రెక్కల మీద నిలబడిన అమ్మాయి
( మొదటి భాగం)…
“హరీ!! ఈరోజు మధ్యాహ్నం ఎలాగైనా సరే సిటీ లోని ఆశ్రమాలన్నీ ఒక లిస్ట్ చేసుకుని రేపు ఆదివారం నాడు చూసి రావాలి” అన్నది వసుంధర
హరి వసుంధర పొద్దున్నే టిఫిన్ తినడానికి గణేష్ దర్శన్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి వచ్చారు.. వసు ఇడ్లీ, హరి పూరి ఆర్డర్ చేసి సెల్ఫ్ సర్వీస్ కాబట్టి తెచ్చుకుని ఎదురుబదురుగా కూర్చుని తింటున్నారు…
” అన్నీ ఒకే రోజు ఎలా అవుతాయి వసు.. చూద్దాం లే!! ” అన్నాడు హరి..
” ఊహూ!! ఎలాగైనా సరే మన పెళ్ళికి ముందే ఈ పని అయిపోవాలి.. ఇది నిర్ధారణ అయ్యాకే మన పెళ్ళి..గుర్తు పెట్టుకో..” అన్నది వసుంధర..
” అబ్బా!! వసూ!! నేను కాదన్నానా!! నేను నా ‘ప్రేమ’ వ్యక్తం చేసినప్పుడు నువ్వు పెట్టిన మొదటి షరతు అదే కదా!! కానీ అన్నీ కలిసి రావద్దూ!! ..సరే నీ మాట ఎందుకు కాదనాలి.. మధ్యాహ్నం లంచ్ తర్వాత కలుద్దాం..ప్లాన్ చేద్దాం.. సరేనా!! మరి ఇప్పుడు బయల్దేరుదామా!!..లేకపోతే నీకు నాకు కూడా మన బాస్ల దగ్గర్నుంచి అక్షింతలు పడతాయ్” చిరునవ్వు నవ్వుతూ తన లాప్టాప్ బాగ్ తీసుకుని హ్యాండ్ వాష్ దగ్గరకు చెయ్యి కడుక్కోడానికి వెళ్ళాడు హరి… వసు కూడా అతన్ని అనుసరించింది..
హరి వసుంధర ఇద్దరూ కూడా అనాథలు.. మొదట్నుంచీ కూడా కరుణాలయం అనే అనాధాశ్రమంలో పెరిగారు… అది ఒక ఎన్జిఓ సంస్థ నడుపుతున్న ఆశ్రమం.. వాళ్లకు గవర్నమెంట్ నుంచి కొద్దిగా గ్రాంట్లు వస్తాయి.. అవి కాక చాలా మంది విరాళాలు కూడా ఇస్తారు..దాతలు అందులో పెరిగే ఒక్కో పిల్లకి లేక పిల్లాడికి డబ్బులు కట్టి పోషకులుగా వుంటారు..అంటే వారికి సంవత్సరానికి ఇంత అని డబ్బు కట్టేస్తారు వాటితోనే ఆ బిడ్డ తిండి బట్ట విద్యా వైద్య సౌకర్యాలు కల్పించబడతాయి…
అలాగే వసుంధర హరి కూడా పోషకుల సహాయంతోనూ, స్కాలర్షిప్ సహాయంతోనూబాగా చదివి ఇంజినీరింగ్ చేశారు.. క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగాలు కూడా వచ్చాయి… ఒకరంటే ఒకరికి మొదటినుంచీ ఇష్టమే… తర్వాత్తర్వాత ఆ ఇష్టం ప్రేమగా పరిణమిల్లింది…
కానీ వసుంధరకు జీవితం పై ఒక అసంతృప్తి.. హరి వసు కూడా జీవితంలో ఎంతో కష్టపడి పైకొచ్చారు ..వారితో పాటు చాలా మంది పిల్లలు వున్నా పైకెదిగే అవకాశాలు అందరికీ ఒకే విధంగా దొరకలేదు..కొంతమందికి అవకాశాలు దొరికినా పైకి రాలేక చదువు సంధ్యలు అబ్బక ఏదో చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరి పోయారు.. కొంతమందికి అదీ లేదు…. అదృష్టం అందర్నీ ఒకేలా వరించదు కదా!! ఆ మాటకొస్తే హరి వసు అదృష్టవంతులే… కానీ వసుకి స్కూల్లో ,కాలేజీల్లో చదువుకుంటున్నప్పుడు మిగతా వారిలా తనకూ ఒక కుటుంబం వుంటే బాగుణ్ణు అనిపించేది…
వాళ్ళ ఆశ్రమంలో ఒకసారి తనతో పాటు వుండే తన స్నేహితురాలు పద్మను దత్తత తీసుకోడానికి ఎవరో దంపతులు వచ్చారు.. తనకి అప్పుడు పదేళ్లు.. దత్తత అంటే ఏమిటో అప్పుడే తెలిసింది తనకు..పద్మను వాళ్ళు వాళ్ళింటికి తీసుకెళ్ళి వాళ్ళ కూతురిగా చేసుకుని పెంచుతారుట..విని ఎంతో ఆనంద పడింది.. కానీ పద్మ తనని వదిలి వెళ్ళిపోతున్నందుకు ఎంతో బాధ పడింది…
పద్మ ఆశ్రమం వదిలి వెళ్ళాక కొన్ని రోజులకు తనను వాళ్ళింటికి తీసుకెళ్ళింది… ఎంత బాగుందో ఆ ఇల్లు..పద్మకి విడిగా ఒక గది దాన్నిండా ఆట బొమ్మలు.. ఎంతో ప్రేమగా చూసుకునే అమ్మా నాన్నా..వాళ్ళమ్మ దగ్గరుండి గోరు ముద్దలు తినిపిస్తోంది పద్మకు..అమ్మ ప్రేమ అంటే ఇలా వుంటుందని అప్పుడే చూసింది వసు.. ఎంత బాగుందో అనిపించింది.. తనకు కూడా అమ్మా నాన్నా వుంటే బాగుణ్ణు అనిపించింది వసుంధరకు..
అక్కడ్నుంచి వచ్చిన దగ్గర్నుంచి వసుంధరకు ఒకటే ఆలోచన…ఆ అదృష్టం తనకు లేదా!! తనను ఎవ్వరూ తీసుకెళ్ళి దత్తత తీసుకోరా అని .. ఎవ్వరు ఆశ్రమం చూడ్డానికి వస్తున్నారన్నా పిల్లలందరూ బాగా తయారయి వుండే వాళ్ళు.. వాళ్ళల్లో ఎవరు వారికి నచ్చుతారో వారిని దత్తత చేసుకుని తీసుకెళ్లే వారు… ఎవ్వరు వస్తున్నారన్నా వసుకు ఆశ కలిగేది..వాళ్ళు వెళ్ళాక మళ్ళీ నిరాశే…కొంచెం పెద్దదయ్యాక ఆ నిరీక్షణ అనవసరమని అనిపించి తన భవిష్యత్తు తానే నిర్మించుకోవాలని కష్టపడి చదువుకుంది…
– భరద్వాజ్