సమ్మక్క సారక్క జాతర చరిత్ర -పూర్తి సమాచారం రూట్ మ్యాప్ 2022

సమ్మక్క సారక్క జాతర చరిత్ర -పూర్తి సమాచారం రూట్ మ్యాప్ 2022

(గమనిక)

(ఈ ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరు దయచేసి మేడారం జాతరకు వెళ్ళిన ప్రతి ఒక్క భక్తునికి షేర్ చేయగలరు)

సమ్మక్క సారక్క జాతర చరిత్ర -పూర్తి సమాచారం రూట్ మ్యాప్ 2022:

వరంగల్ నగరానికి తూర్పు దిశగా చిలకలగుట్ట వైపు సాగుతూ సమ్మక్క అదృశ్యమైంది. గిరిజనులు అరణ్యమంతా గాలించినా ప్రయోజనం లేకపోయింది. నాగవక్షపు నీడలో ఉన్న పాము పుట్ట దగ్గర పసుపు కుంకుమలున్న భరిణె కనిపించింది. ఈ భరిణే సమ్మక్కగా గిరిజనులు జాతర చేసుకుంటున్నారు.

సారలమ్మ..

సమ్మక్క కూతురు సారలమ్మ. తల్లికి తగ్గ తనయ. కాకతీయులతో జరిగిన యుద్ధం లో మేడారం నుంచి కన్నెపల్లి వైపు వెళ్ల్లిన సారలమ్మ ఆ ప్రాంతంలోనే వీరమరణం పొందారు. దీంతో అక్కడివారు ఇలవేల్పు గా కొలుస్తున్నారు.

సమ్మక్క సారక్క జాతర చరిత్ర -పూర్తి సమాచారం రూట్ మ్యాప్ 2022

 

సమ్మక్క ఆగమనానికి ముందురోజు కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో ప్రధాన పూజారి కాక వంశీయులు ప్రత్యేక పూజలు చేస్తారు. కాలినకడన సారలమ్మను మేడారానికి తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్ఠించడంతో జాతర మొదలవుతుంది.

జంపన్న ..

సమ్మక్క కుమారుడు జంపన్న. కాకతీయులతో జరిగిన యుద్ధం లో శుత్రువు చేతికి చిక్కి చావడం ఇష్టంలేని జంపన్న పక్కనే సంపెంగవాగులో దూకి చని పోయాడు. అప్పటి నుంచి ఈ వాగును జంపన్న వాగుగా పిలుస్తారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు ఈ వాగులో స్నానాలు చేసిన తర్వాతే వన దేవతలకు మొక్కులు సమర్పిస్తారు.

పగిడిద్దరాజు..

సమ్మక్క భర్త పగిడిద్దరాజు. పెనక వంశానికి చెందిన పగిడిద్దరాజు కాకతీయులతో జరిగిన యుద్ధంలో పోరాడి వీర శత్రువుల చేతిలో చనిపోయాడు. మేడారం జాతర జరిగే మాఘశుద్ధ పౌర్ణమి నాడే పగిడిద్దరాజు చనిపోయారు.

చందా వంశీయులు..

మేడారం జాతరను మొదట బయ్యక్కపేటలో జరిపేవారు. ఇది మేడారానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. చందా వంశపు కోయ గిరిజనుల ఆడబిడ్డగా సమ్మక్క బయ్యక్కపేట లోనే జన్మించినట్లు చెప్తారు.

కాకతీయులతో జరిగిన యు ద్ధం అనంతరం అదృశ్యమైన సమ్మక్కను, ఆమె బిడ్డ సారలమ్మ ను బయ్యక్కపేట గ్రామస్తులు దేవతలుగా ప్రతిష్ఠించుకుని కొ లిచారు. ఊళ్లో కరువుకాటకాలతో జాతర చేయలేక పోయారు.

అప్పటికే ఆదివాసీ సిద్దబోయిన వంశస్తులు బయ్యక్కపేటలో జాతర నిర్వహించేవారు. కరువుతో తాము జాతర చేయలేమని, మేడారంలోనే జరుపుకోండని బయ్యక్కపేట వాసులు చెప్పారు. దీంతో ఆ జాతరను మేడారంలో జరుపుతున్నారు.

