, నాన్న అని అరుస్తూ ఒక్క అంగలో కృష్ణమూర్తి మీద వాలిపోయి రోదించసాగింది నవ్య. తలమీద చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని తలను ఛాతికి ఆదుముకొని, నీవు పుట్టావనే విషయమే తెలియదు నాన్న అని కన్నీళ్ళు ధారగా వస్తుండగా, ఆనంద పారవశ్యంతో నవ్య తలమీద ముద్దుపెట్టుకున్నాడు కృష్ణమూర్తి.
జరుగుతున్నదంతా దర్వాజ బయటవుండి ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో చూస్తున్న శోభ కొద్ది కొద్దిగా అర్థమై ఇక అక్కడ ఉండలేనని భావించి వివర్ణమైన మోహంతో కంటి నుండి నీరు జాలువారుతుండగా గిరుక్కున వెనక్కితిరిగి వెళ్ళడానికి సిద్దమవుతుండగా, శోభ ఇటురామ్మ అని శంకరలింగం మాస్టారు పిలవగానే, తలెత్తి మాస్టారు కేసి చూసి చప్పున తలవంచుకుంది శోభ.
వెంటవున్న నవ్య స్నేహితులు శోభను పట్టుకొని ముందుకు నడిపిస్తుండగా మెల్లిగా అడుగులో అడుగువేస్తూ కృష్ణమూర్తి పాదాలపై ఒరిగి ఏడవ సాగింది శోభ. తనని లేపాలని అనిపించక స్థాణువులా ఉండిపోయాడు కృష్ణమూర్తి. నాన్న కృష్ణ, శోభ ఇప్పటివరకు పశ్చాత్తాపంతో కూడిన ఒకరకమైన జైలు లాంటి జీవితం గడిపింది. భర్తకు దూరమై చేసి పాపానికి ఇప్పటి వరకు అనునిత్యం నరకం అనుభవిస్తూనే ఉంది.
“విడిపోదాము అనుకునే దంపతులు ప్రతి ఒక్కరు జరిగినదానిలో తమ తప్పు ఎంత ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాలి” విడాకులు పొందిన నాటి నుండి సంతోషానికి దూరమైన శోభ గూర్చి, నేను పెళ్లికి వెళ్లినపుడు మన నవ్య నన్ను కలిసాక నేను పూర్తిగా తన గురించి తెలుసుకున్నాను. జరిగిపోయిన కాలం మళ్ళి రాదు. ఇప్పటికి నీవు తనని మరిచిపోలేదు, ఇంకా తన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నావు. మీ అమ్మాయి నా మనమరాలు నవ్య సూచన మేరకు, రేపు ఉదయం దేవుని సన్నిధిలో మీకు మళ్ళీ వివాహం చేయనిశ్చయించాము.
ఈ రాత్రికి మన ఆశ్రమంలోని వారు అందరిని పెళ్లికి రమ్మని పిలవాలి, ఇక పదండి ఈ పూట మీరు అందరం సత్రంలో రెస్ట్ తీసుకోండి, నేను, నవ్య ఆ ఏర్పాట్లలో ఉంటాము అని శంకరలింగం మాస్టారు అంటూ వుండగా, వంగి శోభ భుజాలపై చేతులువేసి లేపి అక్కువచేర్చుకున్నాడు కృష్ణమూర్తి.
*సమాప్తం*
– పోరండ్ల సుధాకర్