31st రాత్రి
31st కి మీరేం చేస్తారు? బీరు, బిర్యానీ, కేకు, క్యాండిల్స్ అన్ని తెచ్చేసుకుని, తింటూ తాగుతూ, ఊగుతూ, పబ్బుల్లో చిందులు వేస్తూ, తిన్నంత తిని, పారేసినంత పారేసి, తాగినంత తాగి, ఊగినంత ఊగేసేసి, బండి పై జూమ్ అని వెళ్తూ ఫైన్ లు కట్టేసి వాళ్లకు నజరానా ఇచ్చమ్రోయా అంటూ నవ్వుకుంటూ వెళ్తారా?
అవును రోయి నిజమే ఇవ్వన్నీ చేసేస్తాం.. హా అంతేగా మరి అయ్య కొనిచ్చిన బైక్ ఉంది. అవ్వ దగ్గర నుండి లాక్కున్న డబ్బుంది.
తల్లిదండ్రులను పిక్కొని తినే దమ్ముంది. ఏదన్నా అంటే చస్తాం అనే బెదిరింపులు ఉండనే ఉన్నాయి. ఇంకేం కావాలిరా ఎంజాయ్ కి ఇగ తాగుడే ఊగుడే…
అరెరే అక్కడెంటి రా ఆ చిన్న చిన్న గుడిసెల్లో ఉన్న వాళ్ళు అదిగో చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఏ కాలం అయినా పిడికెడు మెతుకులు కోసం రోజంతా కష్టపడే జీవులురా…
కప్పుకోవడానికి బట్టలు, కట్టుకునే గుడ్డలు లేక సగం సగం చినిగిన బట్టల్లో కనిపించే శరీరాన్ని అభిమానంతో కప్పుకుంటూ, మనం కావాలని చింపుకొని వేల రూపాయలు పెట్టీ కొనుక్కుని వేసుకున్న చిరిగిన బట్టలను వింతగా చూస్తూ, వీళ్ళు మన లాంటి వాళ్ళే అనుకుంటున్నారా?
అదేంటీ రా తాగడానికి గంజి లేదని బాధ పడకుండా ఉన్న దాంట్లోనే సర్దుకుని తింటూ, ఎలాంటి పండగ అయినా ఒకే రీతిగా జరుపుకుంటున్న వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నర్రా?
మనం మాత్రం తాగిన తాగుడు మత్తుకు ఎక్కి తలనొప్పితో బాధ పడుతుంటే, వాళ్ళు ఏంటిరా ఎలాంటి నొప్పి లేకుండా నవ్వుతూ గడుపుతున్నారు.
ఎదుటి వాడు ఏదో కొన్నాడు అని ఈర్ష్యగా చూస్తూ, వాడిపై అసూయా, ద్వేషాలు పెంచుకుంటూ ఉంటే వీల్లేంటి రా ఎదుటి వాడిపై ఎలాంటి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పెంచుకోకుండా వాడి బట్టలను అబ్బురంగా చూస్తున్నారు.
మనమేమో తల్లిదండ్రులను కష్ట పెడుతూ బెదిరిస్తూ బతుకుతూ మన గొంతెమ్మ కోరికలు తీర్చలేక సతమతం అయ్యే వాళ్లను చూస్తూ మానసిక రాక్షసత్వం అదే మానసిక ఆనందం పొందుతూ ఉంటే, వాళ్ళు ఏంట్రా తల్లిదండ్రుల కోసం రెక్కలు ముక్కలు అయ్యేలా పని చేస్తున్నారు.
అరే ఏంట్రా ఇది అలా వెళ్తున్నారు ఏంట్రా అయ్యయ్యో నేను నీతులు, చెప్పడం లేదు రా… నిజాలు మాత్రమే చెప్తున్నా.. కాస్త ఆలకించండి రా.. వెళ్ళకండి రా..
అయినా నీతులు చెప్పడం ఎవడికావాలి? అందరికీ ఉబ్బించడమే కావాలి. నా పిచ్చి కాకుంటే ఏదో పోసింది తాగి, పెట్టింది తిని అహో, ఓహో అనకుండా ఇలా చెప్పడం ఎవడికి మాత్రం నచ్చుతుంది.
ఒరేయి ఆగండి రా నాకు ఒక గ్లాస్ లో పోయండి.. వస్తున్నా వదిలేయకండిరా… వస్తున్నా వస్తున్నా మీ తోనే వస్తున్నా జంప్
Chala bhagundhi 👌👌