సంపెంగ వాగులో స్నానాలు

జంపన్నవాగుకు సర్వపాప హరిణిగా పేరుంది. నాటి సంపెంగ వాగే నేటి జంపన్నవాగు. కాకతీయ సైనికులతో పోరాడి న సమ్మక్క కొడుకు జంపన్న ఈ వాగులో వీరమరణం పొందడంతో దానికా పేరు వచ్చింది.

జంపన్న నెత్తుటితో తడిసిన ఈ వాగులో స్నానం ఆచరిస్తే చేసిన పాపాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం గద్దెల చుట్టుపక్కల ఎంత రద్దీ ఉం టుందో.. జంపన్నవాగు పరిసరాలు కూడా అంతే కిటకిటలాడుతాయి. వాగులో స్నానాలు చేసేందుకు భక్తులు ఆరాటపడతారు..

పూనకాలతో ఊగిపోతూ.. ఇక్కడా పూజలు చేస్తారు. జాతరకు వచ్చే ప్రతీ భక్తుడు ఈ వాగులో స్నానం చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్తారు. తలనీలాలను సమర్పిస్తారు.

సమ్మక్క సారక్క జాతర చరిత్ర -పూర్తి సమాచారం రూట్ మ్యాప్ 2022

 

చిలకలగుట్ట

మేడారానికి ఈశాన్యంలో జంపన్నవాగు ఒడ్డున చిలకలగుట్ట ఉంటుంది. ఈ గుట్టపైనే ఓ రహస్య స్థలంలో సమ్మక్క తల్లి ఉంటుందంటారు. జాతర జరిగే మూడు రోజులు మినహా మిగిలిన రోజుల్లో సమ్మక్క ఈ గుట్టపైనే ఉంటుంది.

దానితో గిరిజనులు ఈగుట్టను పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ గుట్టపైకి గిరిజన పూజారులు (వడ్డెలు) తప్ప ఎవరికీ ప్రవేశం లేదు. ఈ గుట్ట పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం రూ కోటి వ్యయంతో రక్షణ గోడను నిర్మిస్తోంది.

పూనుగొండ్ల..

కొత్తగూడ మండలంలో పూనుగొండ్ల గ్రామం ఉంది. ఇక్కడ సమ్మక్క భర్త పగిడిద్దరాజు గుడి ఉంది. పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి మేడారానికి తీసుకువస్తారు.

పెనక వంశ పగిడిద్దరాజును అదే వంశానికి చెందిన పెనక బుచ్చిరామయ్య అనే వడ్డె(పూజారి) పూనుగొండ్ల గ్రామం నుంచి కాలినడకన తీసుకువస్తారు. పూనుగొండ్ల నుంచి మేడారం వరకు నలభై కిలోమీటర్లు పగిడిద్దరాజును కాలినడకన వడ్డెలు తీసుకొస్తారు.

కన్నెపల్లి.

తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ పరిధిలో కన్నెపల్లి గ్రామం ఉంది. సారలమ్మ ఆలయం ఈ గ్రామంలోనే ఉంది. మేడారం సమ్మక్క – సారలమ్మ జాతర సమయంలో ఇక్కడి నుంచి జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వరకు సారలమ్మను వడ్డెలు(ఆదివాసీ పూజారులు) తీసుకు వస్తారు.

 

సమ్మక్క సారక్క జాతర చరిత్ర -పూర్తి సమాచారం రూట్ మ్యాప్ 2022

 

మొత్తం ఈ ఊరి జనాభా 242 మాత్రమే ఉంది. ఈ గ్రామం ప్రజలు ఏం చేయాలన్నా సారలమ్మ ఆశీర్వాదం తప్పనిసరి తీసుకుంటుంటారు. ‘మా వెన్నెలక్కకు సెప్పకుంటే ఇగ అంతే.. అమ్మో.. మేం ఏం సేయాలన్నా.. మా సారక్కకు సెప్పి సేత్తం’ అంటారు ఇక్కడి ఆదివాసీలు.

 

లక్ష్మీదేవర మొక్కులు.

లక్ష్మీ దేవర గుర్రపు ముఖం ఆకృతిలో ఉంటుంది. ఈ ప్రతిమను ధరించి నాయకపోడులు జాతరలో సందడి చేస్తారు. నాయకపోడులకు ఇది ఆరాధ్య దైవం. నాయకపోడు పూజారి లక్ష్మీదేవరను ధరించి దారిపొడవునా నృత్యాలు చేస్తూ గద్దెలకు వస్తారు.

ఈక్రమంలో వారికి గద్దెల వద్ద డోలు చప్పుళ్లు గజ్జెల మోతతో సందడి చేస్తారు. ఆ తదుపరి ఆదివాసీ సంప్రదాయం ప్రకారం తల్లులకు పూజలు జరుపుతారు. ఇలా చేస్తేనే తమను ఆ తల్లి సల్లంగ చూస్తదని నాయకపోడుల విశ్వాసం.

మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరలో లక్ష్మీదేవర మొక్కులు సందడి సందడిగా ఉంటాయి.

 

కొండాయి.

ఏటూరునాగారం మండలం కొండాయిలో సారలమ్మ భర్త గోవిందరాజులు ఆలయం ఉంది. జాతర సందర్భంగా వడ్డెలు, తలపతి, వర్తోళ్లు కలసి డోలు చప్పుళ్లతో కాలినడకన పన్నెండు కిలోమీటర్లు నడిచి మేడారం చేరుకుంటారు.

 

గోవిందరాజులు.

సారలమ్మ భర్త గోవిందరాజులు. దబ్బగట్ల వంశానికి చెందిన గోవిందరాజులు… మేడారానికి వచ్చిన సమయంలోనే కాకతీయులతో యుద్ధం జరిగింది. విలువిద్యలో ఆరితేరిన గోవిందరాజులు యుద్ధంలోనే వీరమరణం పొందారు.

ట్రాఫికర్..

ములుగు దాటిన తర్వాత పస్రా, తాడ్వాయి, మేడారంలో ఆర్టీసీ బస్‌స్టేషన్, నార్లాపూర్‌లలో ట్రాఫిక్ జాం అయ్యే ప్రాంతాలుగా పోలీసులు గుర్తించారు. ట్రాఫిక్ జాం అయితే క్రమబద్ధీకరించేందుకు వీలుగా ఇక్కడ క్రేన్‌లను ఏర్పాటు చేయనున్నారు. 23 పార్కింగ్ ప్లేస్‌లను సిద్ధం చేశారు.

 

Image

 

జాతరలో జర పైలం

జాతరకు వస్తున్న భక్తులు తమ పిల్లలను, విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. అపరి చితుల మాటలను నమ్మరాదు.

కొత్త వ్యక్తులను నమ్మి.. వారికి వస్తువులను అప్పగించరాదు. వారు మోసం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా వారు ఇచ్చే తినుబండారాలను స్వీకరించవద్దు.

మేడారం జాతరకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారి సమస్యలను పరిష్కరించడానికిగాను మేడారంలో ప్రత్యేక పోలీస్‌స్టేషన్ ఉంటుంది.

ఎలాంటి ఇబ్బం దులు ఎదురైనప్పటికీ వెంటనే పోలీసులకు తెలియజేయాలి. అన్ని ప్రాంతాల్లో 24 గంటలపాటు పోలీసుల గస్తీ, నిఘా ఉంటుంది.

 పోలీసుల సూచనలను పాటిస్తూ భక్తులు అమ్మవార్లను దర్శించుకుని, సంతోషంగా తిరుగు ప్రయాణం చేయాలి.

 జాతర పరిసర ప్రాంతాల్లో, జంపన్నవాగులో ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు, ప్లేట్ల వాడకం నిషేధించడమైంది.

Image

 

భక్తులు, వివిధ శాఖల సిబ్బంది, దుకాణాదారులు మేడారం, దాని పరిసర గ్రామాల్లో మాత్రమే విడిది చేయాలి. అడవిలో విడిది కాని, రోడ్ల వెంబడి విడిది చేయడం మంచిదికాదు. ముఖ్యంగా రాత్రి వేళల్లో దట్టమైన అటవీ ప్రాంతంతో కూడిన మేడారంలో ఉండరాదు. అడవికి నిప్పు పెట్టరాదు.

 వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరం. వాటిని వేధించడం చేయరాదు. ఎక్కడైనా అటవీ జంతువులు దొరికితే సంబంధితశాఖ వారికి అప్పగించాలి.

 చెట్లు, మొక్కలు, వెదురు నరికిన పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు.

 పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకుని విధిగా వ్యాధి నిరోధక టీకాలు తీసుకోవాలి.

 

Image

 

జాతర సమయంలో యాత్రికులు ఆరుబయట మల విసర్జన చేయరాదు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన మరుగుదొడ్లనే వినియోగించుకోండి.

 కలుషితమైన నీటిని సేవించరాదు. మంచినీటిని సేవించే సమయంలో ఆరోగ్య కార్యకర్తలు పంపిణీ చేసే క్లోరిన్ బిళ్లలను నీటిలో వేసుకోవాలి.

 నల్లాల వద్ద, చేతిపంపుల వద్ద, నీళ్లట్యాంకుల వద్ద స్నానాలు, మల, మూత్ర విసర్జనలు చేయరాదు. వేడి ఆహారాన్ని తీసుకోండి.

 మత్తు పానీయాలు, గుట్కాలు తీసుకోకండి. నోస్ ప్యాడ్‌లను వాడండి.

 భక్తులకు వాంతులు, విరేచనాలు, జ్వరం వస్తే వెంటనే జాతరలో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాలను సంప్రదించండి. సకాలంలో వైద్యచికిత్సలను పొందండి.

 కేశఖండన కోసం ఏర్పాటు చేసిన ప్రాంతంలోనే తలనీలాలను సమర్పించాలి. ఈ సందర్భంగా భక్తులు కొత్త బ్లేడ్లనే వాడకం చేయాలి.

 వాహనాలను విధిగా పార్కింగ్ స్థలాల్లోనే నిలపాలి.

గట్టమ్మ..

ములుగు సమీపంలో ఎతై ్తన గుట్ట కలిగి రహదారి ప్రమాదకరంగా ఉండడంతో తరచు ఇక్కడ ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. వాటిని నిరోధించేందుకోసం గుట్టపైన గట్టమ్మను నెలకొల్పినట్లు చెప్పుకుంటున్నారు. సమ్మక్క జాతర జరుగుతున్నప్పటి నుంచి ఇక్కడ గట్టమ్మకు మొక్కులను అప్పజెప్పుతూనే ఉన్నారు.

సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు గట్టమ్మను దర్శించుకొని వెళితే క్షేమంగా తిరిగి వస్తామని నమ్మకం.గట్టమ్మను నెలకొల్పి దశాబ్ధాలు గడిచిపోయిందని ఇ క్కడి పూజారులు చెప్పుకుంటారు. తమ తాతముత్తాల నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నామని ఈప్రాంత ప్రజలను తన చల్లని చూపులతో రక్షిస్తుందని వారి ప్రగాఢ విశ్వాసం.

Image

 

పొరుగు రాష్ట్రాల భక్తులు.. చుట్టాలు

మేడారం జాతరకు మన రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ల నుంచి ఆదివాసీలు, గిరిజనులు వివిధ మార్గాల్లో వస్తారు. గోదావరి మీదుగా వేకువజామునే తెప్పలపై, మరబోట్లు, నాటపడవల మీదుగా పిల్లాజెల్లలతో, జాతర సంరంజామాతో ఏటూరునాగారం మండలంలోని తాళ్లగూడెం రేవుకు జట్లు జట్లుగా వస్తారు.

 

ఎన్నోఏళ్లుగా వీరు ఊరట్టం, కన్నెపల్లి పరిసర ప్రాంతాల్లోనే తమ బసను ఏర్పాటు చేసుకుని జాతర సంబురాల్లో పాల్గొంటారు. ఇక్కడి స్థానిక గిరిజనులను పేర్లు పెట్టి పిలిచేంత చనువు ఛత్తీస్‌గఢ్ ఆదివాసీలకు ఉంది.

జువ్విచెట్టు..

మేడారం సమ్మక్క-సారలమ్మ ప్రాంగణంలో సమ్మక్క గద్దె పక్కన ఉన్న జువ్విచెట్టును ఎంతో మహిమ గలదిగా భక్తులు చెప్పుకుంటారు. దీనిపై నాగుపాము రూపంలో పగిడిద్దరాజు భక్తులకు దర్శనమీయడమే కాకుండా సమ్మక్కను మొత్తం ఎంతమంది వచ్చారో వీక్షిస్తుంటాడని ప్రతీతి. అయితే పగిడిద్దరాజు తన వద్దకు వచ్చే భక్తులపై మనసు పారేసుకుంటాడనే ఉద్దేశంతో సమ్మక్కతల్లి భర్తకు కళ్లు లేకుండా చేసి గుడ్డి నాగుపాము రూపంలో చెట్టు పైన ఉంచిందంటారు.

ఎదురుకోళ్లు..

సమ్మక్క- సారలమ్మల వీరత్వానికి ఎదురుకోళ్లు ప్రతీకగా నిలుస్తాయి. తల్లులను గద్దెలకు తీ సుకువచ్చే క్రమంలో భక్తులు ఎదురుకోళ్లతో ఆహ్వా నం పలుకుతారు.. తమ చేతుల్లో ఉన్న కోడిని తల్లులకు ఎదురుగా వేస్తూ మనసారా మొక్కుకుంటారు. కోరిన కోర్కెలు నెరవేర్చాలని వేడుకుంటారు. జాతర సమయంలో ఎటు చూసినా ఈ ఎదురుకోళ్ల సందడే కన్పిస్తుంది. గద్దెల వద్ద ఇది మరింత ఎక్కువగా ఉంటుంది.. ఎదురుకోడి వేసిన అనంతరం దాన్ని వండుకుని ఆరగిస్తారు.

నిలువెత్తు బంగారం

ఎక్కడా లేని బెల్లం మొక్కు ఆనవాయితీ మేడారంలో కన్పిస్తుంది.. తమ వద్దకు వచ్చే భక్తులు మనసారా మొక్కుకుంటే చాలని..కానుకలు వేయాల్సిన అవసరంలేదని ఆ తలు ్లలే చౌక గాఉండే బెల్లం మొక్కులను ఇష్టపడతారని ఆదివాసీలంటా రు. సమ్మక్క తల్లికి బెల్లం ఎక్కువ ఇష్టమని దేవుడి వరంతో పుట్టిన తల్లి ఎక్కువగా బెల్లాన్నే తినేదని చెప్తారు. అందుకే ఆమెకిష్టమైన బెల్లాన్ని సమర్పించి కోరికలు నెరవేర్చుకుంటారు. తమ కోరికలు నెరవేరితే నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కుకుని తప్పనిసరిగా చెల్లిస్తారు. దీంతో మే డారం జాతర సమయంలో బెల్లం గిరాకీ భలేగా ఉంటుంది. గద్దెల వద్ద టన్నుల కొద్దీ బంగారం పేరుకుపోతుంది.

 

Image

 

శివసత్తులు..

జంపన్నవాగుల్లో అబ్బియా.. నా తల్లీ సమ్మక్కా అబ్బియా అంటూ శివసత్తుల పూనకాలు..పూజలు ఇక్కడ ప్రత్యేకంగా ఉంటాయి. జాతరలో శివసత్తుల విన్యాసాలు ఓ విశేషం. ఎక్కడ చూసినా వీరకోలా పట్టుకుని చేసే హంగామా భక్తులను సంబరానికి గురిచేస్తుంది. ఆడవారే కాదు..మగవారు కూడా శివాలు ఊగుతూ జాతరకు వస్తారు. తల్లుల సేవకు అంకితమైన వారు మేడారం ప్రతీ జాతరకు వస్తారు. వీరంతా జంపన్నవాగులో పుణ్యస్నానం ఆచరించిన తదుపరి పసుపుతో అలంకరించుకుంటారు. వీరకోలాను చేతబట్టి పూనకాలతో ఊగిపోతూ గద్దెల వద్దకు వస్తారు.. భక్తి భావంతో వీరు చేసే తల్లుల స్మరణలు అందరినీ ఆకర్షిస్తాయి.

ఒడిబియ్యం..

భక్తులు సమ్మక్క-సారలమ్మ తల్లులను ఆడపడుచులుగా భావించి ఒడి బియ్యం మొక్కులు చెల్లిస్తారు. 5 సోళ్ల బియ్యంలో పసుపుకుంకుమ, రవిక ముక్కలు, కుడుకలు, చీరలు ఉంచుతారు. దర్శనమయ్యాక తల్లులకు ఈ బియ్యం సమర్పిస్తారు.

వరం పట్టడం..

సంతానం లేని భక్తులు జంపన్నవాగులో స్నానమాడి కన్నెపల్లి సారలమ్మ గుడి వద్ద వరం పట్టి, ముడుపులు కడతారు. వచ్చే జాతర నాటికి సంతానం కలగాలని నిష్టతో మొక్కుకుంటారు. పూజారులు వీరిపై నుంచి దాటుతూ వెళతారు.

వరంగల్‌లో బస్ పాయింట్‌లు

మేడారం జాతరకు తరలివెళ్లే భక్తుల సౌకర్యార్థం వరంగల్ నగరంలోని హన్మకొండలోని హయగ్రీవాచారి మైదానం, వరంగల్‌లో పాత గ్రెయిన్ మార్కెట్, కాజీపేట్‌లోని ైరె ల్వే స్టేషన్ సమీపంలో బస్సు పాయింట్‌లను ఆర్టీసీ ఏర్పాటు చేసింది.

బస్సు, రైల్వే రూట్లు

రైలు మార్గాల ద్వారా వచ్చే భక్తులు వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లలో దిగాలి. ఈ రెండు స్టేషన్ల దగ్గర నుంచి ఆర్టీసీ మేడారం వరకు బస్సులను నడిపిస్తోంది.

మేడారం జాతరకు వచ్చే వాహనాల రద్దీ దృష్ట్యా వివిధ రూట్లలో వచ్చే ఆర్టీసీ బస్సులు తాడ్వాయి మీదుగా మేడారం వెళ్తాయి. ప్రైవేటు వాహనాలు పస్రా మీదుగా మళ్లిస్తారు.

వరంగల్ మీదుగా ఆర్టీసీ బస్సుల్లో వచ్చే భక్తులు ములుగు, పస్రా మీదుగా తాడ్వాయి చేరుకుని అక్కడి నుంచి మేడారం వస్తారు. మేడారంలో ఇంగ్లిష్ మీడియం పాఠశాల దగ్గర ఆర్టీసీ బస్ స్టేషన్ ఉంది.

ఖమ్మం జిల్లా కేంద్రంతో పాటు ఇల్లందు, నర్సంపేటల మీదుగా వచ్చే ఆర్టీసీ బస్సులు మల్లంపల్లి, ములుగు, తాడ్వాయి మీదుగా మేడారం చేరుకోవచ్చు

కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే భక్తులు పెద్దపల్లి, మంథని, కాటారం, బోర్లగూడెం, బయ్యక్కపేటల మీదుగా మేడారం చేరుకుంటారు.

కోస్తాంధ్ర, భద్రాచలం, కొత్తగూడెంల మీదుగా వచ్చే భక్తులు మంగపేట, ఏటూరునాగారం, తాడ్వాయిల మీదుగా మేడారం చేరుకోవాలి

హుజురాబాద్, పరకాల మీదుగా వచ్చే బస్సులు గణపురం, జంగాలపల్లి మీదుగా తాడ్వాయి చేరుకుని మేడారం వస్తాయి.

హైదరాబాద్ మీదుగా వచ్చే అన్ని బస్సులు, ప్రైవేటు వాహనాలు వరంగల్ చేరుకుని ములుగు మీదుగా మేడారం వస్తాయి.

సిద్దిపేట నుంచి వచ్చే వారు జనగామ, హన్మకొండ మీదుగా మేడారం చేరాలి.

పెట్రోలు బంకుల వివరాలు

ప్రధానమైన వరంగల్-మేడారం దారిలో వరంగల్ నగరం దాటిన తర్వాత వచ్చే ముఖ్యమైన పెట్రోలు బంకుల వివరాలు… ఆరేపల్లి వద్ద రెండు, ఓగ్లాపూర్ వద్ద ఒకటి, గూడెప్పాడ్ వద్ద 2 , మల్లంపల్లి వద్ద 1, ములుగు వద్ద 1, జంగాలపల్లి -1, పస్రా వద్ద ఒకటి ఉన్నారుు. వివిధ కంపెనీల పెట్రోలు బంకులు అందుబాటులో ఉన్నాయి.

Image

 

వైద్య సేవలు

వరంగల్-మేడారం రోడ్డులో వైద్యసేవలకు సంబంధించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు దామెర, ఆత్మకూరు, ప్రసా, గోవిందరావుపేట, తాడ్వాయి, మంగపేటలలో ఉన్నాయి. ములుగు, ఏటూరునాగారంలలో 30 పడకల ఆస్పత్రులు ఉన్నాయి. మేడారంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి ప్రత్యేక వైద్య నిపుణులు 18, వైద్యులు 300, పారామెడికల్ సిబ్బంది 600 మంది జాతర విధుల్లో పాల్గొంటున్నారు.

 

గద్దెల సమీపంలో ఉన్న టీటీడీ కళ్యాణమంటపంలో 60 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు చేశారు. ఇక్కడ ఐదుగురు గైనకాలజిస్టులు, ఐదుగురు మత్తు డాక్టర్లు, ఎనిమిది మంది మెడికల్ ఆఫీసర్లు, ఆరుగురు పిల్లల వైద్యులు, ఇద్దరు ఆర్థోపెడిక్ నిపుణులు, ఇద్దరు జనరల్ మెడిసిన్ డాక్టర్లు అందుబాటులో ఉంటారు.

 

వీరితో పాటు 20 మంది స్టాఫ్‌నర్సులు, 20 మంది ఫార్మసిస్టులు సేవలందిస్తారు. జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్, నార్లాపూర్‌లో 12 వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పస్రా, తాడ్వాయి, మేడారంలలో పది పడకలతో ఎమర్జెన్సీ సెంటర్లున్నాయి.

108, 104లతో ఇతర ప్రైవేటు అంబులెన్సులు కలిపి 30 అంబులెన్సులు వరంగల్ నగరం నుంచి మేడారం వరకు ప్రతీ పది కిలోమీటర్లకు ఒకటి 24 గంటలు అందుబాటులో ఉంటాయి.

ఆచార వ్యవహారాల్లో ప్రత్యేకం

సమ్మక్క తల్లిని నిష్టగా కొలిచే మగ భక్తుల్లో కొందరు శివసత్తులుగా మారుతారు. వీరి జీవితం తల్లులకే అంకితం. వీరు జాతర సమయంలో ముఖానికి, కాళ్లకు పసుపు రాసుకుంటారు. చీరసారె కట్టుకుని వచ్చి తల్లులను దర్శించుకుంటారు. వీరికి అమ్మవారు పూనినప్పుడు శివాలెత్తుతారు.

కోళ్లు.. మేకల బలి

మేడారం జాతరలో కోళ్లు.. మేకలను తల్లులకు బలిస్తారు. అమ్మల దర్శనం అనంతరం వీటిని బలిచ్చి విందు చేసుకుంటారు. తల్లుల ప్రసాదంగా దీనిని భావిస్తారు.. మాంసానికి మద్యం, కల్లు కూడా తోడు చేసుకుంటారు. జాతరంటేనే..మందు మజా అంటారు. ఇంటిల్లిపాదీ గుడారాల వద్ద మందు చుక్క మాంసం ముక్కతో ఆనందంగా గడుపుతారు.

కొబ్బరికాయలు

వనదేవతలను దర్శించుకునే ముందు భక్తులు సమ్మక్క, సారలమ్మ తల్లులకు రెండు కొబ్బరికాయలు కొడతారు. ఈ సమయంలో పసుపు, కుంకుమలతో పాటు అగరొత్తులు చెల్లించి దేవతలకు మొక్కుకుంటారు.

ఊయలలు

అమ్మలను మొక్కుకుంటే సంతానం కలిగిన దంపతులు తమ మొక్కులను తీర్చుకునే క్రమంలో భాగంగా గద్దెల సమీపంలో ఊయలతొట్టెలను కడతారు. తమ పిల్లలు చల్లగా ఉండేలా దీవించమని మొక్కుకుంటారు.

సమ్మక్క-సారలమ్మ మండలంగా తాడ్వాయి

మేడారం గ్రామం తాడ్వాయి మండల పరిధిలో ఉంది. గిరిజనులు ఎప్పటి నుంచో మండలం పేరు మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. 2013 డిసెంబర్‌లో తాడ్వాయి మండలం పేరును సమ్మక్క-సారలమ్మ తాడ్వాయి మండలంగా మార్చుతూ గెజిట్ విడుదలైంది.

(గమనిక)

(ఈ ఆర్టికల్ చదివిన ప్రతి ఒక్కరు దయచేసి మేడారం జాతరకు వెళ్ళిన ప్రతి ఒక్క భక్తునికి షేర్ చేయగలరు)

0 Replies to “సమ్మక్క సారక్క జాతర చరిత్ర -పూర్తి సమాచారం రూట్ మ్యాప్ 2022”

  1. మీరు అన్ని విషయాలు చక్కగా వివరించారు.మీకు ధన్యవాదాలు🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *